విజయవాడ బస్టాండ్‌లోని ఓ బస్సులో శానిటైజ్ చేస్తున్న సిబ్బంది
చార్జీలు యధాతథంగా ఉంటాయి. అన్ని రకాల రాయితీ ప్రయాణాల్ని తాత్కాలికంగా నిలిపేశాం. ప్రతి ప్రయాణికుడు మొబైల్‌లో ఆరోగ్య సేతు యాప్ కలిగి ఉండాలి. టిక్కెట్ ఉన్న ప్రయాణికుడిని మాత్రమే బస్టాండ్‌లోకి అనుమతిస్తారు. ఏ రోజుకు ఆ రోజు బుకింగ్ చేసుకుంటే రిజర్వేషన్ చార్జీలు వసూలు చేయడం లేదు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, గూగుల్ పే లాంటి అన్ని రకాల వాలెట్‌ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. 65 ఏళ్లు దాటిన వాళ్లు, 10 ఏళ్ల లోపు పిల్లలను అత్యవసర మైతేనే (మెడికల్ ఎమర్జెన్సీ) బస్సులో అనుమతిస్తాం. నెమ్మదిగా ఆర్థిక వృద్ధి పెంచే దిశగానే బస్సు సర్వీసులు పెంచుతాం.
రాత్రి పూట కర్ఫ్యూ ఉన్నా, వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని బస్సులు నడుపుతాం. అయితే ప్రయాణికులు రాత్రి 7 గంటలలోపే బస్టాండ్‌కు చేరుకోవాలి. విశాఖ, విజయవాడలో సిటీ బస్సులు నడపటం లేదు. అంతర్రాష్ట్ర సర్వీసులు నడపాలని ఆయా రాష్ట్రాల అనుమతి కోసం లేఖలు రాశాం. వారి నుంచి అనుమతి రాగానే ఆ సర్వీసులు ప్రారంభిస్తాం.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు గురువారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఉదయం 7 గంటలకు తొలి బస్సు సర్వీస్ ప్రారంభిం చనున్నారు. ఇందుకు సంబంధించి బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ ప్రారంభమైంది. కండక్టర్లు లేకుండా నగదు రహిత కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ మేరకు బుధవారం ఆ సంస్థ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ విజయవాడలోని ఆర్టీసీ హౌజ్‌లో మీడియాకు వివరాలు వెల్లడించారు.
► సూపర్ డీలక్స్, లగ్జరీ బస్సుల్లో సీట్లను కుదించాం. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కూర్చోకూడని సీట్లకు మార్క్ చేశాం. బస్సుల్లో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. బస్టాండ్‌లలో మాస్క్‌లు అందుబాటులో ఉంటాయి. 10 రూపాయలకు మాస్క్ అమ్మాలని నిర్ణయించాం.
► 58 రోజుల నుండి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నిత్యావసర వస్తువుల కోసం కొన్ని బస్సులు తిప్పాం. వలస కూలీల కోసం అన్ని చెక్‌పోస్ట్‌లలో బస్సులు ఉంచాం. రిలీఫ్ సెంటర్లకు వారిని చేర వేసేందుకు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు బస్సులు ఏర్పాటు చేశాం.
► ప్రతి బస్టాండ్‌లో శానిటైజర్ సదుపాయాన్ని కల్పించాం. బస్సు ఎక్కే ముందు ప్రతి ప్రయాణికుడు శానిటైజర్‌తో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. నగదు రహితంగా, పేపర్ లేకుండా టికెట్ ఇవ్వాలని చాలా కాలం కసరత్తు చేశాం. ఆర్డినరి, ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, డీలక్స్ బస్సులకు ఆన్‌లైన్ రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించాం.
► మన రాష్ట్రంలో తొలుత 17 శాతం సర్వీసులు, అంటే 1,683 బస్సులు మాత్రమే ప్రారంభిస్తున్నాం.
► ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఏసీ బస్సులు నడుపుతాం. 26 డిగ్రీల ఉష్ణోగ్రత నిర్వహిస్తాం. అటెండర్లు ఉండరు. ఏసీ సర్వీసుల్లో దుప్పట్లు ఇవ్వము.
► లాక్‌డౌన్ కాలంలో ఆర్టీసీకి రూ.1,200 కోట్ల నష్టం వచ్చింది. రూ.700 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం.
Comments
Please login to add a commentAdd a comment