వారం రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్: ఏడు రోజులపాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని శాసనసభా వ్యవహారాల కమిటీ(బిఏసి) సమావేశంలో నిర్ణయించారు. శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన బిఏసి సమావేశం ముగిసింది. శాసనసభలో సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాలన్న వైఎస్ఆర్ సిపి డిమాండ్కు ప్రభుత్వం వ్యతిరేకత ఆ పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు. సమైక్య తీర్మానం డిమాండ్కు సమావేశంలో మద్దతు లభించలేదు. కాంగ్రెస్, టిడిపి నేతలు మౌనం వహించారు.
జాతి వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాతోపాటు దివంగత నేతలకు రేపు అసెంబ్లీలో నివాళులు అర్పిస్తారు.
ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, మంత్రులు శ్రీధర్‌బాబు, ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, ప్రభుత్వచీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. వైఎస్ఆర్ సిపి తరపున వైఎస్ విజయమ్మ, శోభానాగిరెడ్డి, సిపిఎం తరపున జూలకంటి రంగారెడ్డి, ఎంఐఎం తరఫున అక్బరుద్దీన్, సీపీఐ నుంచి గుండా మల్లేష్, బీజేపీ తరఫున లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దూరంగా ఉన్నారు.