* వ్యవసాయానికి ప్రస్తుతానికి 7 గంటలకు మించి ఇవ్వలేమని అసెంబ్లీలో మంత్రి పల్లె వెల్లడి
* ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేస్తామని వాయిదా వేయడం మోసమే: పెద్దిరెడ్డి
* కనెక్షన్లు తొలగిస్తారని రైతుల్లో ఆందోళన: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాపై ఏపీ ప్రభుత్వం చేతులెత్తేసింది. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నప్పటికీ ప్రస్తుతానికి 7 గంటలకు మించి ఉచిత విద్యుత్ ఇవ్వలేమని, పరిస్థితులు అనుకూలిస్తే భవిష్యత్తులో 9 గంటలు ఇస్తామని తేల్చేసింది. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పీడిక రాజన్న దొర, ఉప్పులేటి కల్పన, గడికోట శ్రీకాంత్‌రెడ్డి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నపై చర్చ జరిగింది.
ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నట్లుగా వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్‌ను ఎప్పటినుంచి అమలు చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని పెద్దిరెడ్డి నిలదీశారు. ఉచిత విద్యుత్‌పై మొదటి సంతకం అని చెప్పి ఇప్పుడు వాయిదా వేయడం రైతుల్ని మోసగించడమే అవుతుందన్నారు. సీఎం చంద్రబాబు తరఫున సమాచార, సాంకేతిక మంత్రి పల్లె రఘునాధరెడ్డి బదులిస్తూ.. ప్రస్తుతానికి 7 గంటల ఉచిత విద్యుత్‌ను అమలు చేస్తున్నామని, దశలవారీగా 9 గంటలకు పెంచుతామని చెప్పారు. అక్టోబర్ 2 నుంచి రాష్ట్రంలో ‘అందరికీ విద్యుత్’ పథకం ప్రారంభమవుతుందన్నారు.
వచ్చే 5 ఏళ్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యుత్ సరఫరాను మెరుగుపరుస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో 22 మిలి యన్ యూనిట్ల లోటు ఉందని, సెప్టెంబర్ ఒకటి నాటికి లోటు భర్తీ చేసి జీరో స్థాయికి తీసుకువచ్చామన్నారు. ప్రస్తుతం విద్యుత్ కొరత లేదన్నారు. 2009 జూన్ 25న రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా 9 గంటల ఉచిత విద్యుత్‌ను అమలు చేయలేదని మంత్రి అనడంతో వైఎస్సార్ సీపీ సభ్యులు అభ్యంతరం చెప్పారు. గతంలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2003 వరకు 9 గంటల ఉచిత విద్యుత్‌ను ఇచ్చామని, 2004లో ఇవ్వలేకపోయామని మంత్రి చెప్పారు.
ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యుత్ పంపిణీ వ్యవస్థను నాశనం చేశాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఐఎస్‌ఐ గుర్తింపులేని 36 వేల పంపుసెట్లను మారుస్తామని మంత్రి చెప్పారు. పెండింగ్ కనెక్షన్ల గురించి అడిగితే మంత్రి ఏదేదో చెబుతున్నారని, ఈ కనెక్షన్లు ఒకేసారి ఇస్తారా? లేక దశలవారీగా ఇస్తారో చెప్పాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. ఉచిత విద్యుత్‌కు పరిమితులు విధించి కనెక్షన్లు తొలగిస్తారని రైతులు ఆందోళన చెందుతున్నారని, ఇది నిజమో కాదో చెప్పాలని చెవిరెడ్డి కోరారు.
9 గంటల కరెంట్‌పై తొండి
Published Tue, Sep 2 2014 2:30 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement