ఏపీ పీసీసీకీ వర్కింగ్ ప్రెసిడెంట్
ఏపీ పీసీసీకి వర్కింగ్ ప్రెసిడెంటును నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు సాగిస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవిని బీసీ వర్గానికి చెందిన ఎన్.రఘువీరారెడ్డి (యాదవ్)కి అప్పగించినందున దళితవర్గానికి చెందిన నేతల పేర్లపై పరిశీలన సాగిస్తోంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు (సీమాంధ్ర) ఇటీవలే వేర్వేరు పీసీసీలను కాంగ్రెస్ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే.
తెలంగాణ పీసీసీకి అధ్యక్షునిగా వెనుకబడినవర్గానికి చెందిన పొన్నాల లక్ష్మయ్యను నియమించడంతోపాటు వర్కింగ్ ప్రెసిడెంటుగా మాజీ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని నియమించారు. అదే సమయంలో సీమాంధ్రలో కేవలం అధ్యక్షుడిని మాత్రమే నియమించి వర్కింగ్ ప్రెసిడెంటు పదవిని ఏర్పాటుచేయలేదు.
కొత్త కమిటీల ప్రమాణం, బాధ్యతలు స్వీకార కార్యక్రమాలకు హాజరైన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ను పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఈ అంశాన్ని ప్రస్తావించారు. సీమాంధ్రలోనూ వర్కింగ్ ప్రెసిడెంటును ఏర్పాటు చేయాలని, తద్వారా ఇతర వర్గాల నేతల్లో పార్టీపట్ల నమ్మకం ఏర్పడుతుందని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడితో చర్చించి వర్కింగ్ ప్రెసిడెంటు పదవిపై నిర్ణయం తీసుకుంటామని దిగ్విజయ్ వారికి తెలిపారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్ష పదవిని బీసీ వర్గానికి ఇవ్వగా ప్రచార, మేనిఫెస్టో కమిటీలను అగ్రవర్ణాలకు చెందిన చిరంజీవి, ఆనం రామనారాయణరెడ్డిలకు కట్టబెట్టారు.
దీంతో దళితవర్గాలను నిర్లక్ష్యం చేశారన్న అభిప్రాయం ఏర్పడింది. ఈ తరుణంలో ఆ వర్గాలకు చెందినవారికి వర్కింగ్ ప్రెసిడెంటును అప్పగిస్తే మంచిదన్న ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి కొండ్రు మురళీ మోహన్‌ను నియమించవచ్చన్న ప్రచారం పార్టీవర్గాల్లో వినిపిస్తోంది.