వారంతా రోజువారీ కూలీలు. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబాలది. చలి వణికిస్తున్నా వేకువజామునే నిద్రలేచారు. పొయ్యి రాజేసి వంట చేశారు. పనులన్నీ చక్కబెట్టుకుని.. క్యారేజీల్లో నాలుగు ముద్దలు సర్దుకుని సిరామిక్ ఫ్యాక్టరీలో పనికి బయలుదేరారు. ఎప్పటిలానే ఉదయం 7 గంటలకు హుషారుగా ఆటో ఎక్కారు. కష్టసుఖాలను మాట్లాడుకుంటూ వెళుతున్నారు. ఇంతలోనే ట్రాక్టర్ రూపంలో వచ్చిన మృత్యువు వారిలో ముగ్గుర్ని కబళించింది. ఆ కుటుంబాల్లో విషాదాన్ని రగిల్చింది.
కైకరం(ఉంగుటూరు)/భీమడోలు, న్యూస్‌లైన్ :ఉంగుటూరు మండలం కైకరం వద్ద జాతీయ రహదారిపై ఆటోను ట్రాక్టర్ ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృత్యువాతపడ్డారు. మరో ఏడుగురు గాయూల పాలయ్యూరు. వివరాల్లోకి వెళితే.. భీమడోలు బీసీ కాలనీకి చెందిన 10 మంది కూలీలు సోమవారం ఉదయం ఉంగుటూరు మండలం నారాయణపురంలోని సిరామిక్ ఫ్యాక్టరీలో పనిచేసేందుకు ఆటోలో బయలుదేరారు. కైకరం వద్ద ఓ ట్రాక్టర్ సమీపంలోని పొలం నుంచి ధాన్యం తీసుకొచ్చేందుకు రాంగ్‌రూట్‌లో వెళుతూ ఆటోను ఢీకొట్టింది.
దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న డేకర వరలక్ష్మి (48), కడగపు అప్పలనర్సమ్మ (38) అక్కడిక్కడే మృతి చెందారు. దూబ ముత్యాలు (25) అనే మహిళ ఏలూరులోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. అదే ఆటో ఉన్న కూలీలు కడగపు భారతి, కెంబూరి వెంకట రమణ, కెంబూరి దేవి, కొల్లి శ్యామల, దూబ లక్ష్మికి గాయాలు కాగా హైవే అంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి, చెంబూరి పార్వతిని 108 వాహనంలో తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్వల్పగాయాలైన నెరుసు శిరీష ఇంటికి వెళ్లిపోయింది. ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు కాగా రహదారి నెత్తిరోడింది. ఆటో డ్రైవర్ గుబ్బల శ్రీను, ప్రమాదానికి కారకుడైన ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యారు.
మిన్నంటిన ఆర్తనాదాలు
ట్రాక్టర్ ఢీకొట్టడంతో గాయాలపాలైన కూలీల అరుపులు మిన్నంటాయి. జాతీయ రహదారిపై వెళుతున్న వాహన చోదకులు, ప్రయాణికులు హడలిపోయారు. ఘటనాస్థలంలో చెల్లాచెదురుగా పడి ఉన్న మాంసం ముద్దలను చూసి చలించిపోయారు. క్షతగాత్రులను ఆటోలోంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న మృతుల కుటుంబసభ్యులు భీమడోలు నుంచి ఘటనా స్థలానికి చేరుకున్నారు. డేకర వరలక్ష్మి కుమారుడు అప్పారావు గుండె లు బాదుకుంటూ విలపించారు. చేబ్రోలు ఎస్సై వి.వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
రాంగ్‌రూట్‌లో వెళ్లడం మామూలే
కైకరంలో వాహనాలు రాంగ్ రూట్‌లో వెళ్లడం వలన తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రైతులు తమ పొలాలకు వె ళ్లాలంటే కిలోమీటరు మేర ప్రయూణించి జంక్షన్ దాటాలి. అంతదూరం వెళ్లడం ఇష్టంలేక వాహనాలు రాంగ్‌రూట్‌లో వెళుతూ ఉంటాయి.
కన్నీరుమున్నీరైన బీసీ కాలనీ
భీమడోలు బీసీ కాలనీలో వేర్వేరు వీధులకు చెందిన మృతులంతా పేద కుటుంబాలకు చెందిన వారే. పొట్టచేత పట్టుకుని ప్రతిరోజూ కూలికి వెళ్లగా వచ్చిన సొమ్ములతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. రవాణా ఖర్చులు పోను రోజుకు రూ.220 చొప్పున సంపాదిస్తున్నారు. కాలనీకి చెందిన ముగ్గురు మరణించిన విషయం తెలిసి కాలనీవాసులంతా కన్నీరుమున్నీరయ్యారు. కార్తీక సోమవారం కావడంతో తాము పనులకు వెళ్లలేదని.. రోజూ వీరితో పాటే వెళ్లేవారమని పలువురు మహిళలు అన్నారు.
‘పప్పలెప్పుడు తెస్తావమ్మా’
‘సాయంత్రం పనినుంచి వచ్చేటప్పుడు పప్పలు తెస్తానన్నావు.. ఇప్పుడు మాట్లాడవేంటమ్మా’ అంటూ దూబ ముత్యాలు మృతదేహం వద్ద కుమార్తె దివ్య, కుమారుడు విజయ్‌కుమార్ బోరున విలపించారు. వీరి రోదనలు చూపరులకు కంటతడి తెప్పించాయి. ‘నేను బతికుండగానే నీవు దేవుడు దగ్గరకు వెళ్లిపోయావా.. తల్లీ’ అంటూ మృతురాలు తండ్రి రోదించిన తీరు హృదయూలను ద్రవింపచేసింది. ముత్యాలు పిల్లలిద్దరూ స్థానిక ఎలిమెంటరీ పాఠశాలలో చదువుకుంటున్నారు.
అమ్మలా సాకింది’
వరలక్ష్మి తనను అత్తలా కాకుండా అమ్మలా సాకిందని.. ఇప్పుడు ఇలా తమ నుంచి దూరమైం దంటూ కోడలు లక్ష్మి బోరున విలపించింది. భర్త రామకృష్ణ అనారోగ్యంతో బాధ పడుతుండటంతో మూడు నెలలుగా వరలక్ష్మి కూలికి వెళుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
తలలో నాలుకలా..
కడగర అప్పలనరసమ్మకు ఇద్దరు కుమారులు. భర్త మృతిచెందడంతో తానే కుటుంబాన్ని పోషిస్తోంది. కూలి పనులకు వెళ్లడంతో పాటు మేస్త్రిగా వ్యవహరిస్తోంది. అందరితో కలిసిమెలసి ఉంటూ నలుగురికీ సాయం చేసేదని కాలనీవాసులు చెప్పారు. అప్పలనరసమ్మ మృతితో కుమారులు అనాథలుగా మిగిలారు.
బతుకులు తెల్లారిపోయూయి
Published Tue, Nov 19 2013 2:58 AM | Last Updated on Sat, Mar 9 2019 4:28 PM
Advertisement
Advertisement