వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న జగన్‌మోహనరావు
పెద్ద దోర్నాల: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అధికార వికేంద్రీకరణ ఎంతో అవసరమని నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహన్‌రావు అన్నారు. అభివృద్ధి ఒక ప్రాంతానికి పరిమితం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు ప్రాంతాలకు మూడు రాజధానులు ప్రకటించారని తెలిపారు. మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా కృష్ణా జిల్లా నందిగామ నుంచి శ్రీశైలం వరకు ఆయన చేపట్టిన పాదయాత్ర శుక్రవారం ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలకు చేరింది. ఈ సందర్భంగా మండల సరిహద్దులోని చిన్న గుడిపాడు, చిన్నదోర్నాల అడ్డరోడ్డు, జమ్మిదోర్నాల, హసానబాద్‌లో నాయకులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు.
మహిళలు హారతి పట్టారు. స్థానిక నటరాజ్ సెంటర్‌లోని వైఎస్సార్ కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే అమలు చేస్తున్నారని, అభివృద్ధి, సంక్షేమ పథకాలను పార్టీలకతీతంగా అమలు చేస్తున్నారని చెప్పారు. పశ్చిమ ప్రకాశం వరప్రదాయని అయిన వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయటమే సీఎం ముఖ్య లక్ష్యమన్నారు. అనంతరం దోర్నాల నుంచి ఎమ్మెల్యే పాదయాత్రను కొనసాగించి నల్లమల అటవీ ప్రాంతమైన చింతల చెంచుగూడేనికి చేరుకున్నారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మొండితోక అరుణ్‌కుమార్, మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ మజీద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment