సాక్షి, అమరావతి బ్యూరో(కృష్ణా) : పెద్దలు చెప్పినట్లు ఆలస్యం చేస్తే అమృతమైనా విషమవుతుందన్న చందంగా ఉంది ఇంజినీరింగ్ కాలేజీల అడ్మిషన్ పరిస్థితి. ప్రతి ఏడాది జరుగుతున్న షెడ్యూల్ కాకుండా ఈ ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ ఏడాది తీవ్ర జాప్యం జరగటంతో విద్యార్థులు ఇతర మార్గాలు అన్వేషించటంతో జిల్లాలో ఇంజనీరింగ్ సీట్లు నిండుతాయా లేదా అన్న అనుమానం రేకెత్తుతోంది. సాధారణంగానే జిల్లాలోని కాలేజీలలో సుమారు ఐదు వేల సీట్లు గతేడాది ఖాళీగా ఉన్నాయి. అసలే ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న సమయంలో ఆడ్మిషన్లు ఆలస్యమవటంతో కాలేజీ యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నారు.
జిల్లాలో 34 ఇంజినీరింగ్ కాలేజీలు
కృష్ణా జిల్లా పరిధిలో 34 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో వివిధ బ్రాంచ్‌లలో 18,090 సీట్లు ఉన్నాయి. ఇది వరకు మరో ఐదు వేల సీట్లు ఉన్నప్పటికీ ఆడ్మిషన్లు తగ్గటంతో కాలేజీలు తమకున్న సీట్లను వదులుకోవాల్సి వచ్చింది. ఫార్మసీ కాలేజీలు 11 ఉండగా అందులో 1,100 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మన జిల్లాలో వర్శిటీ కాలేజీలు లేవు. జిల్లాలో 26,799 మంది విద్యార్థులు ఎంసెట్ పరీక్ష రాయగా అందులో 20,743 మంది ఎంసెట్ పరీక్షలో ఆర్హత సాధించారు.
తెలంగాణ ఇంటర్ ఫలితాలతో జాప్యం!
ఏపీ ఎంసెట్ పరీక్షను అనుకున్న సమయానికే నిర్వహించినప్పటికీ అనివార్య కారణాల వల్ల ఫలితాలను విడుదలలో తీవ్ర జాప్యం జరిగింది. ఇందుకు ప్రధాన కారణం తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో వచ్చిన గందరగోళమే. తెలంగాణ స్థానికత కలిగిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ పరీక్షను నాన్ లోకల్ కేటగిరిలో రాశారు. ఎంసెట్ ర్యాంకులు ప్రకటించటానికి ఇంటర్మీడియట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకుల ప్రకటన ఉంటుంది. అయితే తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో పొరపాట్లు జరగటం, విద్యార్థులు కోర్టులకెక్కటం వంటి కారణాలతో వారి మార్కులను తెలంగాణ ఇంటర్ బోర్డు ఏపీ ఎంసెట్ అధికారులకు అందజేయలేదు. దీంతో ర్యాంకుల ప్రకటన ఆలస్యమైంది.
పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న అడ్మిషన్లు
ఏపీ ఎంసెట్ ప్రక్రియ ఆలస్యం అవ్వటంతో మన విద్యార్థులు పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు, కర్నాటకలలోని ప్రముఖ కాలేజీలకు క్యూ కట్టి మరీ అడ్మిషన్లు పూర్తి చేస్తున్నారు. ఏపీ ఎంసెట్‌లో మంచి ర్యాంకు వస్తుందో రాదో...ఆలోగా పక్క రాష్ట్రాలలో సీట్లు భర్తీ అయిపోతాయేమోనన్న భయంతో అడ్మిషన్ల విషయంలో తొందరపడ్డారు. ప్రతి ఏడాది పక్క రాష్ట్రాలకు అడ్మిషన్లు పోయినప్పటికి ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కొన్ని పేరుమోసిన డీమ్డ్ యూనివర్శిటీలలో అడ్మిషన్ పొందటానికి విద్యార్థులు ఉత్సాహం చూపుతున్నారు. మరో వైపు సాంప్రదాయ డిగ్రీ విద్యకు ఆదరణ పెరగడం కూడా ఇంజనీరింగ్ అడ్మిషన్ల సంఖ్య తగ్గటానికి కారణమవుతోంది.
ఆందోళనలో యాజమాన్యాలు...
ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ జాప్యమవటం, విద్యార్థులు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నారన్న సమాచారంతో ఇంజనీరింగ్ యాజమాన్యాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. అసలే కళాశాలలో అడ్మిషన్లు తగ్గి, గత ప్రభుత్వం సరిగ్గా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించక ఇబ్బందిపడుతున్న ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు భవిష్యత్ గురించి బెంగపెట్టుకున్నారు. ఇతర మార్గాలు అన్వేషించకుండా ఇక్కడే ఇంజనీరింగ్ చేయాలని చూస్తున్న విద్యార్థులు సైతం ఎంసెట్ కౌన్సెలింగ్ ఎప్పుడు ఉంటుందా, అడ్మిషన్ ఎక్కడ దొరుకుతుందో అన్న ఆందోళనలో ఉన్నారు. ఫార్మసీ కాలేజీలు, విద్యార్థుల పరిస్థితి కూడా ఇలానే ఉంది.
జిల్లాలో ఇంజినీరింగ్ కాలేజీలు | 34 |
ఇంజినీరింగ్ సీట్లు | 18,090 |
ఎంసెట్ పరీక్ష రాసిన విద్యార్థుల సంఖ్య | 26,799 |
ఎంసెట్ పరీక్షలో ఆర్హత సాధించిన విద్యార్థుల సంఖ్య | 20,743 |
Comments
Please login to add a commentAdd a comment