అదనంగా రూ.5,000 | AP CM YS Jagan Announces 5,000 For Godavari Victims | Sakshi
Sakshi News home page

అదనంగా రూ.5,000

Published Fri, Aug 9 2019 3:07 AM | Last Updated on Fri, Aug 9 2019 8:26 AM

AP CM YS Jagan Announces 5,000 For Godavari Victims - Sakshi

గురువారం ఏరియల్‌ సర్వే ద్వారా వరద ముంపు ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి,  రాజమహేంద్రవరం:  గోదావరి ముంపు బాధిత కుటుంబాలకు అదనంగా మరో రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. వరద ప్రాంతాల్లో గిరిజన గ్రామాలే అధికంగా ఉన్నందున వారి జీవనోపాధి దెబ్బతినడంతో అదనంగా సాయాన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న సాయంతోపాటు అదనంగా రూ.5 వేలను అందచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వరద బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అదనంగా అందచేస్తుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఢిల్లీ పర్యటన ముగించుకుని గురువారం మధ్యాహ్నం 12.40 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్‌ అక్కడి నుంచే నేరుగా హెలికాప్టర్‌లో పోలవరం ముంపు ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించి నష్టాన్ని పరిశీలించారు.

దేవీపట్నం, పోలవరం తదితర గిరిజన గ్రామాలతోపాటు గోదావరి పరీవాహక లంక గ్రామాల్లో సీఎం ఏరియల్‌ సర్వే చేశారు. అనంతరం సహాయక చర్యలపై రాజమహేంద్రవరం విమానాశ్రయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్న వారికి భోజనాలు, ముంపు బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీతోపాటు అదనంగా ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని సీఎం తెలిపారు. కూలిన ఇళ్లు, పంట నష్టానికి నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించడంతోపాటు అదనంగా ఐదు వేల రూపాయల చొప్పున సాయం కూడా అందించనున్నట్లు ప్రకటించారు. 

నష్టపరిహారంతోపాటు ఉచితంగా విత్తనాలు
ముంపు ప్రాంతాల్లో దాదాపు 70 శాతానికి పైగా గిరిజన గ్రామాలున్నాయని, వరదల కారణంగా వారి జీవనోపాధి దెబ్బ తిన్నందున మానవతా దృక్పథంతో అదనంగా ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్లు సీఎం జగన్‌ చెప్పారు. వరదల వల్ల సంబంధాలు తెగిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామాలకు వెంటనే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ఆదేశించారు. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో రైతులకు పరిహారంతోపాటు ఉచితంగా విత్తనాలు కూడా సరఫరా చేయనున్నట్లు ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు కోసం సేకరించిన భూముల్లో సాగు చేసిన పంటలు వరదల కారణంగా దెబ్బతింటే వాటికి కూడా పరిహారంతోపాటు ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. 

వేగంగా పునరావాస కార్యక్రమాలు..
ధవళేశ్వరం ఎగువన ఉన్న దేవీపట్నం సహా ఇతర ప్రాంతాల్లో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గోదావరిలో 10 నుంచి 11 లక్షల క్యూసెక్కుల వరకు వరద నీరు వచ్చినా పెద్దగా ముంపు ఉండేది కాదని, ఈసారి మాత్రం ముంపు ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. కాఫర్‌ డ్యామ్‌ కారణంగా ముంపు పెరిగిందని మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా తగిన ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సీఎం సూచించారు. ధవళేశ్వరం వద్ద నీటి మట్టాన్ని  ప్రామాణికంగా తీసుకోకుండా పోలవరం వద్ద ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాజెక్టు వద్ద నీటిమట్టాన్ని పరిగణనలోకి తీసుకుని ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

వరదలకు గురయ్యే ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని పోలవరం పునరావాస కార్యక్రమాలను వేగంగా చేపట్టాలని ఆదేశించారు. ఇందుకోసం నియమించిన ఐఏఎస్‌ అధికారి తక్షణమే బాధ్యతలు చేపట్టి పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి సమీక్షలో డిప్యూటీ సీఎంలు పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ఆళ్ల నాని, మంత్రులు కన్నబాబు, విశ్వరూప్, అనిల్‌కుమార్‌ యాదవ్, రంగనాధరాజు, ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, ధనలక్ష్మి, బాలరాజు, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి,  చెల్లుబోయిన వేణు, శ్రీనివాసరావు, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు డి.మురళీధర్‌ రెడ్డి, ముత్యాలరాజు  తదితరులు పాల్గొన్నారు. గోదావరి జిల్లాల్లో పర్యటన అనంతరం తిరిగి 4 గంటల సమయంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌ రోడ్డు మార్గం ద్వారా తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సీఎంను ఇంటి వద్ద కలిశారు.

సాయం ఇలా..

  •  పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్న వారికి భోజనాలు, ముంపు బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీతోపాటు అదనంగా రూ.5 వేల చొప్పున సాయం.
  • కూలిన ఇళ్లు, పంట నష్టానికి నిబంధనల ప్రకారం పరిహారంతోపాటు అదనంగా ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం. 
  • ముంపు గ్రామాల్లో వెంటనే నిత్యావసర సరుకుల పంపిణీ
  • పంటలు కోల్పోయిన రైతులకు పరిహారంతోపాటు ఉచితంగా విత్తనాలు 
  • పోలవరం కోసం సేకరించిన భూముల్లో సాగు చేసిన వారికి కూడా పరిహారం, ఉచితంగా విత్తనాల సరఫరా 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టులో సమీక్ష చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement