సీలేరు, న్యూస్‌లైన్ : ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మళ్లీ అలజడి రేగింది. మావోయిస్టులు, పోలీసులు మధ్య ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మల్కన్‌గిరి జిల్లాలో ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతమైన పొడియా అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పరిస్థితి భయానకంగా మారింది. దీంతో సరిహద్దులో రెడ్‌అలెర్ట్ ప్రకటించారు. ఇటీవలి కాలం వరకు ప్రశాంతంగా వున్న సరిహద్దులో మల్కన్‌గిరి జిల్లా ఏరియా కమిటీ కమాండర్ మాధవ్‌ను బీఎస్‌ఎఫ్ బలగాలు హతమార్చడంతో పరిస్థితి మళ్లీ తలకిందులైంది.
మాధవ్ ఎన్‌కౌంటర్ జరిగిన వారం రోజుల్లోగా బీఎస్‌ఎఫ్ బలగాల వాహనాన్ని మావోయిస్టులు పేల్చివేసి తమ ఉనికిని చాటుకున్నారు. ఇది జరిగి నెల గడవకముందే పొడియా అటవీ ప్రాంతంలో ఒడిశా ఎస్‌వోజీ బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 13మంది మావోయిస్టులు మృతి చెందడంతో మరోసారి ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇటీవల మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలతో పరిస్థితి మరింత భయానకంగా మారిం ది. ఇప్పుడువారు ప్రతీకారంతో రగిలిపోతున్నారు.
భద్రతా బలగాలు అప్రమత్తం : సరిహద్దులో చోటు చేసుకున్న సంఘటనతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఒడిశా మల్కన్‌గిరి జిల్లాల్లో భారీ ఎన్‌కౌంటర్ జరగడంతో ప్రతీకారం తీర్చుకోవడానికి మావోయిస్టులు దాడులకు తెగబడే ప్రమాదం ఉంది. సరిహద్దులో బలగాలన్నీ అప్రమత్తమయ్యాయి. శనివారం సీలేరు వచ్చిన చింతపల్లి డీఎస్పీ అశోక్‌కుమార్‌ను ఎన్‌కౌంటర్‌పై ప్రశ్నించగా ఇప్పటికే అటవీ ప్రాంతంలో బలగాలు ఉన్నాయని, కూంబింగ్ జరుగుతోందని తెలిపారు. వారిని, పోలీస్‌స్టేషన్‌లో బలగాలను కూడా అప్రమత్తం చేసినట్టు తెలిపారు. చిత్రకొండ, సీలేరు, జి.కె.వీధి, కొయ్యూరు, మాచ్‌ఖండ్ వంటి సరిహద్దు పోలీస్‌స్టేషన్లలో అప్రమత్తంగా వుండాలని ఉన్నతాధికారుల నుంచి తాజాగా ఆదేశాలు అందాయన్నారు.
గిరిజనుల భయాందోళనలు : ప్రస్తుత పరిణామాలతో సరిహద్దులో గిరిజనుల్లో మళ్లీ భయాందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుతం మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరుగుతున్న ప్రతీకార దాడుల్లో తమకు ఏం జరుగుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. 14మంది మావోయిస్టులు ఒక్కసారే చనిపోవడంతో అది పోలీస్ ఇన్‌ఫార్మర్ల వల్లే జరిగిందని మావోలు భావిస్తుంటారు. దీంతో మళ్లీ గిరిజన గ్రామాల్లో ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు.
ఏవోబీ ఉద్రిక్తం
Published Sun, Sep 15 2013 3:44 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement