రాష్ట్రంలో రహదారి ప్రమాదాలను నివారణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ సాంబశివరావు తెలిపారు.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదారి ప్రమాదాలను నివారణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ సాంబశివరావు తెలిపారు. రహదారి ప్రమాదాల్లో ద్విచక్రవాహనదారులే ఎక్కువ మంది చనిపోతున్నారని సోమవారం ఉదయం ఆయన ఇక‍్కడ మీడియాతో మాట్లాడుతూ వివరించారు. రహదారి ప్రమాదాల మరణాల్లో 35 శాతం మంది ద్విచక్రవాహనదారులే ఉన్నారని ఆయన చెప్పారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని కోరుతున్నామని ఆయన అన్నారు.
ప్రమాదాలు తగ్గించేందుకే హెల్మెట్ ఉన్నవారికే పెట్రోలు పోయాలని బంకు యజమానులకు సూచించామని ఆయన వెల్లడించారు. నో హెల్మెట్ - నో పెట్రోల్ నిబంధన తప్పనిసరి కాదన్నారు. రాష్ట్రంలో బెట్టింగ్ సంస్కృతి పెరుగుతోందన్నారు. బెట్టింగ్ కారణంగా జరిగే నేరాల సంఖ్య కూడా పెరుగుతోందన్నారు. కొందరు క్రికెట్ గేమ్ నేర్చుకుంటుంటే.. మరికొందరు బెట్టింగ్ గేమ్ నేర్చుకుంటున్నారని ఆయన తెలిపారు. బెట్టింగ్ లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.