‘కృష్ణా’నే రాసిచ్చారు.. | AP government gave permission to Floating Restaurant on Krishna River | Sakshi
Sakshi News home page

‘కృష్ణా’నే రాసిచ్చారు..

Published Thu, Jun 22 2017 8:37 AM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM

‘కృష్ణా’నే రాసిచ్చారు.. - Sakshi

‘కృష్ణా’నే రాసిచ్చారు..

భవానీ ద్వీపం సమీపంలో ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటుకు లోకేష్‌ సన్నిహితుడు ప్రతిపాదన
నదీ పరిరక్షణ చట్టంకు విరుద్ధంగా అనుమతి ఇవ్వలేమన్న జలవనరుల శాఖ
వరదలు వచ్చినప్పుడు ప్రకాశం బ్యారేజీకి ముప్పు తప్పదని స్పష్టీకరణ
బ్యారేజీ ధ్వంసమైతే భారీ ఎత్తున ప్రాణ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని ఆందోళన
అవేవీ పట్టని సీఎం చంద్రబాబు, లోకేష్‌.. ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌కు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ


సాక్షి, అమరావతి: అడిగినంత కమీషన్‌ ఇచ్చేవారుంటే.. ఊరూ, వాడ, భూములను అడ్డదిడ్డంగా కట్టబెట్టేస్తున్న సర్కారు ప్రభువులు.. తాజాగా విజయవాడ సమీపంలో ఏకంగా కృష్ణా నదినే రాసిచ్చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు, పంచాయతీ రాజ్, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌కు సన్నిహితుడైన సూరపనేని సుభాకర్‌రావు అనే వ్యాపారికి భవానీద్వీపం సమీపంలోని కృష్ణా నదీ గర్భంలో ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ (తేలియాడే ఆహారశాల) ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఛాంపియన్స్‌ యాచెట్‌ క్లబ్‌’ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సీఈవో) అయిన సూరపనేని సుభాకర్‌రావు విదేశాల్లో లండన్, దేశంలో గోవా, బెంగుళూరుల్లో వ్యాపారం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవాడ–గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేశాక ఇతని కళ్లు కృష్ణా నదిపై పడ్డాయి.

లోకేశ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న ఆయన ప్రకాశం బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతంలో మరపడవలు(బోట్లు) తిప్పుకోవడానికి అనుమతి ఇవ్వాలని జలవనరుల శాఖను కోరుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో పర్యాటకులను ఆకట్టుకునేందుకు జల క్రీడలు, జల విహారం, రెస్టారెంట్లను ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు పదే పదే ప్రకటిస్తున్నారు. మంత్రి లోకేశ్‌ దన్నుతో ఇప్పటికే భవానీ ద్వీపంలో కొంత భాగాన్ని, ప్రకాశం బ్యారేజీకి ఎగువన పర్యాటక శాఖకు చెందిన సీతానగరం వద్ద జట్టి(బోట్లు నిలిపే ప్లాట్‌పామ్‌)ను కబ్జా చేసిన సుభాకర్‌రావు.. నదీ గర్భంలో ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటుకు అనుమతివ్వాలని లోకేశ్‌ సూచనల మేరకు భవానీ ఐలాండ్‌ టూరిజం కార్పొరేషన్‌ సీఈవోకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు భవానీ ఐలాండ్‌ కార్పొరేషన్‌ సీఈవో జలవనరుల శాఖకు ప్రతిపాదనలు పంపారు. నదీ పరిరక్షణ చట్టం–1884, పర్యావరణ చట్టాలను ఎత్తిచూపుతూ ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటుకు అనుమతి ఇచ్చేది లేదని జలవనరుల శాఖ తొలుత తేల్చి చెప్పింది. దాంతో ఈ వ్యవహారాన్ని సుభాకర్‌రావు లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన జలవనరుల శాఖ అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు.

అనుమతి లేకుండానే నదీ గర్భం కబ్జా
కృష్ణా నదికి 10 నుంచి 18 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని.. నదీ ప్రవాహానికి అంతరాయం కల్పించేలా నిర్మాణాలు చేపడితే.. వరదలు వచ్చినప్పుడు ప్రకాశం బ్యారేజీకి ముప్పు తప్పదని జలవనరుల శాఖ అధికారులు లోకేశ్‌కు తెగేసి చెప్పారు. ప్రకాశం బ్యారేజీ ఒక్కో గేటు బరువు 44 టన్నులుంటుందని.. మరపడవ 70 టన్నులకు పైగా బరువు ఉంటుందని.. వరదలు వస్తే మరపడవల తాకిడికి గేట్లు నిలవలేవని చెప్పారు. వరద ఉద్ధృతికి ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ నిలబడలేదని.. అది ప్రకాశం బ్యారేజీ గేట్లకు అడ్డుపడితే బ్యారేజీ ధ్వంసమవుతుందని తేల్చి చెప్పారు. దీని వల్ల విజయవాడ పరిసర ప్రాంతాలను వరద ముంచెత్తుతుందని.. భారీ ఎత్తున ప్రాణ నష్టం వాటిల్లుతుందని వివరించారు. 2009 అక్టోబర్‌ ఆఖరులో కృష్ణా నదికి 11 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన సమయంలో గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం ఓగేరు వద్ద కుడి కరకట్ట తెగి భారీ ఎత్తున నష్టం వాటిల్లిందని కూడా గుర్తు చేశారు.

నదుల్లో వెయ్యి టన్నుల కన్నా అధిక బరువుతో కూడిన పడవలు, నిర్మాణాలు చేపట్టలాంటే జాతీయ అంతర్గత జలరవాణా అనుమతి అవసరమని స్పష్టం చేశారు. కానీ.. ఇవేవీ మంత్రి లోకేశ్‌ పట్టించుకోకుండా ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సిందేనని పట్టుపట్టారు. సీఎం చంద్రబాబు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు కూడా లోకేశ్‌ ప్రతిపాదనను బలపరుస్తూ తమపై ఒత్తిడి తెచ్చారని జలవనరుల శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఈ జీవో జారీ చేశారు. జలవనరుల శాఖ అనుమతి ఇచ్చే లోపే ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటుకు వీలుగా నదీ గర్భాన్ని సుభాకర్‌రావు ఆక్రమించేసి నిర్మాణాలు చేపట్టడం గమనార్హం.  జలవనరుల శాఖ అనుమతి ఇవ్వకుండానే ప్రకాశం బ్యారేజీ సమీప ప్రాంతంలో ఇప్పటికే మరపడవలను యథేచ్ఛగా తిప్పుతూ సొమ్ము చేసుకుంటున్నారు. వీరికి చెందిన మరపడవలోనే ఇటీవల సీఎం చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో నదీ విహారం చేశారు.

రెండేళ్లకు అనుమతి.. ఆ తర్వాత పొడిగింపు
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ ఒత్తిడి తట్టుకోలేక జలవనరుల శాఖ అధికారులు భవానీద్వీపం సమీపంలోని కృష్ణా నదీ గర్భంలో ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటుకు అనుమతి ఇస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమికంగా రెండేళ్లపాటూ అనుమతి ఇవ్వాలని కృష్ణా డెల్టా చీఫ్‌ ఇంజనీర్‌కు ఆ ఉత్తర్వుల్లో సూచించారు. ఆ తర్వాత రెండేళ్లకు ఓ సారి అనుమతిని రెన్యువల్‌ (పొడిగింపు) చేసుకునే వెసులుబాటు కల్పించారు. సుభాకర్‌రావు లండన్‌లో ఇదే రకమైన వ్యాపారం చేసి.. పన్నులు ఎగ్గొట్టడంతో అక్కడి ప్రభుత్వం ఆయన్ను డిఫాల్టర్‌గా ప్రకటించినట్లు పర్యాటక శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి చెప్పారు. గోవాలోనూ ఇదే రీతిలో సుభాకర్‌రావు వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు విజయవాడలోనూ అదే తరహా వ్యాపారం అంటే.. నదీ గర్భంలో విందులూ వినోదాలకు తెరతీశారు. అసాంఘిక కార్యకలాపాలకు తావు ఇవ్వకూడదని జలవనరుల శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నా, అధికార దన్నుతో వాటిని తుంగలో తొక్కడం ఖాయమని అధికారవర్గాలే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement