రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వీలైనంత త్వరగా హైకోర్టును ఏర్పాటు చేసేలా చొరవ తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎం.లోధాకి తెలంగాణ అడ్వొకేట్స్ జేఏసీ విజ్ఞప్తి చేసింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి టీ అడ్వొకేట్ జేఏసీ విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వీలైనంత త్వరగా హైకోర్టును ఏర్పాటు చేసేలా చొరవ తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎం.లోధాకి తెలంగాణ అడ్వొకేట్స్ జేఏసీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ప్రధాన న్యాయమూర్తికి వినతిపత్రం సమర్పించినట్టు జేఏసీ చైర్మన్ ఎం.రాజేందర్‌రెడ్డి తెలిపారు. వినతి పత్రం ఇచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో అన్ని విభాగాల్లో విభజన పనులు ముమ్మరంగా కొనసాగుతున్నా, న్యాయవ్యవస్థకు సంబంధించి ఎలాంటి పనులు జరగడం లేదని సీజే దృష్టికి తీసుకెళ్లామన్నారు. అపాయింటెడ్ డే తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరినట్టు తెలిపారు. కాగా, సుప్రీంకోర్టు పరిధిలో దీనికి సంబంధించి ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకునేలా చూస్తామని సీజే హమీ ఇచ్చినట్టు రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులు ఉండాలన్న దానికి సీజే సుముఖంగా ఉన్నట్టు చెప్పారు.