
దారి మళ్లిన ‘గౌడ’ బండి
గుంతకల్లు టౌన్ : రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ ‘రైలు’ దారి మళ్లింది. సంస్కరణలకు పెద్దపీట వేస్తామని గొప్పలు చెప్పిన మోడీ సర్కారు.. ఏడాదికి రూ.1100 కోట్ల ఆదాయాన్ని సమకూరుస్తున్న గుంతకల్లు రైల్వే డివిజన్‌పై సవతి ప్రేమ చూపింది. మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్‌లో గుంతకల్లు రైల్వే డివిజన్‌కు ఒక్క కొత్త రైలూ రాలేదు. కొత్త ప్రాజెక్ట్ ఊసూ లేదు. పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి విద్యుదీకరణ పనులు, కొత్త రైలు మార్గాలు, డబ్లింగ్, అండర్ బ్రిడ్జి తదితర అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారే కానీ వాటిని ఎప్పుడు పూర్తి చేస్తారో స్పష్టంగా చెప్పలేకపోయారు. రాష్ట్ర విభజన బిల్లులో రైల్వే జోన్ ఏర్పాటు హామీ ఉన్నా దాని ఊసే ఎత్తలేదు.
కొత్తగా వచ్చే రైల్వే జోన్‌కు సౌత్‌ఈస్ట్ కోస్ట్ జోన్ రైల్వేగా నామకరణం చేయబోతున్నట్లు రైల్వే అధికారిక వర్గాలు తెలిపాయి. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో పాటు వాల్తేరు డివిజన్‌లోని విశాఖపట్నంను కలుపుకుని రైల్వే జోన్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ వస్తుందని భావించినా ఉసూరుమనిపించారు.
కమిటీతో కాలయాపన
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న 29 ప్రాజెక్టులను రానున్న పదేళ్లలో పూర్తి చేసేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు సదానంద ప్రకటించారు. అయితే కమిటీ నివేదిక వచ్చేదెన్నడు? పనులు పూర్తి చేసేదెన్నడు? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గుంతకల్లు రైల్వే డివిజన్‌కు గతంలో మంజూరైన డబ్లింగ్, విద్యుదీకరణ, రైలు మార్గాల ఏర్పాటుకు దాదాపు 4 వేల కోట్ల రూపాయలు అవసరం ఉండగా ప్రభుత్వం ప్రతియేటా అరకొర నిధులు విదిలిస్తోంది. ఫలితంగా పెండింగ్ ప్రాజెక్టులు పడకేస్తున్నాయి.
ప్రతిపాదనలకే పరిమితమా?
గుంతకల్లు డివిజన్‌లో ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలన్న ప్రజల డిమాండ్ మేరకు డివిజన్ స్థాయి రైల్వే అధికారులు రైల్వేమంత్రిత్వ శాఖకు ప్రతి యేటా ప్రతిపాదనలు పంపుతున్నా వాటిని పట్టించుకునే వారు కరువయ్యారు. ఉదయం వేళల్లో పుట్టపర్తి-హైదరాబాద్‌తో పాటు తిరుపతి-షిర్డీ, పుట్టపర్తి-షిర్డీ రైళ్లను ఏర్పాటు చేయాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్ ఉంది. పెండేకల్లు బైపాస్, గుత్తి మీదుగా వెళ్తున్న కాచిగూడ-చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్, తుంగభ ద్ర ఎక్స్‌ప్రెస్, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైళ్లను గుంతకల్లు మీదుగా నడపాలన్న డిమాండ్ ఉంది.
నవ్యాంధ్రప్రదేశ్ రాష్ర్ట రాజధాని గుంటూరు లేదా విజయవాడల మధ్య ఏర్పాటు చేస్తారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రశాంతి, అమరావతి, రెండు ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఉన్నాయని, భవిష్యత్తులో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అదనంగా రైళ్లు ఏర్పాటుకు గౌడ బడ్జెట్ గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందేమోనని భావించినా నిరాశే ఎదురయ్యింది.
ఆశాజనకంగా లేదు
రైల్వే బడ్జెట్ వల్ల అటు ప్రయాణికులు, ఇటు రైల్వే కార్మిక వర్గాలకు ఎటువంటి ప్రయోజనం లేదు. డివిజన్ మీదుగా కనీసం ఒక్క కొత్త రైలు కానీ, కొత్త ప్రాజెక్టు గానీ మంజూరు చేయకపోవడం అన్యాయం. అందరూ ఆశించినట్లు గుంతకల్లు రైల్వే జోన్ గురించి ప్రస్తావించకపోవడం మన ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడమే. కనీసం పెండేకల్లు బైపాస్ మీదుగా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లను గుంతకల్లు మీదుగా నడిపేందుకు గ్రీన్‌సిగ్నల్ కూడా ఇవ్వలేదు.
- కళాధర్, మజ్దూర్ యూనియన్ డివిజన్ కార్యదర్శి
కొత్త రైళ్లు, ప్రాజెక్టుల ఊసెత్తకపోవడం భాధాకరం
రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో కొత్త రైళ్లు, పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడం భాధాకరం. రైల్వే ఉద్యోగుల స్టాఫ్ బెనిఫిట్ ఫండ్‌ను రూ.500 నుండి 800 వరకు పెంచుతామని, రైల్వే కార్మికుల పిల్లల కోసం కాలేజిలు, ఒక విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడం ఉద్యోగ వర్గాలకు కొంత ఊరట కలిగించిందే. అది మినహాయించి డివిజన్‌కు ఒరిగిందేమీ లేదు.
- శ్రీనివాసులు, ఎంప్లాయిస్ సంఘ్ డివిజన్ కార్యదర్శి
గుంతకల్లు రైల్వేస్టేషన్‌ను మోడల్ రైల్వేస్టేషన్‌గా నిర్మిస్తామని రూ.6 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు నిర్వహించారు. అయితే ఇప్పటి వరకు కేవలం రూ.2 కోట్లు మాత్రమే నిధులు విడుదల చేయడంతో నిర్మాణ పనులు పునాదులకే పరిమితం అయ్యాయి.
ట్రాక్షన్ షెడ్ నిర్మాణానికి రూ.80 కోట్లు అవసరముండగా ఇప్పటి వరకు కేవలం రూ.15 కోట్లు మాత్రమే విడుదల చేసినట్లు సంబంధిత అధికారుల ద్వారా తెలిసింది. గుంటూరు-గుంతకల్లు, డోన్-ధర్మవరం వయా గుత్తి, గుంతకల్లు-హొస్పేట డబ్లింగ్ పనులు, కడప-బెంగుళూరు, నడికుడి-శ్రీకాళహస్తి, కదిరి-పుట్టపర్తి మధ్య రైల్వేలైన్ ఏర్పాటు కోసం మంజూరైన నిధుల్లో అరకొర విడుదల చేయడంతో ఇప్పటివరకు పనులను ప్రారంభించలేదు.
శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనానికై నిత్యం లక్షలాది మంది భక్తాదులతో రద్దీగా ఉండే తిరుపతి రైల్వేస్టేషన్‌ను వరల్డ్‌క్లాస్ ఆదర్శ రైల్వేస్టేషన్‌గా తీర్చిదిద్దుతామని గతంలో చేసిన వాగ్దానాలన్నీ బుట్టదాఖలయ్యాయి. ప్రయాణికుల రద్దీ, రైళ్ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆ దిశగా ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు.