=అసలు దారికి బహు దూరం
=నామమాత్రంగా నిర్వహణ
=ప్రజలతో జరగని ముఖాముఖి
మంత్రి బాలరాజు దూరం
ప్రశ్నించని టీడీపీ ఎమ్మెల్యేలు
సమైక్యాంధ్ర అంశానికే ప్రాధాన్యం
ప్రజల వద్దకు పాలకులు వెళ్లి.. వారి సమస్యలు విని పరిష్కారానికి చర్యలు నిర్దేశించడం రచ్చబండ లక్ష్యం.. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మహానేత వైఎస్ ఆశయమూ అదే. అయితే నానాటికీ సంకల్పం సడలిపోతోంది. పథకం గురి తప్పుతోంది. రచ్చబండ పేరు మాత్రమే మిగిలింది. ప్రజల సమస్యలు విని, వాటిని పరిష్కరించే చొరవ కొరవడుతోంది. సాక్షాత్తూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చోడవరంలో పాల్గొన్న రచ్చబండ ఇదే ‘రాంగ్‌రూట్’ లో నడిచింది. ప్రజలతో మాటామంతీ లేకుండా, వారి సమస్యలు విని, చర్చించే కార్యక్రమమే లేకుండా తూతూమంత్రంగా సాగింది. ప్రతిపక్ష టీడీపీ ప్రజాప్రతినిధుల ప్రశంసల వర్షంతో ఆపాటి ధిక్కార స్వరం కూడా వినిపించలేదు.
సాక్షి, విశాఖపట్నం/న్యూస్‌లైన్, చోడవరం : రచ్చబండ గాడి తప్పింది. ఆశయానికి భిన్నంగా అడ్డదారిలో సాగింది. ప్రజా సమస్యలు తెలుసుకోకుండానే సీఎం కార్యక్రమం ముగిసింది. అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల అమలు తీరుపై ఆరాతీయకుండానే ముగించేయడంతో అసలు సభ ఎందుకు జరిగిందో కూడా తెలియకుండా పోయింది. ప్రశ్నించాల్సిన టీడీపీ ఎమ్మెల్యేలు తందానతాన అనడంతో ప్రశ్నించే స్వరం వినిపించకుండాపోయింది. స్థానిక ప్రజాప్రతినిధులు అనేక సమస్యలు చెప్పుకున్నా సీఎం స్పందన అంతంతమాత్రంగానే ఉంది. జిల్లాకు రెండు, చోడవరం నియోజకవర్గానికి మూడు వరాలిచ్చి ఊరుకోవడంతో ఆశలు అడియాసలైనట్టయింది. హామీల కన్నా..సమైక్యాంధ్ర ప్రసంగమే మార్మోగింది.
ఉసూరన్న జనం
‘ఇళ్లు ఇప్పిస్తాం, పింఛన్లు మంజూరు చేయిస్తాం, రేషన్ కార్డు ఇప్పించేస్తాం, నేరుగా సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం కల్పిస్తాం... పిటిషన్లు పట్టుకునే వస్తే చాలు’ అని అధికారులు నమ్మబలకడంతో జిల్లా నలుమూలల నుంచి జనం తరలివచ్చారు. దాంతో సభ విజయవంతమైంది. కానీ సభ లక్ష్యం నెరవేరలేదు. ప్రజల సమస్యల్ని సీఎం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ప్రజలతో ముఖాముఖి మాట్లాడలేదు.
పథకాల అమలు తీరుపై కనీసం ఆరా తీయలేదు. రచ్చబండపై రాజకీయ ప్రసంగాలే వినిపిం చాయి. దీనికి టీడీపీ ఎమ్మెల్యేలు వంతపాడారు. చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు అటు మంత్రి గంటాను, ఇటు సీఎంను పొగడ్తలతో ముంచెత్తారు. తానే కొన్ని సమస్యలు వివరించారు. మాడుగుల ఎమ్మెల్యే గవిరెడ్డి ఇదే బాటలో వెళ్లి నియోజకవర్గ సమస్యలు చెప్పుకున్నారు. రచ్చబండకు స్థానిక సర్పంచ్ అధ్యక్షత వహించాల్సి ఉండగా, సర్పంచ్‌కు కనీసం మాట్లాడే అవకాశమైనా ఇవ్వలేదు. ప్రజల నుంచి సభ మధ్యలోనే కొందరు పిటిషన్లు తీసేసుకున్నారు.
ఇవీ వరాలు : మంత్రి గంటా శ్రీనివాసరావు, చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు చాలా సమస్యలను సీఎం వద్ద వెళ్లబోసుకున్నారు. కానీ సీఎం మాత్రం జిల్లాకు రెండు, నియోజకవర్గానికి మూడే మూడు వరాలిచ్చి చేతులు దులుపుకున్నారు. చెరకు మద్దతు ధర గురించి ఆయన కనీసం స్పందించలేదు. దీంతో రైతులు నిరాశ పడ్డారు. డీఎస్సీ పోస్టులు భర్తీ చేయాలని స్పెషల్ డిఎస్సీ అభ్యర్థులు, 610 జీవోను రద్దు చేయాలని ఉపాధ్యాయులు వినతిపత్రాలు, ప్లకార్డులు పట్టుకుని సభలో నిరసన తెలియజేశారు. అంతకుముందు సమస్యలు చెప్పడానికి వస్తున్న సీపీఎం కార్యకర్తలతో కలిసి వస్తున్న ప్రజల్ని బాని కోనేరు, రెల్లివీధి వద్ద పోలీసులు అరెస్టు చేశారు.
సమైక్య నినాదం : గంటన్నర ఆలస్యంగా సభాస్థలికి చేరుకున్న సీఎం వెంటనే మంత్రి గంటా, ఎమ్మెల్యేలు కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, గవిరెడ్డి రామానాయుడు, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కరణం ధర్మశ్రీలకు మాట్లాడే అవకాశమిచ్చారు. తర్వాత ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో సమైక్యాంధ్ర అంశాన్ని లేవనెత్తారు.
ఆద్యంతం అదే అంశాన్ని ప్రస్తావించారు. సమైక్యాంధ్ర కావాలని చేతులెత్తాలంటూ ప్రజల్ని ఉత్తేజపరిచేలా మాట్లాడారు. సమావేశానికి మంత్రి బాలరాజు, సిటీ ఎమ్మెల్యేలు ద్రోణంరాజు శ్రీనివాస్, మళ్ల విజయప్రసాద్, తైనాల విజయకుమార్ గైర్హాజరయ్యారు. తనకు అహ్వానం లేదన్న కారణంతో గైర్హాజరైనట్టు బాలరాజు చెప్పగా అది సరి కాదని అధికారులు స్పష్టం చేశారు. సీఎం పేషీ కూడా ప్రకటన విడుదల చేస్తూ, బాలరాజుకే ముందు సమాచారం ఇచ్చామని స్పష్టం చేయడం విశేషం.