సాక్షి, విజయవాడ: చంద్రబాబు, టీడీపీ నేతలపై ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. కోడ్ ఉల్లంఘనపై నవరత్నాల వైస్ చైర్మన్ నారాయణ మూర్తి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు.
అయ్యన్నపాత్రుడు దిగజారి మాట్లాడుతున్నారు...
సీఎస్, డీజీపీపై టీడీపీ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నామని నారాయణమూర్తి అన్నారు. అయ్యన్నపాత్రుడు దిగజారి మాట్లాడుతున్నారని, ప్రజాస్వామ్యం బద్దంగా ఉన్న వ్యక్తులపై ఈ తరహా వ్యాఖ్యలు సరికాదన్నారు.
చీరలు పంచితే తప్పేంటి అనడం ఎంతవరకు కరెక్ట్: మల్లాది విష్ణు
ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, టీడీపీ నేతలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించి మాట్లాడుతున్నారు. 175 నియోజకవర్గాల్లో టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై ఎప్పటికప్పుడు ఈసీకి ఫిర్యాదు చేస్తున్నామన్నారు. సుజనా చౌదరి, కేశినేని చిన్ని ఎన్నికల ప్రచారంలో డబ్బులు యథేచ్ఛగా పంచుతున్నారు. ఓటర్లకు డబ్బులు ఇవ్వడం ద్వారా ప్రజాసేవ చేయకుండా గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ, బీజేపీ ప్రజల కోసం పాటుపడిన దాఖలాలు లేవు. ప్రత్యేక హోదాను ప్యాకేజ్‌గా మార్చిన వ్యక్తులు టీడీపీ, బీజేపీ నాయకులేనని మల్లాది విష్ణు దుయ్యబట్టారు.
‘‘అయ్యన్నపాత్రుడు భాష, వ్యవహార శైలి దారుణం. చీరలు పంచితే తప్పేంటి అనడం ఎంతవరకు కరెక్ట్. డీజీపీని దుర్భాషలాడిన ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేశాం. పెన్షన్ ఇవ్వకపోతే చస్తారా అంటూ టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. టీడీపీ అధికారం కోసం చేసే ప్రయత్నాలను ప్రజలు గమనించాలి. చంద్రబాబు రాహుల్‌ని కలిసి, కాంగ్రెస్ తో తిరిగి ఇప్పుడు మమ్మల్ని పిల్ల కాంగ్రెస్ అని విమర్శిస్తున్నారు. ఐదేళ్లు అమరావతి జపం చేసిన మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఒడించారో ఆలోచించుకోవాలి. మైనార్టీల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు’’ అని మల్లాది విష్ణు ధ్వజమెత్తారు.
‘‘వైఎస్సార్ మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చినపుడు కోర్టుకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేసిన వ్యక్తి చంద్రబాబు. మతతత్వ శక్తులతో కలిసి పనిచేసే నువు కూడా మైనార్టీల గురించి మాట్లాడతావా?. రైతులకు ఎవరి హయాంలో ఎంత మంచి జరిగిందో చర్చకు సిద్ధమా?. రుణమాఫీ చేస్తానని మోసం చేసిన చంద్రబాబుకు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు, టీడీపీ, జనసేనకు చెందిన నాయకులంతా జగన్ వెంట నడుస్తున్నారు. కూటమి కచ్చితంగా ఓటమి పాలు అవుతుంది’’ అని మల్లాది విష్ణు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment