సాక్షి, అమరావతి: సాధారణంగా తారు రోడ్డు నిర్మాణానికి కిలోమీటర్‌కు రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షల దాకా ఖర్చవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ.69 లక్షలు ఖర్చు చేయాలని తెగేసి చెబుతోంది. సిమెంట్ రోడ్డు వేయడానికి కిలోమీటర్‌కు రూ.40 లక్షలు ఖర్చవుతుందని నిపుణులు చెబుతుండగా, ప్రభుత్వం రూ.83 లక్షలు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతోంది. తాను అనుకున్న వ్యయంతోనే 2,749 కిలోమీటర్ల తారు రోడ్లు, 2,206 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు నిర్మించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ వ్యవహారంలో అంచనా వ్యయాలను విపరీతంగా పెంచేసి, పనులను అస్మదీయ కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం ద్వారా ప్రభుత్వ పెద్దలు రూ.800 కోట్ల మేర లబ్ధి పొందనున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ మంత్రిగా ఉన్న పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో ఈ దోపిడీ బాగోతం సాగుతోంది. రాష్ట్రంలో రహదారి వసతి లేని గ్రామాలకు కొత్త రోడ్లు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ.4,234 కోట్లు అవసరమని అంచనా వేసింది. 70 శాతం నిధులను అప్పుగా ఇచ్చేందుకు ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు(ఏఐఐబీ) అంగీకరించింది. మొత్తం 5,007 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం పనులకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో 2,749 కిలోమీటర్ల తారు రోడ్లు, 2,206 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 52 కిలోమీటర్ల మేర 32 బ్రిడ్జిలు ఉన్నాయి.
ప్యాకేజీల మాయాజాలం
ఒక ఊరికి, పక్కనే మరో ఊరికి మధ్య ఉండే రెండు మూడు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులను మాములుగా అయితే స్థానికంగా చిన్న కాంట్రాక్టర్లు చేస్తుంటారు. ఇలా చిన్నచిన్న పనులైతే తమకు అంతగా గిట్టుబాటు కాదనుకున్న ప్రభుత్వ పెద్దలు మరో స్కెచ్ వేశారు. రెండు మూడు కిలోమీటర్ల పొడవుండే చిన్నచిన్న రోడ్ల పనులను 50–60 చొప్పున కలిపి ఒక ప్యాకేజీగా మార్చారు. మొత్తం 2,498 పనులను కేవలం 40 ప్యాకేజీలుగా విభజించారు. వీటిని తమకు బాగా కావాల్సిన బడా కాంట్రాక్టర్లకు అప్పగించాలని వ్యూహం పన్నారు. కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు ముందే నొక్కేయడానికి వీలుగా వారికి మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు కూడా ఇవ్వాలని నిర్ణయించారు.
డీపీఆర్ దశలోనే అంచనాలు పెంపు
చిన్న చిన్న కాంట్రాక్టర్లు చేయాల్సిన పనులను బడా కాంట్రాక్టర్లకు అప్పగించాలని నిర్ణయించిన ప్రభుత్వ పెద్దలు అందుకు అనుగుణంగా సమగ్ర ప్రాజెకు నివేదిక(డీపీఆర్) తయారీ దశలోనే అంచనా వ్యయాలను భారీగా పెంచారు. ప్రస్తుతం ప్యాకేజీల వారీగా తుది దశ డీపీఆర్‌లను పంచాతీయరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు సిద్ధం చేస్తున్నారు. రోడ్ల నిర్మాణం పనులకు జూన్‌లో టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
చిన్న కాంట్రాక్టర్ల అభ్యంతరాలు
ఏఐఐబీ అప్పుతో చేపట్టే రోడ్ల నిర్మాణం పనులపై కాంట్రాక్టర్ల అభిప్రాయాలు సేకరించేందుకు ఈ నెల 20వ తేదీన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఇంజనీర్ ఇన్‌చీఫ్(ఈఎన్‌సీ) సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పనులను ప్యాకేజీలుగా వర్గీకరించి బడా కాంట్రాక్టర్లకు అప్పగించాలన్న నిర్ణయంపై చిన్న కాంట్రాక్టర్ల అభ్యంతరాలు వ్యక్తం చేశారు. టెండర్ల ప్రక్రియ ముగిసిన తర్వాత బడా కాంట్రాక్టర్లు ఆ పనులను సబ్ కాంట్రాక్టర్లకే ఇస్తారని, దీనివల్ల రోడ్ల నిర్మాణంలో నాణ్యత కొరవడుతుందని స్పష్టం చేశారు. ఏడాదిలోగా 5,007 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పనులు పూర్తి కావాలంటే ప్యాకేజీల వారీగా పెద్ద కాంట్రాక్టర్లకే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఈఎన్‌సీ తెలిపారు.
- రాష్ట్రంలో రోడ్ల పనులు జరిగే నియోజకవర్గాలు: 134
- పనులు జరిగే మండలాలు: 484
- మొత్తం పనులు: 2,498 (తారు రోడ్డు పనులు: 845, సిమెంట్ రోడ్డు పనులు: 1,631, బ్రిడ్జిలు: 22)
- కొత్త రోడ్ల పొడవు: 5,007 కిలోమీటర్లు
- అంచన వ్యయం: 4,234 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment