ఏపీ బడ్జెట్‌: వ్యవసాయానికి మంచి రోజులు | AP Budget; Allocated Rs 100 Crore For The Establishment Of Rythu Bharosa Centres | Sakshi
Sakshi News home page

వ్యవసాయ రంగానికి రూ.11,891.20 కోట్లు

Published Tue, Jun 16 2020 4:45 PM | Last Updated on Tue, Jun 16 2020 6:25 PM

AP Budget; Allocated Rs 100 Crore For The Establishment Of Rythu Bharosa Centres - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ప్రధానంగా వ్యవసాయిక ఆర్థిక వ్యవస్థగా మారిపోయింది. వ్యవసాయ రంగం ఆర్థికాభివృద్ధిలో ప్రధాన పాత్ర వహించడమే కాకుండా, ఆహార భద్రతను సమకూరుస్తుంది. నాలుగింట మూడు వంతుల కార్మికులకు ఉపాధి కల్పిస్తోంది. రైతు సంక్షేమమే ధ్యేయంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కొత్త పథకాలు ప్రారంభించడమే కాకుండా, మరెన్నో పథకాలకు ఆర్థిక సాయం పెంపుదల చేసింది

వైఎస్సార్‌ రైతు భరోసా:
పీఎం కిసాన్‌ పథకం 2019 అక్టోబర్‌ 15న ప్రారంభమయ్యింది. ఇందులో భాగంగా ప్రతి రైతు కుటుంబానికి వారి వ్యవసాయ అవసరాల నిమిత్తం రూ.13,500 వార్షిక పెట్టుబడి ప్రభుత్వ సమకూర్చుతుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 46 లక్షల 51 వేల అర్హులైన రైతు కుటుంబాలకు ఈ పథకం కింద ఆర్థిక సాయం  అందగా,  ఇందులో లక్ష 58వేలు కౌలు దారు కుటుంబాలు ఉన్నాయి. ఈ పథకం కొనసాగించడానికి 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.3,615.60 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. (ఏపీ వ్యవసాయ బడ్జెట్‌) 

వైఎస్సార్‌ పంటల ఉచిత బీమా పథకం:
పీఎంఎఫ్‌బివై,ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్‌ల కింద గుర్తించబడిన అన్ని పంటలకు 2019 ఖరీఫ్‌ కాలానికి  బీమా నిమిత్తం రైతు వాటా ప్రీమియం చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పంటల బీమా పథకాన్ని ఇన్సూరెన్స్‌కంపెనీలకు బదులు ప్రభుత్వమే భరిస్తుంది. ఈ పథకం కింద రైతులకు మేలుచేకూర్చే లక్ష్యంతో  ఈ బడ్జెట్‌లో రూ. 500 కోట్లు ప్రతిపాదించారు. (ఏపీ బడ్జెట్‌: పేద బిడ్డలకు చదువుల వెలుగు)

వడ్డీలేని రుణాలు:
పంటల నిమిత్తం తీసుకున్న అప్పులను సకాలంలో చెల్లించే అలవాటు రైతుల్లో పెంపొందించడానికి లక్ష రూపాయల వరకు పంట రుణాలపై ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తోంది. ఇందుకు గాను 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.1,100 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.

రైతు భరోసా కేంద్రాలు:
రాష్ట్రంలోని అన్ని గ్రామ సచివాలయాలోనూ 11,158 రైతు భరోసా కేంద్రాలను నెలకొల్పాడానికి ప్రభుత్వం సంకల్పించింది. ఈ కేంద్రాలు ఒక వైపు రైతులకు అవసరమైన వస్తు సామాగ్రి సరఫరా బాధ్యతతో పాటు, మరొవైపు ఉత్తమ వ్యవసాయిక విధానాలకు సంబంధించి పరిజ్ఞానాన్ని  రైతులకు చేరవేసే బాధ్యత కూడా  నిర్వర్తిస్తాయి. మల్టీ బ్రాండ్‌ నాణ్యమైన ఇన్‌పుట్‌ల సరఫరా, ఎంఎస్‌పీ సమాచారం, సాంకేతిక వ్యవహారాల్లో మార్గదర్శకం, వ్యవసాయ పనిముట్లు అద్దెకు తీసుకోవటం.. నేల, విత్తనాల పరీక్ష, బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవటంపై శిక్షణ ఇచ్చే విధంగా ఇవి పనిచేస్తాయి. రైతు భరోసా కేంద్రాల స్థాపనకు ప్రభుత్వం రూ.100 కోట్లను కేటాయించింది.

నాణ్యతా పరీక్షా కేంద్రాలు:
నాసిరకమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరాను అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఇందుకుగాను వ్యవసాయ క్షేత్రాలకు సమీపంలోనే నాణ్యతా  పరీక్షా కేంద్రాలను నెలకొల్పడానికి నిర్ణయించింది. రాష్ట్రం అంతటా 160 వైఎస్సార్‌ వ్యవసాయ పరీక్షా కేంద్రాలను నెలకొల్పడానికి ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో 147 లేటోరేటరీలు గ్రామీణ ప్రాంతాల్లోని నియోజకవర్గాలు,13 జిల్లా కేంద్రాల్లోనూ ప్రారంభించనున్నారు.వీటితో పాటు విత్తనాలు,ఎరువులు, పురుగు మందుల నాణ్యతను పరిశీలించచడానికి నాలుగు ప్రాంతీయ కోడింగ్‌ కేంద్రాలను కూడా నెలకొల్పనున్నారు. ‘వైఎస్సార్‌ అగ్రి టెస్టింగ్‌ లేబోరేటరీల ఏర్పాటుకు ఈ బడ్జెట్లో రూ.65 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.

ధరల స్థిరీకరణ నిధి:
కనీస మద్దతు ధర కలిగిన పంటల అమ్మకాలకు అవకాశాలు పెంపొందించడానికీ, కనీస మద్దతు ధర లేని పంటలు సాధారణ ధర కన్నా తక్కువగా అమ్ముడు పోకుండా ఉండటానికి ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. రూ.3000 కోట్ల ఈ నిధి ఏర్పాటు రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మక నిర్ణయం. ఉల్లి,మిర్చి,పసుపు, అరటి,నారింజ,చిరు ధాన్యాలను కనీస మద్దతు ధర ప్రకటించిన ఏకైక ప్రభుత్వం. రైతుల సమస్యలను పరిష్కరించడం కోసం ప్రభుత్వం ‘1907’ టోల్‌ ఫ్రీ నంబర్‌ను కూడా ఏర్పాటు చేసింది. ధరల స్థిరీకరణ నిధి ద్వారా పచ్చిశనగ రైతులకు రూ.96.11 కోట్లు, ఉల్లి రైతులకు రూ.63.12 కోట్లు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. మార్క్‌ఫెడ్‌ ద్వారా రూ.2,138 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులను, అందులో రూ.1500 కోట్ల ఉత్పత్తులు లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వం సేకరించింది. ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.11,891.20 కోట్లు ప్రభుత్వం ప్రతిపాదించింది.

పశుగణాభివృద్ధి-మత్స్యపరిశ్రమకు రూ.1,279.78 కోట్లు
పశుగణాభివృద్ధి, మత్స్యరంగాల అభివృద్ధికి 2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ.1,279.78 కోట్లు కేటాయించింది. నవరత్నాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లతో పశుగణ నష్టపరిహార నిధిని ఏర్పాటు చేసింది. ఆవులు, గేదెలు మొదలైన వాటికి రూ.15వేలు నుంచి రూ.30 వేలు,  మేకలు,గొర్రెలకు ఆరువేలు  దాకా రైతులకు నష్టపరిహారం అందజేస్తుంది.

వైఎస్సార్‌ మత్స్యకార భరోసా
ఏపీలో మత్స్యరంగం దాదాపు 14.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. దేశం నుంచి ఎగుమతి అవుతున్న సముద్ర సంబంధమైన ఆహార ఉత్పత్తుల్లో 36 శాతం రాష్ట్రం నుంచే ఎగుమతి అవుతుంది. మత్స్యరంగం మీద ఆధారపడ్డ కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం  వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకాన్ని అమలు చేస్తోంది. చేపల నిషేధం అమలు అయ్యే కాలంలో మత్స్యకార కుటుంబాలకు అందించే ఆర్థిక సాయాన్ని రూ.4 వేలు నుంచి 10వేలకు ప్రభుత్వం పెంచింది. ఈ పథకం ద్వారా ఇప్పటిదాకా 1,02,332 సముద్రతీర మత్స్యకార కుటుంబాలు లబ్ధిపొందాయి.

ఫిషింగ్‌ బోట్ల డీజిల్‌ ఆయిల్‌ మీద ఇచ్చే సబ్సిడీలను కూడా ప్రభుత్వం రూ.6.03 నుంచి రూ.9కి  ప్రభుత్వం పెంచింది. తద్వారా 2019-20 ఆర్థిక సంవత్సరంలో 19,796 బోట్లు లబ్ధిపొందాయి. ఆక్వా రైతులందరికీ విద్యుత్‌ ఛార్జీలలో కూడా మినహాయింపులు ఇచ్చింది. తద్వారా 53,500 మంది ఆక్వా రైతులు లబ్ధిపొందారు. చేపలు పెట్టే సమయంలో ఆకస్మికంగా మృతిచెందే మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున అందించే ఆర్థిక సాయాన్ని రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు ప్రభుత్వం పెంచింది.

ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి రూ.142.66 కోట్లు
974 కిలోమీటర్ల పొడవైన తీర రేఖతో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే రెండో స్థానంలో నిలుస్తుంది. మత్స్యరంగాన్ని మరింత అభివృద్ధి పరచడం కోసం జువ్వలదిన్నె, నిజాంపట్నం మచిలిపట్నం, ఉప్పాడ,బుడగట్లపాలెం, పూడిమెడక,కొత్తపట్నం, బియ్యపు తిప్పల్లో ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకు గాను ఈ బడ్జెట్‌లో రూ.142.66 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement