సాక్షి, అమరావతి : చిన్నారులపై లైంగిక నేరాలను తగ్గించేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి తెలిపారు. బుధవారం సచివాలయంలో చిన్నారులపై లైంగిక దాడుల నివారణపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎంతో పాటు హోం మంత్రి మేకతోటి సుచరిత, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సుచరిత మాట్లాడుతూ.. అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక హింస జరగడం దారుణమన్నారు. చట్టాలను వేగంగా అమలు చేసి నిందితులకు శిక్ష పడేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు. కఠినమైన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ఘటనలను నియంత్రించగలమని, ఇందుకోసం అన్ని శాఖలు, స్వచ్చంద సంస్థలు కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు.
మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. చిన్న పిల్లలు, యువతులపైనే లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు. ఇలాంటి దాడులకు పాల్పడేవారి ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడానికి.. కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. చిన్నారులపై నేరాలను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. లైంగిక నేరాల నియంత్రణకు చట్టాలను పటిష్టంగా అమలు చేస్తునే.. మరో వైపు ఇలాంటి ఘటనలపై యువతి, యువకులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment