అనంతపురం మార్కెట్‌లో బత్తాయి రాశులు
సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బత్తాయి (చీనీ) రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇప్పటికే కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ప్రకటించడంతో వ్యాపారులు దిగివచ్చారు. టన్ను బత్తాయిని రూ.14 వేలకు తక్కువ కాకుండా రైతుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. ఎగుమతులు మొదలైతే ధర మరింత పెరిగే అవకాశముంది. మరోవైపు రైతులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామని అధికారులు చెబుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
88 వేల హెక్టార్లలో బత్తాయి తోటలు
► రాష్ట్రంలో సుమారు 88 వేల హెక్టార్లలో బత్తాయి తోటలున్నాయి.
► రెండు సీజన్లలో కాపు వస్తుంది. ఏడాదిలో దాదాపు 22 లక్షల టన్నుల వరకు దిగుబడి ఉంటుంది.
► అయితే.. ఈ వేసవిలో (ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో) కాపు వచ్చే విస్తీర్ణాన్ని 52,415 హెక్టార్లుగా, దిగుబడి 9,64,478 టన్నులుగా ఉద్యాన శాఖ అంచనా వేసింది.
► ఏప్రిల్‌లో 2,96,995 టన్నులు, మేలో 5,12,992 టన్నుల ఉత్పత్తి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు ఏయే వారంలో ఎంత రావచ్చో అంచనా వేసి మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించేందుకు సన్నద్ధమైంది.
► రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.1400 చొప్పున (టన్నుకు రూ.14 వేలు) కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ని ప్రకటించింది. దీంతో ఈ ధర కంటే తక్కువకు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు జంకు
తున్నారు.
► బత్తాయి ఉత్పాదకతలో టాప్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో హెక్టార్‌కు సగటున 25 టన్నుల దిగుబడి వస్తుండగా కర్ణాటకలో 22.3, పంజాబ్‌లో 21.6 టన్నుల దిగుబడి వస్తోంది.
రైతుల డిమాండ్లు ఇవీ..
► లాక్‌డౌన్ ఆంక్షల్ని మరింత సడలించి మార్కెట్ వేళలను ఉ. 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పొడిగించాలి.
► బత్తాయి దిగుబడిలో దాదాపు 50, 60% రోడ్ల పక్కన ఉండే జ్యూస్ బండ్లు, నగరాల్లోని ఫ్రూట్ స్టాళ్లు, జ్యూస్ షాపుల్లోనే వినియోగం అవుతుంది. ప్రస్తుతం వీటికి అనుమతి లేదు. ప్రస్తుత వేసవి సమయంలో మధ్యాహ్నం 1 గంట వరకు వీటిని అనుమతించాలని ౖరైతులు కోరుతున్నారు. ఇప్పుడిప్పుడే ఆయా రాష్ట్రాలకు రవాణా ప్రారంభమైంది. ఆయా ప్రాంతాల్లో సరకును అన్‌లోడింగ్ చేసుకోవడంలో సమస్యలు తలెత్తకుండా అధికారులు చొరవ చూపాలి.
► నైపుణ్యం కలిగిన కూలీలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పంపించేందుకు అధికారులు అనుమతించాలి. అనంతపురం, తాడిపత్రి మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకే అమ్మాలని వేధిస్తున్న వ్యాపారులను నియంత్రించాలి. సూట్లు, కమీషన్లు తీసుకోకుండా వారికి అడ్డుకట్ట వేయాలి.
రైతులకు సానుకూల అంశాలు...
► ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షలను తొలగించడంతో ప్రస్తుతం రవాణా సమస్య లేదు.
► ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటించడంతో రైతులకు భరోసా ఏర్పడింది.
► రైతులను ఆదుకోవడానికి ఉద్యాన, మార్కెటింగ్ శాఖల అధికారులు ఎక్కడికక్కడ స్థానిక మార్కెట్లను ఏర్పాటు చేస్తుండడంతో బత్తాయిని ఒక చోట నుంచి మరో చోటకు తీసుకువెళ్లి అమ్ముకునేందుకు వెసులు బాటు కలిగింది.
► అనంతపురం జిల్లా ఉద్యాన శాఖాధికారులు కర్నూలు వ్యాపారులతో మాట్లాడి సరకును ఆ జిల్లా మార్కెట్లకు తరలించేలా ఏర్పాటు చేశారు.
► మరో రెండు మూడు రోజుల్లో హరియాణా, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతాకు ఎగుమతులు ప్రారంభమవుతాయి.
తక్కువ ధరకు అమ్ముకోవద్దు
ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినందున రైతులెవరూ తక్కువ ధరకు అమ్ముకోవద్దు. ఈ వ్యవహారంపై కేంద్ర వ్యవసాయ శాఖతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నాం. ఇతర రాష్ట్రాల్లో మార్కెట్లు ఇప్పుడిప్పుడే తెరుస్తున్నారు. ఎంఎస్‌పీ క్వింటాల్ బత్తాయికి రూ.1,400 ప్రకటించాం. వ్యాపారులు తక్కువ ధరకు అడిగితే 1902, 1907 నంబర్లకు ఫిర్యాదు చేయాలి.
– వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు
Comments
Please login to add a commentAdd a comment