
వచ్చే నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ 14వ శాసనసభ ఎనిమిదో సమావేశాలు సెప్టెంబర్ ఎనిమిదో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కానున్నాయి, హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని అసెంబ్లీ సమావేశ మందిరంలో సమావేశాలు జరుగుతాయి. ప్రారంభానికి సంబంధించి శుక్రవారం శాసనసభ ఇన్‌చార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇటీవల పార్లమెంటు జీఎస్‌టీ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లును మెజారిటీ రాష్ట్రాలు ఆమోదిస్తేనే అమలుచేసేందుకు వీలవుతుంది.
ఈ నేపథ్యంలో సమావేశాలను నిర్వహిస్తున్నారు. పనిలో పనిగా వర్షాకాల సమావేశాలను కూడా పూర్తిచేస్తారు. మూడు రోజుల పాటు మాత్రమే సమావేశాలు జరపాలని ప్రభుత్వం భావిస్తున్నా తొలి రోజున జరిగే శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశాల్లో సభ ఎన్నిరోజులు నిర్వహించేది నిర్ణయిస్తారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సమగ్రంగా చర్చించేందుకు అసెంబ్లీని కనీసం నాలుగు వారాల పాటు నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఇప్పటికే డిమాండ్ చేశారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు కూడా అసెంబ్లీ సమావే శాలను కనీసం మూడు నుంచి నాలుగు వారాలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం, కృష్ణా పుష్కరాలు, రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, దళితులపై దాడులు, ఏపీకి ప్రత్యేక హోదా తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. మండలి సమావేశాలు ఎనిమిదో తేదీ ఉదయం పది గంటలకు పబ్లిక్‌గార్డెన్స్‌లోని సమావేశ మందిరంలో ప్రారంభమవుతాయి. తొలుత సమావేశాలను ఏపీ నూతన రాజధాని ప్రాంతం అమరావ తిలో నిర్వహించాలని భావించారు. అక్కడ ఏర్పాట్లు పూర్తి కాకపోవటంతో హైదరాబాద్‌లోనే నిర్వహించనున్నారు.