ల్లాలో 66 రోజుల సుదీర్ఘ సమ్మె ముగించి ఉద్యోగులు విధుల్లోకి చేరడంతో ప్రభుత్వ కార్యాలయాలు కళకళలాడాయి.
ఒంగోలు, న్యూస్‌లైన్: జిల్లాలో 66 రోజుల సుదీర్ఘ సమ్మె ముగించి ఉద్యోగులు విధుల్లోకి చేరడంతో ప్రభుత్వ కార్యాలయాలు కళకళలాడాయి. ఎప్పుడెప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకుంటాయా...తమ పనులకు ఎప్పుడు మోక్షం కలుగుతుందా అని ఎదురుచూస్తున్న వారికి ఊరట కలిగింది. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ప్రభుత్వ కార్యాలయాలను ‘న్యూస్‌లైన్’ విజిట్ చేసింది. తొలిరోజు కార్యకలాపాలు మందకొడిగానే సాగాయి. కలెక్టరేట్ మొదలు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఉద్యోగుల సందడి కనిపించింది. రెండు నెలలుగా తమ కార్యాలయాల్లో పేరుకుపోయిన పనులు ఒక కొలిక్కి తెచ్చేందుకు అధికారులు దృష్టి సారించారు. రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు తక్షణం తమ శాఖ చేపట్టాల్సిన విషయాలపై సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈసేవ, మీసేవ కార్యాలయాలకు దరఖాస్తుదారులు క్యూ కట్టారు. రెండు నెలలకుపైగా ఉద్యోగులు సమ్మెలో ఉండడంతో పుట్టినరోజు, కులధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ తదితర సర్టిఫికెట్ల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నవారు పోటెత్తారు. ప్రస్తుతం విష జ్వరాలు విజృంభిస్తున్న దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యల గురించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సమీక్ష నిర్వహించారు.
ఆర్టీసీ బస్సులకు మోక్షం: జిల్లాలో రవాణా శాఖ అధికారులు సమ్మెలో ఉండడంతో రీజియన్ వ్యాప్తంగా 110 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇటీవల ప్రభుత్వం సమీప తెలంగాణ జిల్లాల్లో ఎఫ్‌సీ(ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌లు) పొందాలని సూచించింది. దీంతో జిల్లా నుంచి సూర్యాపేట, మిర్యాలగూడ బ్రేక్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాల్లో 45 బస్సులకు ఎఫ్‌సీలు తీసుకున్నారు. ఇంకా 65 బస్సులకు ఈ సర్టిఫికెట్‌లు తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రవాణాశాఖ అధికారులు సమ్మె విరమించారని తెలియగానే ఆర్టీసీ అధికారులు వారిని కలిశారు. శనివారం ఎఫ్‌సీలు పూర్తయితే జిల్లా వ్యాప్తంగా ఆదివారం నుంచి మరో 65 బస్సులు రోడ్డు మీదకు రానున్నాయి.
పక్షం రోజులు అవకాశం కల్పించిన రవాణాశాఖ:
రవాణాశాఖ ప్రజలకు పక్షం రోజుల వెసులుబాటు కల్పించింది. ఎల్‌ఎల్‌ఆర్, డీఎల్ తీసుకోవాలంటే ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాల్సిందే. ఆర్టీఓ కార్యాలయం కూడా 80 శాతం ఆన్‌లైన్ కావడంతో సోమవారం స్లాట్‌లు బుక్ చేసుకునే పనిలో జనం నిమగ్నమయ్యారు. దీంతో రవాణాశాఖ కార్యాలయాల్లో అతి తక్కువ సంఖ్యలో మాత్రమే కార్యకలాపాలు జరిగాయి. అతి తక్కువ సంఖ్యలో మాత్రమే వాహనాలకు ఎఫ్‌సీలు ఇచ్చి పంపించారు. ఇక కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కూడా మందకొడిగా సాగింది. సమ్మెకాలంలో ఆన్‌లైన్‌లో స్లాట్‌లు బుక్ చేసుకున్నవారు తమ శాఖ నుంచి సేవలు పొందలేకపోయిన దృష్ట్యా వారికి కొంత వెసులుబాటు కల్పిస్తున్నామని, వారంతా ఈ పదిహేను రోజుల్లో రవాణాశాఖ ద్వారా సేవలు పొందవచ్చని ప్రాంతీయ రవాణాశాఖ అధికారి కృష్ణమోహన్ తెలిపారు. ఖజానా శాఖలో శుక్రవారం జనం తాకిడి పెద్దగా లేదు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనూ అదే పరిస్థితి. జిల్లా కేంద్రమైన ఒంగోలులోనే 15 రిజిస్ట్రేషన్లు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 54 రిజిస్ట్రేషన్లు అయి ఉంటాయని అంచనా.