
పుష్కరాలకు భారీ ఏర్పాట్లు: ఆర్టీసీ ఎండీ
ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా పుష్కర ఏర్పాట్లు పూర్తయినట్లు ఆర్టీసీ ఎండీ సాంబశివరావు తెలిపారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో పుష్కర యాత్రికులకు పన్నెండు రోజుల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఏపీ ఇంఛార్జి డీజీపీ, ఆర్టీసీ ఎండీ ఎన్.సాంబశివరావు తెలిపారు. శనివారం ఆర్టీసీ హౌజ్‌లో పోలీసు, ఆర్టీసీ, రవాణా శాఖలకు చెందిన అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పుష్కరాలు జరిగే మూడు జిల్లాల్లో మొత్తం 24 వేల మందితో పోలీస్ బందోబస్తు నిర్వహిస్తామని, విజయవాడ నగరంలో 1,300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆర్మ్‌డ్ రిజర్వ్ గ్రౌండ్స్‌లో కమాండ్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు.
కర్నూలు, గుంటూరులలో రిజర్వ్ ఫోర్సును అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 136 ప్రైవేటు పార్కింగ్ ప్రదేశాలు గుర్తించామని, విజయవాడ నగరంలోనే 22 ప్రదేశాలలో పెయిడ్ పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశామన్నారు. రోడ్డు మీద ప్రైవేటు వాహనం ఆగితే భారీ జరిమానాతో పాటు క్రేన్ల సాయంతో యార్డుకు తరలిస్తామన్నారు. నో వెహికల్ జోన్ మ్యాపులను త్వరలో విడుదల చేస్తామని సాంబశివరావు ప్రకటించారు. టోల్‌ప్లాజాల్లో వాహనాలు నిలిచిపోకుండా సీఎం ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నారని, టోల్ ఫీజుపై త్వరలో ప్రకటన చేస్తామని చెప్పారు.
ఆటోలు, రవాణా వాహనాలు అధిక ఫీజులు వసూలు చేయకుండా రవాణా శాఖ నియంత్రిస్తుందన్నారు. పుష్కర యాత్రికులు ఏ బస్ ఎక్కాలి.. ఏ ఘాట్‌కు ఎలా చేరుకోవాలనే సమాచారాన్ని కరపత్రాలు, బ్యానర్ల ద్వారా బస్సులతో పాటు అన్ని ముఖ్యప్రాంతాల్లో ప్రచారం చేస్తామని చెప్పారు. విజయవాడలో శాటిలైట్ బస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని, పండిట్ నెహ్రూ బస్టాండ్‌ను పుష్కరాలు జరిగే 12 రోజులు సిటీ బస్టాండ్‌గా మాత్రమే వినియోగిస్తామని తెలిపారు. ఘాట్లకు, దుర్గ గుడికి పీఎన్‌బీఎస్ బస్టాండ్ దగ్గర్లో ఉన్నందున దూర ప్రాంత సర్వీసులు నడపబోమన్నారు. నగరంలో 600 సిటీ సర్వీసులు నడిపేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వివరించారు.