ఇంటర్ విద్యార్థిపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసి రెండు తులాల బంగారు గొలుసును అపహరించుపోయారు.
కీసర, న్యూస్‌లైన్: ఇంటర్ విద్యార్థిపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసి రెండు తులాల బంగారు గొలుసును అపహరించుపోయారు. ఈ సంఘటన శుక్రవారం మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన సుబ్బారావు కొన్నేళ్ల క్రితం కుటుంబంతో కీసర మండల తిమ్మాయిపల్లి గ్రామానికి వలస వచ్చాడు. గ్రామ సమీపంలోని క్రషర్ మిషన్ వద్ద హోటల్‌ను నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈయన కుమారుడు శ్రీనివాస్ నగరంలో ఇంటర్ చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో శ్రీనివాస్(21) హోటల్ సమీపంలోంచి రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. పల్సర్ బైకుపై ముగ్గురు వ్యక్తులు వచ్చారు. వారి ముఖాలకు మాస్క్‌లు ఉన్నాయి.
శామీర్‌పేటకు ఎలా వెళ్లాలి..? అని శ్రీనివాస్‌ను అడిగారు. అంతలోనే బైకు పైనుంచి దిగిన ఇద్దరు అతడి ముఖంపై తీవ్రంగా దాడి చేశారు. శ్రీనివాస్‌ను కత్తితో బెదిరించి మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. షాక్‌కు గురైన విద్యార్థి కొద్దిసేపటి తర్వాత కోలుకొని విషయాన్ని తన తండ్రికి తెలిపాడు. శ్రీనివాస్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.