
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభించిన తరువాత అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సాధారణంగా అయితే బడ్జెట్ సమావేశాల అనంతరం వర్షాకాల సమావేశాలు, ఆ తరువాత శీతాకాల సమావేశాలు ఉంటాయి. అయితే జీఎస్‌టీ కోసం ఈ ఏడాది మే 16న ఒక రోజు అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం నిర్వహించింది. దీంతో నవంబర్ 16కు ఆరునెలల గడువు ముగిసిపోతుందనే సాంకేతిక అంశాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోంది. ఆలోగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నందున నవంబర్ తొలి వారం లేదా రెండో వారంలో చట్టసభను సమావేశపరచాలనే అభిప్రాయానికి ప్రభుత్వ పెద్దలు వచ్చారు.
నవంబర్ తొలివారంలో ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేపట్టే అవకాశం ఉన్నందున అసెంబ్లీ సమావేశాలకు వచ్చే చాన్స్ లేదని సర్కార్ భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏ సమస్యనైనా ఆధారాలతో సహా ప్రతిపక్ష నేత అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తుండటం ప్రభుత్వ పెద్దలకు మింగుడు పడటం లేదని, ఆయన లేని సమయంలో సమావేశాలు నిర్వహిస్తే తమ పని మరింత సులువు అవుతుందని అధికారపక్షం భావిస్తోందని, ఈ విధానం మంచిదికాదని నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వాధినేత అవినీతిని ప్రతిపక్ష నేత ఎండగడతారనే భయం ప్రభుత్వ పెద్దల్లో ఉందని, అవకాశం ఉన్నంత వరకు అటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చేయడమే ‘ముఖ్య’నేతకు అలవాటని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. కాగా, ఈ నెల 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు దుబాయ్, లండన్, అమెరికా పర్యటనలకు వెళ్తున్నారు. అనంతరం స్పీకర్‌తో కలసి ఇన్‌చార్జి అసెంబ్లీ కార్యదర్శి కామన్‌వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సమావేశాల కోసం విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు.