
టీచర్లకు కనీసం రూ. 24,810 చెల్లించాలి
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులకు కనీస వేతనంగా రూ. 24,810 చెల్లించాలని పదో వేతన సవరణ సంఘం(పీఆర్‌సీ) కమిషనర్ అగర్వాల్‌కు యూటీఎఫ్ ప్రతిపాదించింది. సచివాలయంలో కమిషనర్‌ను యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నర్సిరెడ్డి, వెంకటేశ్వర్‌రావు గురువారం కలిసి ప్రతిపాదనలను అందజేశారు. ఉన్నత పాఠశాలలకు అసిస్టెంట్ హెడ్మాస్టర్ పోస్టులను, మండలాలకు అసిస్టెంట్ ఎంఈఓ పోస్టులను ఇవ్వాలని కోరారు. ప్రధానోపాధ్యాయులతో సమానంగా ఎంఈఓలకు పేస్కేలు చెల్లింపు, గ్రాట్యుటీ రూ. 15 లక్షలకు పెంచాలన్నారు. ఫిట్‌మెంట్ బెనిఫిట్ 60 శాతం ఇవ్వాలని ప్రతిపాదించారు. ఉపాధ్యాయుల స్కేళ్లు నాలుగు రకాలుగా అమలు చేయాలని సూచించారు. ఎస్‌జీటీలకు కనీస వేతనం రూ. 24,810, స్కూల్ అసిస్టెంట్లకు రూ. 33,480, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు రూ. 35,880, అసిస్టెంట్ ఎంఈఓలకు, హై స్కూల్ హెడ్‌మాస్టర్లకు రూ. 35,880 కనీస వేతనాన్ని సిఫారసు చేయాలని కోరారు.
వేతనంతో కూడిన సెలవులివ్వాలి: పీఆర్‌టీయూ-టి
కుటుంబ సభ్యుల కర్మకాండలు 11 రోజుల పాటు నిర్వహించే ఉద్యోగ, ఉపాధ్యాయులకు అన్ని రోజులూ వేతనంతో కూడిన సెలవులను ఇచ్చేలా సిఫారసు చేయాలని పదో పీఆర్‌సీ కమిషనర్ అగర్వాల్‌కు తెలంగాణ పీఆర్‌టీయూ విజ్ఞప్తి చేసింది. ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, పీఆర్‌టీయూ-తెలంగాణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.హర్షవర్ధన్‌రెడ్డి, వేణుగోపాలస్వామి తదితరులు పీఆర్‌సీ కమిషనర్‌కు ప్రతిపాదనలు సమర్పించారు. కుటుంబీకులు చనిపోయినప్పుడు కర్మకాండలు చేసే వారు 11 రోజులపాటు బయటకు వెళ్లే పరిస్థితి లేనందున వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని సూచించారు. అలాగే ఆర్జిత సెలవులను 20 పెంచాలని విజ్ఞప్తి చేశారు.
2013 జూన్ నుంచే అమలు చేయాలి: ఏపీటీఎఫ్
పదో పీఆర్‌సీ సిఫారసు చేసే నూతన వేతన సవరణ ఆర్థిక లబ్ధిని 2013 జూన్ నుంచే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని పీఆర్‌సీ కమిషనర్‌కు ఏపీటీఎఫ్ విజ్ఞప్తి చేసింది. ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రఘురామిరెడ్డి, పాండురంగవరప్రసాద్ తదితరులు ఈమేరకు పీఆర్‌సీ కమిషనర్‌కు ప్రతిపాదనలను అందజేశారు. ఇంక్రిమెంట్ రేటు 3 శాతం ఉండాలని కోరారు. ఇంటి అద్దె అలవెన్సు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణాల్లో 40 శాతం చెల్లించాలన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా కేంద్రాల్లో 30 శాతం ఇవ్వాలని కోరారు. 14.5 శాతం చెల్లిస్తున్న పట్టణాల్లో 25 శాతం మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని విజప్తి చేశారు. ఇతర గ్రామాలు, పట్టణాల్లో 20 శాతం ఇచ్చేలా సిఫారసు చేయాలన్నారు.