
ఒలింపిక్స్‌పై గురిపెట్టండి
రియో (బ్రెజిల్)-2016 ఒలింపిక్స్‌లో భారతదేశం పతకాలు సాధించే ఈవెంట్లలో ప్రధాన క్రీడగా ఆర్చరీ ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు ....
ఆర్చరీ క్రీడాకారులకు సీపీ హితవు
ఘనంగా ప్రారంభమైన చెరుకూరి
లెనిన్-ఓల్గా స్మారక ఆర్చరీ పోటీలు
20 రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు
విజయవాడ స్పోర్ట్స్ : రియో (బ్రెజిల్)-2016 ఒలింపిక్స్‌లో భారతదేశం పతకాలు సాధించే ఈవెంట్లలో ప్రధాన క్రీడగా ఆర్చరీ ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో చెరుకూరి లెనిన్-ఓల్గా స్మారక 37వ జాతీయ జూనియర్, ఏడో మినీ జాతీయ ఆర్చరీ పోటీలను మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించే లక్ష్యంతో ముందుకెళ్తున్న చెరుకూరి లెనిన్-ఓల్గా ఆర్చరీ అకాడమీకి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలన్నారు. పోటీల్లో పాల్గొన్న 20 రాష్ట్రాల ఆర్చర్లు విజయవాడ నగరాన్ని సందర్శించాలని కోరారు. గౌరవ అతిథి, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఆర్చరీకి చెరుకూరి సత్యనారాయణ వన్నె తీసుకురాగా, ప్రపంచ క్రీడా చిత్రపటంలో దివంగత చెరుకూరి లెనిన్ నగర ఖ్యాతిని ఇనుమడింపజేశారన్నారు. ఆర్చరీ అసోసియేషన్ ఇండియా ప్రధాన కార్యదర్శి అనీల్ కామినేని మాట్లాడుతూ 2015లో జరిగే ఏషియన్, వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌ల్లో పాల్గొనేందుకు ఆర్చర్లు సిద్ధపడాలన్నారు.
మునిసిపల్ కమిషన ర్ సి.హరికిరణ్ మాట్లాడుతూ చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీకి తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ అధ్యక్షత వహించగా, మేయర్ కోనేరు శ్రీధర్, స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ చెన్నుపాటి గాంధీ, డీఎస్‌డీవో పి.రామకృష్ణ, వేదగంగోత్రి ట్రస్ట్ చైర్మన్ వరప్రసాద్, ఒలింపిక్ సంఘ కార్యదర్శి కేపీ రావు, పలు క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తొలుత ఆర్చర్లు మార్చ్‌పాస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నారుు.
ఉత్సాహంనింపిన సీపీ ప్రసంగం
ఆర్చరీ పోటీల సందర్భంగా సీపీ చేసిన ప్రసంగం క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపింది. అంతటితో ఆగకుండా ఆయన ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్‌ను పిలిచి వెంటనే కాంపౌండ్ బౌల్‌ను కొనుగోలు చేసి కమిషనరేట్‌లో పోలీసు అధి కారులు రిలాక్స్ కోసం ప్రాక్టీస్ చేరుుంచాలని సూచించారు.
తొలిరోజు ఫలితాలు
తొలిరోజు జరిగిన కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో టీమ్ చాంపియన్‌షిప్‌లో విజయవాడ ఓల్గా ఆర్చరీ క్రీడాకారిణులు నిరాశపరిచినా వ్యక్తిగత ర్యాంకింగ్‌లో ఒలింపిక్ రౌండ్‌కు అర్హత సాధించారు. జూనియర్ బాలిక, మినీ బాలుర టీమ్ చాంపియన్‌షిప్‌లో ఏపీ ఆర్చర్లు రన్న రప్‌గా నిలిచారు. జూనియర్ బాలికల కాంపౌండ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో 217-217 తేడాతో ఏపీ, జార్ఖండ్ జట్లు టైగా నిలవగా, టై బ్రేక్‌లో ఒక్క క్లోజర్ పాయింట్‌తో జార్ఖండ్ జట్టు విజయం సాధించింది. మినీ బాలుర విభాగంలో టీమ్ చాంపియన్‌షిప్‌లో మణిపూర్ స్వర్ణపతకం సాధించగా, ఆంధ్రప్రదేశ్ జట్టు రజత పతకం, హర్యానా కాంస్య పతకం కైవసం చేసుకున్నాయి. వ్యక్తిగత ర్యాంకింగ్-మినీ బాలికల విభాగంలో ఓల్గా ఆర్చర్లు కె.జ్యోత్స్న 627 పాయింట్లతో టాప్ స్థానంలో నిలిచింది. జూనియర్ ర్యాంకింగ్ విభాగంలో పూర్వాష 669, అనూషరెడ్డి 667 పారుుంట్లతో ప్రథమ, ద్వితీయ, తరంగ, గీతికాలక్ష్మి 659 పాయింట్లతో మూడు, నాల్గో స్థానాల్లో నిలిచారు. వీరంతా బుధవారం జరిగే వ్యక్తిగత ఒలింపిక్ రౌండ్‌కు అర్హత సాధించారు.