ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో మందుపాతర పేలుడు | AP - odisa boundary of the anti-personnel mine explosion | Sakshi
Sakshi News home page

ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో మందుపాతర పేలుడు

Published Wed, Aug 28 2013 5:43 AM | Last Updated on Sat, Jun 2 2018 2:08 PM

AP - odisa boundary of the anti-personnel mine explosion

సాలూరు/పార్వతీపురం, న్యూస్‌లైన్: ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు విరుచుకుపడ్డారు. ఉన్నట్టుండి మంగళవారం ఉదయం మందుపాతర పేల్చారు. ఈ దుర్ఘటనలో నలుగురు బీఎస్‌ఎఫ్ జవానులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ గుండు దూసుకొచ్చి తమ గుండెలను చీల్చుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మల్కన్‌గిరి నుంచి సోమవారం సాయంత్రం నాలుగు వాహనాల్లో బీఎస్‌ఎఫ్ 161 బెటాలియన్‌కు చెందిన 60 మంది జవానులు విశాఖపట్నం మీదుగా గుజరాత్‌కు వెళ్లేందుకు నాలుగు వాహనాల్లో బయలుదేరారు. మూడు వాహనాల్లో 18 మంది చొప్పున, నాలుగో వాహనంలో ఆరుగురు జవానులు ఉన్నారు.
 
 చీకటి పడడంతో సోమవారం రాత్రి వీరంతా కొరాపుట్‌లో ఉండిపోయారు. మంగళవారం ఉదయం మళ్లీ ప్రయాణం కొనసాగించారు. వీరు ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఒడిశా రాష్ట్రంలోని పొట్టంగి బ్లాక్ నారాయణ పొదరు, సుంకి గ్రామాలకు సమీపంలోని 26వ నంబర్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నారు. అక్కడి సకిరాయి గ్రామం చెంతన గల కల్వర్టు వద్దకు వీరి వాహనాలు వచ్చేసరికి మావోయిస్టులు మందుపాతరను పేల్చారు. మొదట ఉన్న మూడు వాహనాలు అప్పటికే కల్వర్టును దాటి పోగా, చివరి వాహనం ప్రమాదంలో చిక్కుకుంది. ఆ వాహనంలో ఉన్న ఆరుగురిలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరణించిన వారిలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఏఎస్‌ఐ జస్వంత సింగ్, హవల్దార్ సురేంద్ర సింగ్, హెడ్‌కానిస్టేబుల్ బీరేంద్ర ప్రసాద్, కానిస్టేబుల్ సురేంద్ర సింగ్ ఉన్నారు. 
 
 గాయపడిన వారిలో ఒకరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన  సిరాజుల్లా కాగా, మరొకరు మహారాష్ట్రకు చెందిన మహేంద్ర కుచ్‌కర్‌లు. నలుగురి మృతదేహాలను వెనక్కి తరలించినట్టు సమాచారం. తీవ్ర గాయాల పాలైన బీఎస్‌ఎఫ్ జవాన్లు సిరాజుల్లా, మహేంద్ర కుచ్‌కర్‌లను సుంకి గ్రామంలో ఉన్న ప్రాథమిక వైద్యశాలలో చికిత్స చేయిస్తుండగా, సమాచారం అందుకున్న ఆంధ్రప్రదేశ్‌లోని పాచిపెంట ఎస్‌ఐ సీహెచ్.స్వామినాయుడు అక్కడికి చేరుకున్నారు. 108 వాహనంలో క్షతగాత్రులను సాలూరు సీహెచ్‌సీకి తరలించా రు.  సాలూరు పట్టణ ఎస్‌ఐ శ్రీనివారావు, రూరల్ ఎస్‌ఐ రామకృష్ణ కూడా వెంటనే స్పందించారు. క్షతగాత్రులకు వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం వారిని విశాఖపట్నం తరలించారు. ఇటీవల మాచ్‌ఖండ్‌లో మావోయిస్టు నేత మాధవ్ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సమాచారం. కొరాపుట్, శ్రీకాకుళం డివిజ నల్ కమిటీ నాయకురాలు అరుణ నేతృత్వంలో 20 మంది మావోయిస్టులు ఈ దాడిలో పాల్గొన్నట్టు మల్కన్‌గిరి డీఐజీ జగ్జత్ సింగ్ తెలిపారు. ఎస్‌ఓపీ నిబంధనలు పోలీసులు పాటించలేదని, దీనివల్లనే జవానులు మందుపాతరకు బలైనట్టు తెలుస్తోంది. ఈ పేలుడు సం ఘటనతో ఆ రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి.
 
 ఒక్క నిమిషం ముందైతే...
 మొత్తం నాలుగు వాహ నాల్లో 60 మంది ఉన్నట్టు తెలుసుకున్న మావోయిస్టులు మందుపాతర పేల్చేందుకు పకడ్బందీగా వ్యూహం పన్నినట్టు సమాచారం. అయితే వారి లక్ష్యం దెబ్బతింది. మొదటి మూడు వాహనాలు వెళ్లేవరకూ మందుపాతర పేలలేదు. దీంతో వాటిలో ఉన్న 54 మంది ప్రాణాలతో బయట పడ్డారు. అదే ఒక్క నిమిషం ముందు సంఘటన జరిగినా భారీ స్థాయిలో ప్రాణనష్టం ఉండేది. చివరి వాహనం కల్వర్టు వద్దకు వచ్చేసరికి పేలుడు సంభవించడంతో నాలుగో వాహనంలో ఉన్న వారు బలైపోయారు.
 
 పేలని మరో మందుపాతర
 కల్వర్ట్ కింద  6 అడుగుల లోతున మావోయిస్టులు మందుపాతర అమర్చినట్టు పోలీసులు తెలిపారు. అలాగే పేలకుండా ఉన్న మరో మందుపాతరను   కనుగొన్నట్లు, గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టు సంఘటన స్థలం వద్ద పర్యవేక్షణలో ఉన్న కొరాపుట్ ఎస్పీ అవినాష్ కుమార్ చెప్పారు. 
 
 ఆయుధాలు కొల్లగొట్టాలని...
 ఆ నాలుగు వాహనాల్లో 200కు పైగా అత్యాధునిక ఆయుధాలున్నాయి. వాటిని లూటీచేయడానికి మావోయిస్టులు ప్రయత్నించినట్టు సమాచారం. అయితే పేలు డు సంభవించిన వెంటనే మిగిలిన వాహనాల్లో ఉన్న వారు అప్రమత్తమయ్యారు. వీరు కాల్పులకు దిగడంతో మావోల వ్యూహం బెడిసికొట్టింది. ఇరువర్గాల మధ్య సుమారు రెండు గంటల పాటు కాల్పులు జరిగాయి. కొరాపుట్ జిల్లాలో గత అయిదేళ్లలో జరిగిన వాటిలో ఇది రెండో పెద్ద దాడిగా పోలీసులు చెబుతున్నారు. 2004లో కొరాపుట్‌లో టౌన్‌లో ఐదుగురిని మావోయిస్టు లు హతమార్చారు. ఆయుధాగారాన్ని దోచుకున్నారు. 2009లో దమంజొడిలో నాల్కోపై సుమారు 200 మంది మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఆరుగురు సీఐఎఫ్‌ఎస్ సిబ్బందిని బలిగొన్నారు.
 
 అప్రమత్తమైన పోలీసులు
 సరిహద్దులో మావోయిస్టులు మందు పాతర పేల్చడం తో ఆంధ్రాలోని  సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాలకు చెందిన పోలీసులు అప్రమత్త మయ్యారు. ఈ ఘటనతో జిల్లా పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఎస్‌ఓజీ దళాలు, ఆంధ్రా పోలీసుల సాయంతో హెలకాప్టర్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టనున్నట్టు జగ్జత్ సింగ్ తెలిపారు.
 
 భయంగుప్పెట్లో సరిహద్దు వాసులు
 ఆంధ్ర-ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ప్రజలు భయంగుప్పెట్లో కాలంగడుతున్నారు. నిత్యం తీవ్ర భయాందోళనల మధ్య కాలంగడుపుతున్నారు. 2004వ సంవత్సరంలో సాలూరు మండలంలో కొదమ గ్రామ సమీపంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో  ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. 
 
 2008లో సాలూరు మండలంలో ఎగువ శెంభి గ్రామంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో కూడా మావోయిస్టులు మృతి చెందారు. పోలీసులకు ఇన్‌ఫార్మార్‌గా వ్యవహారించాడనే నెపంతో ఎగువసెంభీ మాజీ సర్పంచ్ తాడంగి సొన్నంనాయుడును మావోయిస్టులు అప్పట్లో హతమార్చారు. 2012 ఆగస్టు 30న  మక్కువ మండలం ఎర్రసామంత వలస గ్రామంలో ఉన్న సెల్‌టవర్‌ను మావోయిస్టులు పెల్చేశారు. ఇలా సాలూరు, మక్కువ మండలాల ఆంధ్ర-ఒడిశా సరిహద్దు గ్రామాల్లో నిత్యం ఏదో ఒక ఘటన చోటుచేసుకుంటూనే ఉంటోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement