సాక్షి, అమరావతి: ఓటర్ల సమాచారం తమ పార్టీ కార్యకర్తల వద్ద ఉంటే తప్పేంటని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. పార్టీ కార్యకర్తల దగ్గర ఓటర్ల జాబితాలుంటాయని, వారిలో ఎవరున్నారు, ఎవరికి ఓటేస్తారనే వివరాలు సేకరిస్తారని.. అది తప్పెలా అవుతుందని అన్నారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాలులో గురువారం మీడియా సమావేశం నిర్వహించిన సీఎం డేటా చోరీ అంశంపై మాట్లాడారు. 20 సంవత్సరాల నుంచి తమ కార్యకర్తల డేటాను కంప్యూటరైజ్ చేసుకున్నామని, ఆ సమాచారాన్ని దొంగిలించి ప్రతిపక్ష పార్టీకి ఇచ్చారని ఆరోపించారు. ఎవరో వెళ్లి ఓటర్ల వివరాలు సేకరిస్తే వారికి అభ్యంతరమేంటని తెలంగాణ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సమాచారం ఏ ఫార్మాట్‌లో ఉంటే వారికి నష్టమేంటన్నారు. అయినా ఒక ప్రైవేటు కంపెనీపై ఏ చట్టం ప్రకారం దాడులు చేస్తారని ప్రశ్నించారు. తమ డేటా తీసుకుపోవడానికి వాళ్లెవరని, తమ సమాచారం కొట్టేసి తమపైనే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వెళ్లగక్కారు. దీనిపై ఎన్నికల సంఘం వద్ద పోరాటం చేస్తామని, కోర్టుకు వెళతామని చెప్పారు.
సమాచారం పోయిందనడానికి వారెవరు?
తమ సమాచారం పోలేదని చెబుతుంటే.. పోయిందని చెప్పడానికి వారెవరని తెలంగాణ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. తమకు సర్వీసు అందిస్తున్న ఒక ప్రైవేటు కంపెనీకి వెళ్లి అక్కడి ఉద్యోగుల్ని భయపెట్టడం ఏమిటన్నారు. దీనివల్ల నాలుగైదు రోజులనుంచి తమ పార్టీ కార్యకలాపాలు ఆగిపోయాయన్నారు. హైదరాబాద్‌లో ఉన్న తమవారి ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడుతున్నారని, పారిశ్రామికవేత్తలపై ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం, టీఆర్‌ఎస్ ప్రభుత్వం కలసి తమను మానసిక క్షోభకు గురిచేస్తున్నాయని, టెర్రరిస్టుల్లా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. సాంకేతిక సమస్యల్ని చూపించి భయపెడుతున్నారని, తన వద్దకు ఒక నాయకుడొచ్చి సీబీఐని చూస్తుంటే భయమేస్తోందని, పోటీ చేయలేనని చెప్పాడన్నారు.
ఫారం–7 ఇస్తే నేరం..
ఫారం–7లు పెట్టి ఓట్లు తీసేస్తున్నారని సీఎం ఆరోపించారు. ఫారం–7లు పెట్టడం నేరమని, వైఎస్సార్‌సీపీ ఈ ఫారంలు పెట్టి ఎనిమిది లక్షల ఓట్లు తీసేసిందని ఆరోపణ చేశారు. ఒక రాజకీయ పార్టీ ఫిర్యాదులు పెట్టి ఓట్లు తొలగించడం నేరమన్నారు. ఎవరైనా ఫారం–7 ఇస్తే నేరమని చెప్పారు. జగన్‌కి తెలంగాణ ప్రభుత్వం రక్షణగా ఉందని, తాను ఓడిపోతే జగన్‌ను సామంతరాజుగా చేసి కప్పం కట్టించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. బిహారీ క్రిమినల్ ప్రశాంత్ కిషోర్‌ను తెచ్చుకుని జగన్ రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. తమ రాష్ట్రంతో వారికేం సంబంధమని టీఆర్‌ఎస్, బీజేపీలను ప్రశ్నించారు. రాఫెల్ ఒప్పంద పత్రాల్ని దొంగిలించారని కేంద్రం సుప్రీంకోర్టుకు చెప్పడమేంటన్నారు. గతంలో సుప్రీంకోర్టుకు తప్పుడు అఫిడవిట్ ఇచ్చారన్నారు. హిందూ పత్రిక రామ్‌ను వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. కాగా, పసుపు కుంకుమ పథకం రెండవ విడత కింద రూ.3,500ను శుక్రవారం మహిళల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం తెలిపారు. ఉండవల్లిలో గురువారం రాత్రి జరిగిన విశాఖ, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలో ఈ విషయం చెప్పారు. ఈ 50 రోజులు భోజనానికి, నిద్రకు మాత్రమే ఇంటికెళ్లాలని, మిగతా సమయమంతా పార్టీకోసం పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు.
సాక్షిపై మరోసారి అక్కసు..
సాక్షి పత్రికపై చంద్రబాబు మరోసారి తన అక్కసును వెళ్లగక్కారు. ఓటర్ల తొలగింపుపై సాక్షి ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా చిందులు తొక్కారు. తాను ‘సాక్షి’కి సమాధానం చెప్పనని, అది పార్టీ పత్రిక అని, జగన్‌మోహన్‌రెడ్డి పంపితే మీరు వచ్చారని సాక్షి ప్రతినిధిపై ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఇప్పటివరకూ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడి ప్రశ్న అడగడమే తప్పంటే ఎలాగని సాక్షి ప్రతినిధి అనగా.. ప్రజాస్వామ్యం వేరు, ఇది వేరని, మిగిలిన వాళ్లకు చెబుతానని, ‘సాక్షి’కి చెప్పనని సీఎం అన్నారు. పార్టీ పరంగా సాక్షిని బహిష్కరిస్తామని, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, అరాచకాలు చేస్తున్నారని ఏమాత్రం సంబంధం లేకుండా ఆయన మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలపై అదేం న్యాయమని అడగ్గా.. గౌరవంగా చెబుతున్నానని, మాట్లాడకూడదని బెదిరింపులకు దిగడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment