సాక్షి, విజయవాడ : విజయవాడలోని లెనిన్ సెంటర్‌లో మంగళవారం ఏపీ సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్‌లో రిటైర్డ్ ఐఎఎస్ అధికారి యస్. ఆర్.శంకరన్ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శంకరన్ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వీ. సుబ్రమణ్యం, కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎల్. వీ. సుబ్రమణ్యం మాట్లాడుతూ.. శంకరన్ లాంటి వ్యక్తితో కలిసి పనిచేయడం మాకు ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. జీవితంలో ఎదగాలి అనుకునేవారు శంకరన్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
శంకరన్ అధికారిగా పనిచేసే రోజుల్లో జిల్లాలో పర్యటించిన సందర్భాల్లో పరిష్కరించాల్సిన సమస్యలను డైరీలో నమోదు చేసేవారని గుర్తుచేశారు. ఆయన రాసిన వ్యాసాలు నేటి యువత అందరూ చదవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పేద వర్గాలకు అండగా నిలబడిన శంకరన్ లాంటి వ్యక్తి నిరాడంబరతకు నిలువెత్తు రూపం అని కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ కొనియాడారు. 'టాక్ లెస్ డూ మోర్' అన్నదే శంకరన్ గారి నినాదం అని సీపీఐ మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వశాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీలు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారులు, ఫైనాన్స్ సెక్రటరీ యస్.యస్. రావత్, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి రవిచంద్ర ,టోబాకో బోర్డు సెక్రెటరీ సునీత , చైల్డ్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రెటరీ దమయంతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment