సాక్షి, గుంటూరు: తాడేపల్లి మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన ఓ మహిళకు గుర్తు తెలియని అగంతకులు ఆధార్ వివరాలు చెప్పాలని మూడు రోజుల కిందట ఫోన్ చేశారు. ఆ సమాచారం మహిళ చెప్పిన వెంటనే మరలా ఫోన్ చేసి ఆర్‌బీఐ నుంచి ఫోన్ చేస్తున్నామని.... కార్డు నంబరుకు సంబంధించిన వివరాలు చెప్పాలని కోరారు. వారి మాటలను నమ్మిన మహిళ ఆమె క్రెడిట్ కార్డు వివరాలతో పాటుగా తన సెల్‌కు వచ్చిన ఓటీపీ నంబరు కూడా చెప్పింది. ఇక అంతే ఆమె క్రెడిట్ కార్డు నుంచి ఏకంగా రూ.లక్ష నగదు డ్రా చేసుకున్నారు. ఆపై బాధితురాలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.
పిడుగురాళ్ళకు చెందిన ఓ యువతి క్విక్కర్ యాప్‌లో ఆన్‌లైన్‌లో ఇంటి నుంచి ఉద్యోగం చేసేందుకు దరఖాస్తు చేసింది. మీకు ఉద్యోగం ఇస్తున్నామని చెప్పి ఆమెతో పది రోజుల్లో రేయింబవళ్లు వారు ఇచ్చిన పనులను పూర్తి చేయించారు. అలా చేస్తేనే మీకు ఉద్యోగం కచ్చితంగా ఇస్తామని చెప్పారు. తీరా వారి పని పూర్తయిన అనంతరం ఆమెను వారి లింక్‌లో నుంచి తొలగించారు. మోసం చేశారని గుర్తించిన యువతి ఇటీవల రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు.
సైబర్ నేరగాళ్ల ఆటకట్టించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో రోజురోజుకు తీవ్రమవుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు రాష్ట్ర సైబర్ క్రైం కార్యాలయాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. ఇటీవల మహిళలు, మైనర్లు, నిరుద్యోగ యువత ఎక్కువగా సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోతున్నారు. ఇలాంటి సమస్యలు అధిగమించడంతో పాటు మోసగాళ్ల చర్యలు నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సైబర్ మిత్ర పేరుతో శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర హోం శాఖా మంత్రి మేకతోటి సుచరిత ఫేస్‌బుక్ అకౌంట్‌ను ప్రారంభించారు.
సవాలుగా మారిన స్మార్ట్ ఫోన్లు.....
ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మహిళలు, బాలికలు, విద్యార్థులను సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. అందుబాటులో ఉంటున్న స్మార్ట్ ఫోన్లును కొందరు యువత మంచికి ఉపయోగిస్తే మరి కొందరు చెడు పనులకు వినియోగిస్తున్నారని గతంలో పలు మార్లు విశ్లేషకులు తేల్చారు. సెల్‌ఫోన్ లేకుండా చేసేందుకు తల్లిదండ్రులు యత్నిస్తే చివరకు ఆత్మహత్యలకు సైతం వెనుకాడని సందర్భాలున్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్ ఫోన్ అనివార్యంగా మారింది. దీంతో అందుబాటులో ఉన్న ఫోన్‌లో యువతకు కొంత అవగాహన లేని కారణంగా నకిలీ వెబ్‌సైట్‌లను నమ్మి ఉద్యోగాల కోసం డబ్బు చెల్లిస్తూ మోసపోతున్నారు. మరి కొందరు నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ల బారిన పడి జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. ఈ తరహా కేసులు జిల్లాలో అధికంగా నమోదవుతున్నాయి. విద్యార్థులు, గృహిణిలు ఎక్కువగా బాధితులుగా మారుతున్నారు. ఎలాగైనా సైబర్ నేరాలను తగ్గించే దిశగా కార్యాచరణ రూపొందించారు.
ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్
సైబర్ నేరగాళ్ల గురించి సమాచారం అందించాలన్నా, మోసపోయిన వారు సంప్రదించాలనుకున్నా త్వరగా సమాచారం తెలుసుకునేందుకు డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రత్యేకంగా 9021211100 వాట్సాప్ నంబరు కేటాయించారు. ఈ నంబరుకు సైబర్ నేరాల గురించి సమాచారం తెలియచేయవచ్చు. అలా అందిన సమాచారాన్ని సైబర్ క్రైం స్టేషన్‌లోని పోలీస్ అధికారులు వెంటనే పరిశీలించి అవసరమైతే కేసు నమోదు చేసి నిందితులను కటకటాల వెనక్కి పంపుతారు. బాధితులకు అండగా నిలుస్తారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సైబర్ నేరాలు నమోదు కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment