చాగలమర్రి రూరల్, న్యూస్‌లైన్: పెనుగాలి, అకాలవర్షం కారణంగా మండలంలోని పలు గ్రామాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆదివారం రాత్రి పెనుగాలితోపాటు ఓ మోస్తరుగా వర్షం కురిసింది. దీంతో ఆయా గ్రామాల పరిధిలో సాగు చేసిన మామిడి, అరటి చెట్లు నేలకొరిగి రైతుకు నష్టం వాటిల్లింది. కోత దశలో ఉన్న పెసర, నువ్వులు, సజ్జ, కోత కోసి పొలాల్లో ఉంచిన పంటలు వర్షం కారణంగా తడిసిపోవడంతో నాణ్యత తగ్గే పరిస్థితి నెలకొంది. వనిపెంట గ్రామ పరిధిలో చిన్న గోపాల్‌కు చెందిన 20 మామిడి చెట్లు నెలకూలిపోయాయి.
అలాగే ముత్యాలపాడు తండాకు చెందిన బాలస్వామి నాయక్, సాలమ్మ, లక్ష్మన్న, వెంకటేశ్వర నాయక్ సాగు చేసిన 20ఎకరాల మామిడితోటలో కాయలతో నిండి ఉన్న 75 చెట్లు కూలిపోయాయి. మిగతా చెట్లపై ఉన్న కాయలు విపరీతంగా రాలిపోయి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఇదే గ్రామానికి చెందిన పెద్దబాలయ్య పొలంలో కోత కోసి ఉంచిన పెసర పంట వర్షం కారణంగా తడిచిపోయింది. అలాగే కొత్తపల్లె, శెట్టివీడు, చిన్నవంగలి తదితర గ్రామాల రైతులకు చెందిన అరటి చెట్లు కూడా కూలిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. పంట నష్టంపై సర్వే చేసి పరిహారం అందజేయాలని రైతులు కోరుతున్నారు.
రైతులకు కడగండ్లు
హొళగుంద:మండలంలో సోమవారం సాయంత్రం సంభవించిన గాలివాన రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. కోత దశలో ఉన్న వరి, మిరప పంటలు నేలపాలయ్యాయి. మామిడి, అరటి చెట్లు కూలిపోవడంతో నష్టపోయామని రైతులు వాపోతున్నారు.
పెనుగాలి బీభత్సం
ఆళ్లగడ్డ రూరల్: ఆళ్లగడ్డ మండలంలోని పలుగ్రామాల్లో అరటి, మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీచెట్లు, విద్యుత్ స్థంబాలు నేలకొరిగాయి. మిట్టపల్లె, యాదవాడ, మర్రిపల్లె, బాచేపల్లె, అహోబిలం తదితర గ్రామాల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
గాలివాన బీభత్సం
Published Tue, Apr 15 2014 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 6:02 AM
Advertisement
Advertisement