బలిమెల దాడికి ప్రతీకారంగానే ఎన్‌కౌంటర్?
బలిమెల దాడికి ప్రతీకారంగానే ఎన్‌కౌంటర్?
Published Mon, Oct 24 2016 2:48 PM | Last Updated on Thu, Mar 28 2019 5:07 PM
దాదాపు ఎనిమిదేళ్ల క్రితం.. 2008 జూన్ నెలాఖరులో విశాఖపట్నం జిల్లా బలిమెల రిజర్వాయర్‌లో లాంచీలో వెళ్తున్న పోలీసుల మీద మావోయిస్టులు రాకెట్ లాంచర్లతో దాడి చేశారు. మొత్తం 64 మంది పోలీసులు వెళ్తన్న లాంచీ మీద చేసిన ఈ దాడిలో లాంచీ డ్రైవర్‌తో పాటు 38 మంది పోలీసులు మరణించారు. మావోయిస్టులపై పోరాటంలో పోలీసులకు ఇది అతిపెద్ద ఎదురుదెబ్బ. దానికి ప్రతీకారం తీర్చుకోడానికే ఏఓబీలో తాజా ఎన్‌కౌంటర్ జరిగిందని అంటున్నారు. ఆంధ్రా-ఒడిషా సరిహద్దు (ఏఓబీ) ప్రాంతం మావోయిస్టులకు కంచుకోట. చాలా కాలంగా పార్టీ అగ్రనేతలు ఈ ప్రాంతంలోనే సురక్షితంగా ఉన్నారని చెబుతున్నారు. (భారీ ఎన్కౌంటర్: 24మంది మావోయిస్టుల మృతి)
ఆంధ్రా, ఒడిషా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన మావోయిస్టులు ఎప్పుడు ప్లీనరీ నిర్వహించాలన్నా దట్టమైన అటవీ ప్రాంతమైన ఏఓబీనే ఎంచుకుంటారు. అయితే.. అగ్రనేతలు పాల్గొనే ప్లీనరీలకు భద్రత కూడా అదే స్థాయిలో ఉంటుంది. ప్రధానంగా మూడంచెల భద్రతను ఏర్పాటుచేస్తారు. అందులో మందుపాతరల ఏర్పాటు కూడా ఒకటి. కొన్ని కిలోమీటర్ల దూరం నుంచే ఈ భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. అయినా వీటన్నింటినీ ఛేదించుకుంటూ రెండు వైపుల నుంచి గ్రేహౌండ్, ఎస్‌ఓటీ బలగాలు విరుచుకుపడ్డాయంటే దీనికి ఉన్నతాధికారులు, కూంబింగ్ బలగాల అధినేతలు కలిసి పక్కా వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. (పక్కా స్కెచ్తో దాడి, ఆర్కే ఎస్కేప్..)
మళ్లీ తప్పించుకున్న ఆర్కే
మావోయిస్టు అగ్రనేతలలో ఒకరు, కేంద్రకమిటీ సభ్యుడు అయిన అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే ఇప్పటికి చాలాసార్లు పోలీసు దాడుల నుంచి తప్పించుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్ నుంచి కూడా ఆయన సురక్షితంగా తప్పించుకున్నట్లు సమాచారం. మల్కన్‌గిరి జిల్లా జంత్రి ప్రాంతంలో ఆర్కే కనిపించినట్లు కచ్చితమైన సమాచారం పోలీసులకు అందినట్లు తెలుస్తోంది. 2011 సంవత్సరంలో సరిగ్గా ఇదే ప్రాంతంలో అప్పటి మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్ వినీల్ కృష్ణను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. మళ్లీ అలాంటి ప్రాంతంలో ఆర్కే కనిపించడం అంటే ఏదో పెద్ద ఎత్తున కార్యక్రమం ఉన్నట్లు తెలుసుకుని, తదనుగుణంగా పక్కా వ్యూహం రచించి మావోయిస్టులను కోలుకోలేని దెబ్బ కొట్టినట్లు సమాచారం.
Advertisement
Advertisement