వ్యవసాయ భూమి
సాక్షి, గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): రామయ్యకు ఓ సర్వే నంబరులో వాస్తవానికి 0.50 ఎకరం భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల్లో కేవలం 0.45 సెంట్లు మాత్రమే ఉన్నట్లు నమోదు చేశారు. వ్యత్యాసం సరిచేయాలని సర్వే కోసం(ఎఫ్–లైన్) దరఖాస్తు చేసుకున్నాడు. వాస్తవానికి రామయ్యకు భూమి ఉన్న సర్వే నంబరులో మొత్తం విస్తీర్ణం 10 ఎకరాలు. రామయ్యకు ఉన్న అర ఎకరా మాత్రమే సర్వే చేస్తే సరిపోదు. మొత్తం 10 ఎకరాల భూమిని సర్వే చేయాల్సి ఉంది. ఇతర రైతులు అంగీకరించకపోవడం, దీర్ఘకాలిక పంటలు వేయడంతో సర్వే నిలిచిపోయింది.
వీరయ్యకు ఒక సర్వే నంబరులో రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ సర్వే నంబరు నాలుగు సబ్ డివిజన్‌లు చేశారు. ఇందులో ఒక సర్వే సబ్ డివిజన్‌లో కొంత అసైన్డ్ భూమి ఉంది. తన కూతురు పెళ్లికోసం వీరయ్య భూమి అమ్మేశాడు. రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళితే సదరు సర్వే నంబరులో అసెన్డ్ భూమి ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. సర్వే చేయించి సర్టిఫికెట్ తేవాలని రిజిస్ట్రేషన్ అధికారులు చెప్పారు. వీరయ్య అవసరాన్ని గుర్తించిన సర్వేయర్లు, డబ్బులు ఇస్తేగానీ సర్వే చేయబోమని నిరాకరించారు. ఇవి ఏ ఒక్క గ్రామానికో పరిమితమైన çసమస్యలు కాదు. ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఇవే ప్రధాన సమస్యలు.
7 ఎకరాల భూమి, ఒకే సర్వే నంబరు, 15 మంది భూ యజమానులు. సర్వే సబ్ డివిజన్ జరగలేదు. సరిహద్దుల విషయంలో వారి మధ్య వివాదం. రైతులు పోలీస్ స్టేషన్, కోర్టులు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు. ఇటువంటి వివాదాలను గ్రామాల్లో సాధారణంగా చూస్తుంటాం. భూముల సర్వే అసమగ్రంగా ఉండడం వల్ల రికార్డుల్లో ఉన్న విస్తీర్ణానికి, వాస్తవ విస్తీర్ణానికి పొంతన లేని పరిస్థితి నెలకొంది దీంతో భూవివాదాలు నెలకొంటున్నాయి. వీటన్నిటికి చెక్ పెడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం భూముల సమగ్ర రీ సర్వే జరపాలని నిర్ణయించింది.
వాస్తవానికి ప్రతి 30ఏళ్ల కోసారి భూములు రీ సర్వే చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీంతో భూ వివాదాలు పెరిగిపోయాయి. 1954కు పూర్వం భూముల రీ సర్వే జరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు భూముల రీ సర్వే ఊసే లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం భూముల రీ సర్వే బిల్లును బడ్జెట్ సమావేశాల్లో పెట్టేందుకు కసరత్తు చేసింది. దీనిపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తరతరాల భూవివాదాలకు పరిష్కారం లభించినట్లేనని రైతులు భావిస్తున్నారు. రీసర్వే పూర్తి చేస్తే గ్రామాల్లో రైతుల మధ్య సమస్యలు సమసి పోతాయని, నిజమైన భూ యజమానులకు సర్వహక్కులు లభిస్తాయి. రీ సర్వే ప్రక్రియ సత్వరమే కార్యరూపం దాల్చాలని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
దశాబ్దాల కిందట రీసర్వే..
ఎప్పుడో దశాబ్ధాల కిందట భూముల రీ సర్వే జరిగింది. అప్పట్లో తయారు చేసిన ఫీల్డ్ మెజర్ మెంట్ బుక్(ఎఫ్‌ఎంబీ) మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని చెదలు పట్టి పాడైపోగా, మరికొన్నింటిని భూ వివాదాల నేపథ్యంలో రెవెన్యూ సిబ్బందే ధ్వంసం చేసిన ఘటనలు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో అసలు ఎఫ్‌ఎంబీ లేదంటే ఆశ్చర్యం కలుగక మానదు. విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో ఎఫ్‌ఎంబీ సక్రమంగా లేదు. వీరులపాడు మండలంలో జయంతి గ్రామంలో ఎఫ్‌ఎంబీని ఇక్కడ పనిచేసిన రెవెన్యూ సిబ్బంది సగానికి పైగా ధ్వంసం చేశారు. రికార్డుల్లో ఉన్న విస్తీర్ణానికి, వాస్తవ విస్తీర్ణానికి పొంతన లేని పరిస్థితి. రైతుల మధ్య వివాదాలు వస్తే పరిష్కరించాల్సిన రెవెన్యూ అధికారులు వాటి గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఫలితంగా రైతులు కోర్టులను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు. మండలాల్లో భూమలు సర్వేకు సంబంధించిన ఎఫ్–లైన్ పిటిషన్లు చాలావరకు పెండింగ్‌లో ఉన్నాయి.
విజయవాడ డివిజన్ పరిధిలో ఈ ఏడాది ఎఫ్–లైన్ కోసం వచ్చిన దరఖాస్తులు - 1298
సర్వే సబ్ డివిజన్ కోసం దరఖాస్తు చేసుకున్న రైతులు -130 మంది
దరఖాస్తులను వెంటనే పరిష్కరిస్తున్నాం
రైతులు సర్వే కోసం ఆన్‌లైన్‌లో ఎఫ్–లైన్ దరఖాస్తు చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత నిర్ణీత గడువులో మండల సర్వేయర్ వాటిని పరిష్కరిస్తారు. రైతులనుంచి వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. ఏవైనా వివాదాలు ఉంటే తప్ప అన్నింటిని వెంటనే పరిష్కరిస్తున్నాం.
– కృష్ణప్రసాద్, డెప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ల్యాండ్ సర్వే
Comments
Please login to add a commentAdd a comment