'బాబుకు అబద్దాల రోగం వచ్చింది'
ఏపీ సీఎం చంద్రబాబుకి అబద్దాల రోగం అంటుకుందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా విమర్శించారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అబద్దాల రోగం అంటుకుందని ఏపీసీసీ అధ్యక్షుడు డా.ఎన్.రఘువీరా రెడ్డి విమర్శించారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం స్పిల్ వే మూడో పియర్ వద్ద కాంక్రీటు పనులు ప్రారంభించిన బాబు ప్రచార ఆర్భాటాలు ఓ ఇంజనీరు ప్రాణం మీదకు తెచ్చేవని అన్నారు. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపే వరకూ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనని మోదీతో బాబు చెప్పారని అనడం పచ్చి అబద్దమని అన్నారు. ఆ మండలాలను ఏపీలో కలుపుతూ యూపీఏ ప్రభుత్వం అప్పట్లోనే ఆర్డినెన్స్ ను జారీ చేసిందని గుర్తు చేశారు.
ఆ తర్వాత వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం ఆర్డినెన్స్ ను కేబినేట్ లో ఆమోదించకుండా ద్రోహం చేసిందని అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన రూ.5,135 కోట్లను బాబు తిరిగి రాబట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. కమీషన్ల కోసం కక్కుర్తితో కేంద్ర ప్రభుత్వం చేతుల్లోంచి పోలవరాన్ని తీసుకున్నారని ఆరోపించారు. నూతన సంవత్సరంలో ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలనపై పోరాడాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యక్షులు మాదాసు గంగాధరం తదితరులు పాల్గొన్నారు.