అత్తారింటికి.. దారి కనుక్కున్న పోలీసులు | 'Attarintiki Daredi' Piracy case Busted | Sakshi
Sakshi News home page

అత్తారింటికి.. దారి కనుక్కున్న పోలీసులు

Published Wed, Sep 25 2013 5:32 PM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

అత్తారింటికి.. దారి కనుక్కున్న పోలీసులు - Sakshi

అత్తారింటికి.. దారి కనుక్కున్న పోలీసులు

విజయవాడ: 'అత్తారింటికి దారేది’ సినిమా పైరసీ కేసుకు సంబంధించి కృష్ణా జిల్లా పోలీసులు అయిదుగురిని అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా ఎస్పి ప్రభాకర రావు వారిని  విలేకరుల ముందు హాజరుపరిచారు. పది సంవత్సరాల నుంచి సినిమా ప్రొడక్షన్ విభాగంలో ప్రొడక్షన్ అసిస్టెంట్గా పని చేస్తున్న చీకటి అరుణ్ కుమార్ సూత్రదారిగా తేలింది. డివిడిలు ఇతరులకు చేరడానికి ప్రధాన కారకులు ఎపిఎస్పి కానిస్టేబుళ్లుగా గుర్తించారు. ఈ సినిమా విడుదల కాకముందే సిడిలు విడుదలయిన విషయం తెలిసిందే.

ఎస్పి చెప్పిన కథనం ప్రకారం  అరుణ్ కుమార్  'అత్తారింటికి దారేది’ చిత్రంకు ఎడిటింగ్ అసిస్టెంట్గా పని చేస్తున్నాడు.  ఆ సినిమా ఫైల్ ఉంచిన కంప్యూటర్ పాస్వర్డ్ కూడా ఇతని దగ్గర ఉంటుంది. దాంతో అతను రెండు డివిడిలలో ఆ చిత్రాన్ని కాపీ చేశాడు.  ఆ రెండు డివిడిలను చూడటానికి మిత్రులకు ఇచ్చాడు. సినిమా చూసిన తరువాత సివిడిని విరగగొట్టమని వారికి చెప్పాడు.

మిత్రులు ఆ డివిడిలను విరగొట్టకుండా ఇతరులకు ఇచ్చారు. ఈ డివిడిలు  ప్రసన్న కుమార్ అనే కానిస్టేబుల్ నుంచి  అనూక్ అనే కానిస్టేబుల్ వద్దకు చేరాయి. అతని వద్ద నుంచి ఎపిఎస్పి పోలీస్ కానిస్టేబుల్ కట్టా రవి కుమార్ ఎలియాస్ రవి   వద్దకు చేరాయి. అతను  వాటిని  ఈ నెల 14న కొరియర్లో ద్వారా  పెడనుకు పంపాడు. అవి పెడనులోని  ఊటుకూరు సుధీర్ కుమార్ తీసుకున్నారు. అతని దగ్గర నుంచి వీరంకి సురేష్ కుమార్ వద్దకు, ఆ తరువాత  దేవి మోబైల్ సెల్ రిపేర్ షాపు యజమాని కొల్లిపర అనీల్ కుమార్ వద్దకు చేరాయి. అక్కడ నుంచి మార్కెట్లో వచ్చేశాయి.

నిర్మాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పెడన, మచిలీపట్నంలలో దాడులు  చేసి సిడిలను స్వాధీనం చేసుకున్నారు. ఐటి, కాపీరైట్ చట్టం, చీటింగ్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. బందరు సిఐ పల్లంరాజు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పి తెలిపారు.

కోట్ల రూపాయలు వెచ్చించి తీసిన ఈ సినిమా పైరసీ సీడీని 50 రూపాయలకే అమ్మకాలు సాగించిన తీరుపై సోమవారం పెడన, బందరులో దాడులు చేసి పలు ఇంటర్నెట్, సెల్‌పాయింట్లు నుంచి కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లు, మెమొరీ కార్డులను స్వాధీనం చేసుకున్న  విషయం విదితమే. మంగళవారం సుమారు 30 మందిని విచారించారు. వారిలో 12 మందిని అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు అయిదుగురిని అరెస్ట్ చేశారు.

 ఈ సినిమా  పైరసీ సీడీలు పెడనలో దొరుకుతున్నాయని, ఒక టీవీ చానల్‌కు  అజ్ఞాత వ్యక్తి చేసిన ఫోన్‌కాల్‌తో కలకలం రేగింది. చిత్ర నిర్మాత రెండు  హైదరాబాద్‌లో డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ జె.ప్రభాకరరావు ఆదేశాలతో డీఎస్పీ కేవీ శ్రీనివాస్ నేతృత్వంలో పోలీస్ ప్రత్యేక బృందాలు పెడన, మచిలీపట్నంలోని పలు మొబైల్, కంప్యూటర్, ఇంటర్నెట్ సెంటర్లు, సీడీ షాపులపై  దాడులు చేశారు.  ఈ సంగతి తెలుసుకున్న పవన్ కల్యాణ్, చిరంజీవి అభిమానులు పెద్ద ఎత్తున మొబైల్ షాపులు, ఇంటర్నెట్ సెంటర్ల వద్ద గుమిగూడారు.

 ఓ చానల్ ప్రతినిధులు  ఎస్పీ ప్రభాకరరావుకు సీడీని అందజేశారు. ఆయన ఆదేశంతో బందరు డీఎస్సీ డాక్టర్ కేవీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఐ పల్లంరాజు పలువురు ఎస్సైలు  మొబైల్ షాపులను తనిఖీ చేశారు. తొలుత దేవీ మొబైల్స్ షాపును పరిశీలించగా అక్కడేమి దొరకలేదు. దీంతో సీఐ పల్లంరాజు పెడన, మచిలీపట్నంలోని పలు మొబైల్, ఇంటర్నెట్ కంప్యూటర్ షాపులను తనిఖీ చేసి షాపుల్లో ఉన్న వాటిని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement