గళం విప్పాలి
♦ నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
♦ కరువు, రైతు ఆత్మహత్యలపై చర్చించనున్న జిల్లా ఎమ్మెల్యేలు
♦ ‘అనంత’ను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందంటున్న వైఎస్సార్‌సీపీ
♦ కరువును అన్ని విధాలా ఎదుర్కొంటున్నామంటున్న టీడీపీ
సాక్షిప్రతినిధి, అనంతపురం : రాజధానిలో సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ‘అనంత’ సమస్యలు చర్చకు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా రైతు ఆత్మహత్యలు, కరువు, వలసలు, తాగునీటి సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, చాంద్‌బాషా చర్చకు పట్టుబట్టనున్నారు. రుణమాఫీ అమలులో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఒక్కో రైతు కుటుంబానికి గరిష్టంగా లక్షన్నర రూపాయలు మాత్రమే మాఫీ వర్తింపజేసింది. ఇది కూడా ఐదేళ్ల పాటు ఏడాదికి 20 శాతం చొప్పున మాఫీ చేసింది.
జిల్లాలో 10.24 లక్షల ఖాతాల్లో రూ.6,817 కోట్ల రుణ బకాయిలుంటే ప్రభుత్వం మొదటివిడతలో 6.62 లక్షల ఖాతాలకు రూ.2,234 కోట్లు మాత్రమే మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. రెండు, మూడో విడతలు కలిపినా 8.80 లక్షల ఖాతాల్లో రూ.2,976 కోట్లు మాఫీ కానుంది. ఈ మొత్తంలో ప్రస్తుతం 20 శాతం డబ్బు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీని కారణంగా బ్యాంకుల్లో తాకట్టుపెట్టిన బంగారం విడిపించుకోలేక రైతులు తీవ్ర వేదన పడుతున్నారు. బకాయిలు చెల్లించినా బ్యాంకర్లు ఆ కుటుంబాలకు చెందిన ఇతర రుణాలకు లింకు పెట్టి రైతుల పాసుపుస్తకాలు ఇవ్వకుండా వేధిస్తున్నారు. ఈ కారణంగానే ఉరవకొండలో యువరైతు కోదండరామిరెడ్డి బ్యాంకులోనే పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ అంశాన్ని కూడా ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీలో ప్రస్తావించనుంది.
వలసలపై చర్చ
జిల్లాలో నాలుగు లక్షల మందికిపైగా రైతులు వలసబాట పట్టారు. బెంగళూరు, కేరళ ప్రాంతాలకు వలసపోయి కూలిపని చేసుకుని జీవిస్తున్నారు. ఇంకొందరు భిక్షాటన కూడా చేస్తున్నారు. కదిరి, పెనుకొండ, కళ్యాణదుర్గం, గుత్తి, పుట్టపర్తి, ధర్మవరం నియోజకవర్గాల్లో ఊళ్లకు ఊళ్లు వలసపోయాయి. దీనిపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షం నిలదీయనుంది. కరువు నేపథ్యంలో జిల్లాలో రైతులు, కూలీలకు షరతులు లేకుండా ఉపాధి పనిదినాలు కల్పించాలని డిమాండ్ చేయనుంది. జిల్లాలో భూగర్భజలాలు అడుగంటిపోయి తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. దీని నివారణకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయనుంది.
చర్చను ఎదుర్కొనే ధైర్యం అధికార పక్షానికి లేదు
రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయి. అనంతపురానికి వస్తే కరువు, తాగునీరు, వలస లు, ప్రాజెక్టులు, నిత్యావసర సరుకుల ధర లు.. ఇలా అనేక సమస్యలు వేధిస్తున్నా యి. వీటిపై అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చిం చాల్సి ఉంది. మేము ప్రశ్నలు సంధిస్తే వాటిని ఎదుర్కొనే ధైర్యం అధికారపక్షానికి లేదు. సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అందుకే అసెంబ్లీ సమావేశాలను ఐదురోజులకు కుదించి మొక్కుబడి తంతుగా నిర్వహిస్తున్నారు. జిల్లా సమస్యలతో పాటు ప్రత్యేకహోదాపై కూడా చర్చకు పట్టుబడతాం.
- విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే, ఉరవకొండ
కరువుపై నిలదీస్తా
కదిరి, పుట్టపర్తితో పాటు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వలసలు తీవ్రంగా ఉన్నాయి. నేను గ్రామాల్లో పర్యటించగా ఊళ్లలో జనా లే కన్పించడం లేదు. ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. ఉపాధి లేక కేరళకు వలస వెళ్లారు. అక్కడి చర్చిలు, ఆలయాల వద్ద భిక్షాటన చే సే పరిస్థితి. దీనిపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీ స్తా. కరువు నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా.
- అత్తార్ చాంద్‌బాషా, ఎమ్మెల్యే, కదిరి.
కరువు నివారణకు అన్ని చర్యలు తీసుకున్నాం
కరువు నివారణకు అన్ని చర్యలు సమర్థవంతంగా తీసుకున్నాం. వర్షాలు కురవకపోతే పశుగ్రాసం కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. తాగునీటి సమస్య లేదు. జిల్లాలో రైతులు, ప్రజలను ఆదుకునేందుకు నిధుల సమస్య లేదు. ఎంత ఖర్చయినా జిల్లాకు నిధులు తీసుకొచ్చి సమస్యలు పరిష్కరిస్తాం.
- బీకే పార్థసారథి,టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే, పెనుకొండ