ఆట తెలుసుకుందాం
నిత్యం క్రికెట్ నామస్మరణలో మునిగితేలే భారత్‌లో ఒలింపిక్స్‌లోని క్రీడల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. బ్యాడ్మింటన్, హాకీ, టెన్నిస్‌లాంటి రెగ్యులర్ ఆటలతో పాటు మనకు తెలియని క్రీడాంశాలు కూడా ఒలింపిక్స్‌లో చాలా ఉంటాయి. అందుకే ప్రతి రోజూ ఓ ఆట, దానిలో విశేషాలు, భారత్ నుంచి ప్రాతినిధ్యం ఇలాంటి అంశాల సమాహారంతో సాక్షి అందిస్తోంది ‘ఆట తెలుసుకుందాం’.
ఆర్చరీ
పురాతన కాలంలో వేటాడటానికి, పోరాటం చేయడానికి ఉపయోగించే విల్లు బాణాలే... ఆధునిక కాలంలో ఆర్చరీ క్రీడగా మారిపోయాయి. చూడటానికి సింపుల్‌గా కనిపించినా... విల్లు నుంచి బాణం రివ్వున దూసుకుపోవాలంటే నరాల్లోని శక్తినంతా బయటకు తీయాల్సిందే. ఎదురుగా 70 మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని గురి చూసి కొట్టాలంటే మనలోని ఏకాగ్రత చెక్కు చెదరకూడదు. మొక్కవోని పట్టుదల, అంకితభావం, ఆత్మవిశ్వాసం తోడుగా నిలిస్తేనే ఈ క్రీడలో విజేతగా నిలవొచ్చు. ఆర్చరీలో రకరకాల విభాగాలు ఉన్నా... ఒలింపిక్స్‌లో మాత్రం రికర్వ్ విభాగంలోనే పోటీలు జరుగుతాయి. దీనికి సంబంధించిన బౌ (విల్లు)లో హ్యాండిల్, రెండు లింబ్‌లు, బౌ స్ట్రింగ్, యాక్సెసరీలు, స్టెబిలైజర్ రాడ్స్ ఉంటాయి. ఇందులో ఉపయోగించే బాణం మామూలుగా 9.3 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. కానీ వేగంగా దూసుకుపోవడానికి వీటిని 5.5 మిల్లీ మీటర్ల మందంతో తయారు చేస్తారు. ఫలితంగా గంటకు 240 కిలోమీటర్ల వేగంతో బాణం దూసుకుపోతుంది. టార్గెట్‌లో 10 సెంట్రిక్ సర్కిల్స్ ఉంటాయి. మధ్యలో సర్కిల్ 1.22 డయా మీటర్‌లో ఉంటుంది. గ్రౌండ్‌పై 1.3 మీటర్ల ఎత్తులో నిలబడి లక్ష్యం వైపు బాణాన్ని సంధిస్తారు.
అందుబాటులో ఉన్న స్వర్ణాలు: 4
కొరియాదే ఆధిపత్యం
ఒలింపిక్స్‌లో 1900 సంవత్సరంలో ఆర్చరీని ప్రవేశపెట్టారు. కానీ సియోల్ (1988) గేమ్స్‌లో కొరియన్లు చెలరేగడంతో ఈ క్రీడ ఓ వెలుగు వెలిగింది. బరిలోకి దిగిన ప్రతి ఈవెంట్‌లో వాళ్లు పతకాలు కొల్లగొట్టారు. ఇక అప్పట్నించి దక్షిణ కొరియా ప్రపంచ ఆర్చరీని శాసిస్తోంది. అటు పురుషుల, ఇటు మహిళల విభాగంలో కొరియన్లదే హవా. నెదర్లాండ్స్, అమెరికా, బ్రెజిల్, జర్మనీ, జపాన్, ఇటలీ కూడా పోటీనిస్తాయి. ఇక మహిళల విభాగంలోనూ కొరియాదే హవా. చైనా, మెక్సికో, భారత్, జర్మనీ, అమెరికా, రష్యా కూడా పోటీని ఇస్తాయి. పురుషుల విభాగంలో కిమ్ వూ జిన్, మహిళల విభాగంలో కి బో బీ స్టార్ క్రీడాకారులు. ఈ ఇద్దరూ కొరియా వాళ్లే.
భారత్ నుంచి నలుగురు
ఈసారి రియో ఒలింపిక్స్‌కు భారత్ నుంచి నలుగురు ఆర్చర్లు మాత్రమే అర్హత సాధించారు. పురుషుల వ్యక్తిగత విభాగంలో అతాను దాసు, మహిళల్లో బొంబేలా దేవి, దీపికా కుమారి, లక్ష్మీరాణి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ త్రయం టీమ్ ఈవెంట్‌లో కూడా బరిలోకి దిగుతోంది. ఈ ఏడాది మంచి ఫామ్‌లో ఉన్న దీపికా కుమారికి పతకం వచ్చే అవకాశాలున్నాయి. గతేడాది కోపెన్‌హగన్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన దీపికా.. 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు స్వర్ణాలు చేజిక్కించుకుంది.