అధ్యక్ష పదవికోసం టీ‘ఢీ’పీ
♦ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ
♦ నామినేటెడ్ పదవుల కోసం గంపెడాశలు
♦ పెరిగిపోతున్న ఆశావహుల జాబితా
♦ ఎవరికి వారే పైరవీలు
♦ ఖరారు చేస్తే... రచ్చరచ్చే
సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీలో మరో చిచ్చు రేగబోతోంది. నిన్నటి వరకు మంత్రి పదవి విషయంలో రచ్చ చేసిన పచ్చనేతలు ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవితో పాటు నామినేటేడ్ పదవులపై పడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఒక పదవి వస్తే నాలుగు కాసులు వెనకేసుకోవచ్చనే అభిప్రాయంతో ఉన్న నేతలు ప్రతీ పదవినీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. కేబి నెట్ విస్తరణ సమయంలో నేతలంతా రెండు గ్రూపులు గా విడిపోయారు. అధినేత జోక్యం చేసుకున్నా ఇంకా సఖ్యత కనబడటం లేదు. ప్రస్తుతం కలిసినట్టుగా కలరింగ్ ఇస్తున్నా లోలోపల రగిలిపోతూనే ఉన్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడు సత్తా ఏంటో చూపిస్తామంటూ గుంభనంగా ఉన్నారు.
అధ్యక్ష పదవి రూపంలో మరో చిచ్చు
ప్రస్తుత టీడీపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ సుదీర్ఘకా లంగా అదే పదవిలో ఉన్నారు. గత సంస్థాగత ఎన్నికల్లో నే ఆయన్ను మార్చేందుకు టీడీపీలోని కొన్ని శక్తులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. అశోక్ అండదండలతో ఆయనే కొనసాగారు. ఈ సారి పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. అధ్యక్షుడిగానే కాకుండా ఎమ్మెల్సీ గా కూడా ఆయన కొనసాగుతున్నారు.దానికితోడు గతం కన్నా అశోక్ ప్రాధాన్యం పార్టీలో తగ్గింది. ఆయనకు మునపటి పట్టు లేదు. అది సుజయ్‌కృష్ణ రంగారావుకు మంత్రి పదవి ఇచ్చినప్పుడే తేటతెల్లమైపోయింది. కాబట్టి ఆయన ఆశీస్సులతో కొనసాగుతున్న జగదీష్‌ను ఆ పదవిలో కొనసాగించే అవకాశాలు లేవన్న ప్రచారం జరుగుతోంది.
ఎవరికి వారు ప్రయత్నాలు
సుజయ్‌కృష్ణ రంగారావుకు మంత్రి పదవి రాకుండా సర్వశక్తులొడ్డిన గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనా యుడు అధ్యక్ష పదవికోసం ఇప్పుడు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికే ఇస్తారని... ఈ సమీకరణాల్లో తనకొస్తుందని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడదే పదవి కోసం తన సోదరుడు కొండపల్లి కొండలరావు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నారు.
తనను అణగదొక్కుతున్నారన్న ఆందోళనతో తమ్ముడిని కాదని అధ్యక్ష పదవిని దక్కించుకుని సమాంతర రాజకీయాలు చేద్దామనే అభిప్రాయంతో ఉన్నారు. ఇప్పటికే ఆయన సీఎం చంద్రబాబును కలిశారు. మంత్రి వర్గ విస్తరణకు ముందే సుజయ్‌కృష్ణ రంగారావు శిబిరంలో చేరారు. మిగతా నేతల మద్దతు కూడగట్టేందుకు ప్ర యత్నిస్తున్నారు. ఇక, ఎస్‌కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కూడా అధ్యక్ష పదవి కోసం ఆశలు పెట్టుకున్నట్టు తెలు స్తోంది. తనకు గాని, తన భర్త కోళ్ల రాంప్రసాద్‌కు గాని అధ్యక్ష పదవి ఇవ్వాలని ఇప్పటికే పైరవీలు ప్రారంభించి నట్టు సమాచారం.
తనకున్న టీటీడీ బోర్డు మెంబర్ పదవీ కాలం కూడా ముగియడంతో అధ్యక్ష పదవిని తన ఇంట్లోవారికే తెచ్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. మరో సీనియర్ నేత పతివాడ నారాయణస్వామి నాయుడు కూ డా రేసులో ఉన్నామంటున్నారు. తనకు ఎలాగూ మంత్రి పదవి ఇవ్వలేదు... కనీసం తన కుమారుడికి పార్టీ అధ్యక్ష పదవైనా ఇవ్వాలని కోరుతున్నట్టు తెలిసింది. ఇదే విషయాన్ని మరో ఆశావహుని వద్ద ప్రస్తావించినట్టు తెలియవచ్చింది. ఇదిలా ఉండగా, కుల వివాదంపై కలెక్టర్ తీసుకున్న నిర్ణయంతో జోష్‌తో ఉన్న సాలూరు మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్ కూడా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్టు తెలుస్తోం ది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడ్ని ఎంపిక చేస్తే పార్టీలో ఏం జరుగుతుందన్నది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
నామినేటేడ్ పోరు
టీడీపీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పోస్టుల భర్తీ కనీసం జరగలేదు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టులు తప్ప మరేవి భర్తీ కాలేదు. దేవస్థానాల పాలక మండళ్లు, గ్రంథాలయ సంస్థ చైర్మన్, వుడా డైరెక్టర్ పోస్టులతో పాటు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయకుండా చంద్రబాబు తాత్సారం చేస్తున్నారు. ఇప్పుడీ పదవుల కోసం ఆశపడి ఉన్న వారి జాబితా చాంతాడంత ఉంది. తెంటు లకు‡్ష్మంనాయుడు, కె.త్రిమూర్తులరాజు, ఐ. వి.పి.రాజు, కడగల ఆనంద్‌కుమార్, ఎస్.ఎన్. ఎం.రాజు, కర్రోతు నర్సింగరావు, గొట్టాపు వెంకటనా యుడు, సిటీ కేబుల్ ఎండీ శ్రీనివాసరావు, రావి శ్రీధర్ తదితరులు రేసులో ఉన్నారు. ఇందులో ఏమైనా తేడాలొస్తే పార్టీలో మరోసారి రచ్చ జరగడం ఖాయం.