
8 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
- తొలిరోజు జీఎస్‌టీ బిల్లు ఆమోదం
- మిగిలిన రెండు రోజులు కరువుపై ప్రత్యేక చర్చ
- ఇతర అంశాలు చర్చకు రాకుండా సర్కారు ఎత్తుగడ
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ నెల 8వ తేదీ నుంచి మూడు రోజులపాటు జరగనున్నాయి. తొలిరోజు వస్తు, సేవల బిల్లు(జీఎస్‌టీ)ను ఆమోదిస్తారు. మిగిలిన రెండు రోజులు కరువుపై చర్చిస్తారు. ఇతర అంశాలు చర్చకు రాకుండా ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను మూడు రోజులకే పరిమితం చేసింది. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై శాసనసభ సమావేశాల్లో ప్రత్యేకంగా చర్చించాలని టీడీపీ శాసనసభ పక్షం వ్యూహ కమిటీ సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. 8న జరిగే శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో ప్రభుత్వం తరపున ఇదే ప్రతిపాదన చేయనున్నారు. టీడీఎల్పీ వ్యూహ కమిటీ సమావేశం ఆదివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, రావెల కిషోర్‌బాబు, చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు, విప్‌లు కూన రవికుమార్, యామినీ బాల, ఎమ్మెల్యే వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ టీడీ జనార్దనరావు, టీడీఎల్పీ కార్యాలయ కార్యదర్శి కోనేరు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ జగన్ వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లే యోచన
ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేసుల నుంచి బయట పడేలా మేనేజ్ చేసుకోవడం అలవాటు అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కోర్టును ఆశ్రయించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. పార్టీ ఎమ్మెల్యే లేదా నేతతో న్యాయస్థానంలో కేసు వేయించనున్నారు. సమావేశం అనంతరం విప్ కూన రవికుమార్ విలేకరులతో మాట్లాడారు. జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యలపై కోర్టును ఆశ్రయించనున్నట్లు చెప్పారు. మంత్రులు బొజ్జల, రావెల, చీఫ్ విప్ కాలువ మాట్లాడుతూ... శాసనసభ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించేలా సభ్యులంతా సహకరించాలని కోరారు.