
సాక్షి, విజయవాడ: ఉగాది నాటికి పేదలకు 25 లక్షలు ఇళ్లు ఇవ్వాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం విజయవాడలో ‘ప్రధాన మంత్రి అవాస్ యోజన - వైఎస్సార్ అర్బన్ హౌసింగ్ పథకం’ క్రింద లబ్ధిదారులకు గృహ మంజూరు పత్రాలను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, హౌసింగ్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ధనుంజయ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ.. 137 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు మంజూరు కావడం శుభపరిణామం అని పేర్కొన్నారు. చంద్రబాబు పాపంతో రాష్ట్రం అప్పుల ఉబిలో కూరుకుపోయిందని దుయ్యబట్టారు. ఆయన పాలనలో 108, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీని నీరుగార్చరని మండిపడ్డారు. గ్రామ సచివాలయాల ద్వారా సీఎం వైఎస్ జగన్ పేదలకు పాలనను చేరువ చేశారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేదలకు చేరాలన్న చిత్తశుద్ధితో సీఎం వైఎస్ జగన్ పనిచేస్తున్నారని తెలిపారు. అర్హులందరికీ ఇళ్లు అందేలా చూస్తామని వెల్లడించారు. అమరావతి అంటూ కలల రాజధానిని చంద్రబాబు చూపారన్నారు. రాష్ట్రంలో ఉన్న13 జిల్లాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యమని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు.
గతంలో దళారుల పాలన సాగింది..
ఉగాది నాటికి ఇల్లు లేని పేదలను ఇంటివారిని చేయాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం లో ఇప్పటికే 27 వేల మంది ఇళ్లకు అర్హుల జాబితాలో వున్నారని తెలిపారు. పేదల ఇళ్ల నిర్మాణంపై సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో 3 వేల మందిని ఎంపిక చేసి అవకతవకలకు పాల్పడ్డారన్నారు. టీడీపీ నేతలు పేదల దగ్గర హడావుడి చేసి ఇళ్ల మంజూరు కోసం డబ్బులు వసూలు చేశారని మండిపడ్డారు. గత పాలనంతా దళారుల పాలనలా సాగిందన్నారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని ఎమ్మెల్యే విష్ణు అధికారులను కోరారు.