సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని హత్య చేయడానికి జరిగిన ప్రయత్నానికి సంబంధించి సాగుతున్న దర్యాప్తు తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. జరిగిన సంఘటన, దాని పూర్వాపరాలు, పరిణామ క్రమాన్ని లోతుగా విశ్లేషిస్తే తెరవెనుక పెద్ద కుట్రే జరిగిందనడానికి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. సంఘటనపై ముఖ్యమంత్రి, మంత్రులు, డీజీపీ స్పందించిన తీరు అనుమానాలు రేకెత్తించగా, గత రెండురోజులుగా జరుగుతున్న పరిణామాలు వారి మాటల ప్రభావం దర్యాప్తుపై పడినట్టు స్పష్టమవుతోంది. ఏదైనా చిన్న సంఘటన (నేరం) జరిగినప్పుడు దానిపై పోలీసులు దర్యాప్తు చేయడానికి అనేక అంశాలను నిశితంగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ధారణకు రావడం సహజం. అలా నిర్ధారణకు వచ్చిన తర్వాతే ఆ ఘటనకు సంబంధించిన పూర్వాపరాలను వెల్లడిస్తారు. కీలకమైన లేదా సున్నితమైన కేసుల్లో ఒక్కోసారి ఆధారాలు తారుమారవుతాయని లేదా దర్యాప్తు ప్రభావితమవుతుందన్న కారణంగా చార్జీషీట్ దాఖలు చేసేంతవరకు వివరాలు వెల్లడించరు. కానీ జగన్‌పై హత్యాయత్నం జరిగిన గంట నుంచే పరిణామాలు శరవేగంగా మారాయి.
అత్యంత కీలకమైన ఈ కేసులో దర్యాప్తు జరపాల్సిన అనేక కోణాలను అధికారులు విస్మరించడం గమనార్హం. దర్యాప్తు కోణాలను వదిలిపెట్టడమే కాకుండా కీలకమైన ఆధారాలు సేకరించే విషయంలో జరుగుతున్న జాప్యం కూడా కావాలనే చేస్తున్నట్టు కనబడుతోంది. ఈ కేసులో కిందిస్థాయిలో దర్యాప్తును తీవ్ర ప్రభావం చేసే రీతిలో ముఖ్యమంత్రి, మంత్రులు, రాష్ట్ర డీజీపీ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో న్యాయం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టును ఆశ్రయించిన తర్వాత పోలీసులు కొంత హడావిడి చేయడం ప్రారంభించినట్టు కూడా కనబడుతోంది.
ఎయిర్‌పోర్ట్‌లోని వీఐపీ లాంజ్ సమీపంలోని ఫ్యూజన్ ఫుడ్స్
హోటల్‌లో ఎందుకు తనిఖీ చేయలేదు?
హైదరాబాద్‌లో శుక్రవారం కోర్టుకు హాజరుకావడానికి జగన్ మోహన్ రెడ్డి బయలుదేరినప్పుడు విశాఖ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. దాడి చేసిన వ్యక్తి ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్ హోటల్‌లో పనిచేస్తాడని తెలుసు. అలాంటప్పుడు దాడి జరిగిన వెంటనే అధికారులు సదరు హోటల్‌లో అనువణువూ శోధించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే.. నిందితుడు ఇంకా ఏమైనా ఆయుధాలు సేకరించాడా? తన పథకాన్ని అమలు చేయడానికి హోటల్‌ను ఏ విధంగా వాడుకున్నాడు? లేదా హోటల్‌లో మిగతా వారెవరైనా దీనికి సహకరించారా? సేకరించిన ఆయుధాలను హోటల్‌లో ఎక్కడ భద్రపరిచాడు? అసలు మొత్తంగా ఎన్ని ఆయుధాలు సమకూర్చుకున్నాడు? హోటల్‌లో రోజూవారి చర్యలేంటి? ఇతర పనివాళ్లతో ఎలా ఉంటాడు? తరుచూ హోటల్‌కు ఎవరెవరు వచ్చేవాళ్లు? ఎవరెవరితో సన్నిహితంగా మెదిలేవాడు? జగన్ ఎయిర్‌పోర్టులో ప్రవేశించడానికి ముందు దాడి చేసిన వ్యక్తి ఎక్కడున్నాడు? ఇలాంటి ఎన్నో అంశాలను దర్యాప్తు అధికారులు పరిగణలోకి తీసుకోవాలి. కీలకమైన కేసుల్లో ఇలాంటి కోణంలో దర్యాప్తు మరింత లోతుగా సాగితే తప్ప నిజాలు బయటకు రావు. అలా జరగాలంటే అవసరమైతే కొంతకాలం వరకు హోటల్‌ను సీజ్ చేయాలి. లేదా ఇతరులెవరూ ప్రవేశించకుండా తమ ఆధీనంలోకి తీసుకుని ముమ్మర తనిఖీలు నిర్వహించాలి? కానీ రిమాండ్ రిపోర్టు పరిశీలిస్తే దర్యాప్తు అధికారులు వీటన్నింటినీ పట్టించుకోలేదని స్పష్టమవుతుంది. కీలకమైన ఇలాంటి అంశాలను ఎవరి కోసం, ఎందుకోసం వదిలిపెట్టినట్టు?
రెస్టారెంట్ యజమానిని ఎందుకు వదిలేశారు?
కీలకమైన కేసుల్లో నిజాలు కక్కించడానికి పోలీసులు ఎన్నెన్ని మార్గాలు అనుసరిస్తారో అందరికీ తెలిసిందే. ఈ కేసులో కూడా అత్యంత కీలకం రెస్టారెంట్ యజమాని. ఎందుకంటే, విమానాశ్రయమంటే దేశ భద్రతకు సంబంధించిన అంశాలు అనేకం ముడిపడి ఉండటమే కాకుండా వీవీఐపీలు పర్యటించే అత్యంత కీలకమైన ప్రాంతం. అలాంటి చోట వ్యాపారం కొనసాగిస్తున్నందున ఆ వ్యక్తిని తక్షణం విచారించాల్సిన అవసరం ఉంటుంది. దేశ ప్రధానమంత్రి, రక్షణమంత్రి మరెవరైనా విశాఖ రావాలన్నా అదే విమానాశ్రయంలో దిగాల్సిందే. అలాంటి కీలకమైన ప్రాంతంలో నడుస్తున్న హోటల్‌లో పనిచేస్తున్న వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడినప్పుడు పోలీసులు యజమానిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించకుండా ఎందుకు వదిలిపెట్టినట్టు? వైఎస్సార్ కాంగ్రెస్ నేతలతో పాటు ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెళ్లువెత్తిన తర్వాత యజమానిని అది కూడా రెండ్రోజుల తర్వాత చుట్టపుచూపుగా పోలీస్ స్టేషన్‌కు ఆహ్వానించి తూతూ మంత్రంగా స్టేట్‌మెంట్ రికార్టు చేస్తారా? అది కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత మాత్రమే పిలవడంలోని మతలబేంటి? హోటల్‌ను తనిఖీ చేయకపోగా, యజమానిని కూడా అంత సులభంగా ఎందుకు వదిలిపెట్టినట్టు?
ఆరోజు ఎక్కడున్నారు?
విమానాశ్రయంలోని ఫ్యూజన్ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ టీడీపీకి చెందిన వ్యక్తి అని తెలిసిందే. అయితే ఇంతటి తీవ్రమైన ఘటన జరిగినప్పుడు దర్యాప్తులో భాగంగా హోటల్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు యజమానిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తారు. ఆ పని ఎందుకు చేయలేదు? దాడికి పాల్పడిన వ్యక్తికి సంబంధించి అనేక విషయాలు యజమానికే ఎక్కువగా తెలుస్తాయి. ఎందుకంటే ఆ వ్యక్తిని పనిలో పెట్టుకున్నది ఆ యజమానే కాబట్టి. అయితే, ఆ వ్యక్తి ముఖ్యమంత్రికి సన్నిహితుడు కావడం, విమానాశ్రయంకు వచ్చే టీడీపీ ప్రముఖులకు చాలా మందికి అక్కడ సపర్యలు జరుగుతుండటంతో పాటు ఘటన అనంతరం ముఖ్యమంత్రి, డీజీపీ చేసిన వ్యాఖ్యలే యజమానిని అదుపులోకి తీసుకోకపోవడానికి కారణంగా భావించాల్సి వస్తోంది. హోటల్ యజమాని ఆరోజు ఎక్కడున్నారు? ఎప్పుడెప్పుడు వస్తుంటారు? వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు? దాడికి పాల్పడిన వ్యక్తిని ఎక్కడ పరిచయం? ఎలా పరిచయం? ఈ రకంగా ఎన్నో శోధిస్తే తప్ప కొన్ని నిజాలు బయటకు రావు. కానీ ఆ కోణంలో దర్యాప్తు సాగలేదన్నది రిమాండ్ రిపోర్టును బట్టి తెలుస్తోంది.
ఎయిర్‌పోర్టు ఎంట్రీ వద్ద ఏం నమోదైంది?
విమానాశ్రయం అంతటా సీసీ కెమెరాలున్నాయి. ఎయిర్‌పోర్టులో ప్రవేశించే ప్రధాన ద్వారం నుంచి సెక్యూరిటీ చెక్ ప్రాంతంతో పాటు అంతటా సీసీ కెమెరాలు ఉన్నప్పుడు గడిచిన కొద్ది రోజులుగా నిందితుడి కదలికలకు సంబంధించి సీసీ ఫుటేజీని ఎందుకు పరిశీలించలేదు? సీసీ ఫుటేజీ ఉన్నట్టుగా ఎందుకు ప్రకటించడం లేదు? కేసుకు సంబంధించి ఎన్ని కోణాల్లో వీలైతే అన్ని కోణాల్లో శోధించి నిజాలు వెలికి తీయడానికి అత్యంత కీలకంగా సీసీ ఫుటేజీ ఉపయోగపడుతుంది. సీసీ ఫుటేజీ విషయంలో ఎందుకు దోబూచులాట. ఇంత జాప్యం చేసిన తర్వాత సీసీ ఫుటేజీ ఉంటుందన్న గ్యారెంటీ ఏంటి? జాప్యం చేసినందువల్ల పుటేజీ ఆధారాలు తారుమారు కావన్న గ్యారంటీ ఏంటి?
సంఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేవనీ, దాడికి పాల్పడిన వ్యక్తి సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి కంట బడకుండా విమానాశ్రయంలో తిరుగుతున్నాడని కూడా పోలీసులు చెబుతున్నారంటే... ఇంతకన్నా ఘోరమేమైనా ఉంటుందా? దీన్ని బట్టి విమానాశ్రయం అనువణువూ ఆ వ్యక్తికి తెలిసినట్టే భావించాలి. లేదంటే ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతుందా? నిజానికి విమానాశ్రయంలోని ఎస్టాబ్లిష్‌మెంట్స్‌లో పనిచేసే సిబ్బంది ప్రతి ఒక్కరినీ తనిఖీ చేయకుండా లోనికి వదలరన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది ఈ నిందితుడిని ఎందుకు తనిఖీ చేయలేదు? చేసి ఉంటే కత్తులు లోనికి ఎలా వెళ్తాయి? నిజానికి ఆ కత్తులను నిందితుడే లోనికి తీసుకెళ్లాడా? లేక వేరెవరైనా సమకూర్చారా? లోనికి చేరవేయడానికి మరెవరైనా సహకరించారా? అన్న అనుమానంపై పోలీసులు దర్యాప్తు చేయకపోవడానికి కారణాలేంటి? పోలీసులు చెబుతున్న దాన్ని బట్టి దాడికి పాల్పడిన వ్యక్తి ఒక రోజు ముందు మాత్రమే ఆ ఆయుధాలను తెచ్చాడని చెబుతున్నారు. అలా అని ఏ రకంగా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు? ఆ వ్యక్తి చెప్పిందే వేదంగా భావించడంలోని ఆంతర్యమేంటి? ఇతర మార్గాలతో నిర్ధారణకు రావలసిన అవసరం లేదా?
లేఖల లోతుల్లోకి ఎందుకు వెళ్లడం లేదు?
హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత పరస్పర విరుద్ధమైన ప్రకటనలు ఎందుకు వెలువడ్డాయి. మొదట పందెం కోళ్లకు వాడే కత్తిని స్వాధీనం చేసుకుని సిబ్బంది లేఖ విషయాన్ని గానీ రెండో ఆయుధం కత్తి ఉన్నట్టు గానీ తొలుత చెప్పలేదు. డీజీపీ స్పందించిన అనంతరం ఒక్కసారిగా లేఖ అంశం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ వ్యక్తి వద్ద స్వాధీనం చేసుకున్నట్టు చెబుతున్న లేఖలో ఉన్న చేతిరాత ఒకతీరుగా లేదని మీడియా బయటపెట్టిన తర్వాత... నిజమే చేతిరాత వేర్వేరుగా ఉందని మరుసటి రోజు నిర్ధారించడంలోని ఆంతర్యమేంటి? చేతిరాత వేర్వేరుగా ఉన్నప్పుడు పేపర్ (కాగితం) వేర్వేరుగా ఉందా? వేర్వేరు పెన్నులు (సిరా) వాడినట్టు తేలిందా? లేఖలో పేర్కొన్న అంశాలు ఆ వ్యక్తి స్వయంగా డిక్టేట్ చేశాడా? డబ్బులు లేక ఇంటర్‌మీడియట్ తొలి సంవత్సరంలోనే విద్యను ఆపేసిన వ్యక్తి లేఖలు రాయలేక వేరే వాళ్లతో రాయించాడా? ఆ వ్యక్తి డిక్టేట్ చేస్తుంటే రాశారా? అందులో పేర్కొన్న అంశాలను తిరిగి చెప్పగలడా? ఒక కీలకమైన కేసులో నిజానిజాలు వెల్లడి కావాలంటే ఇలాంటి అంశాలు ఎంతో కీలకంగా మారుతాయి. కానీ దర్యాప్తు అధికారులు ఎందుకో వాటిని పట్టించుకోలేదు.
సమాధానాలు దొరకని రిమాండ్ రిపోర్ట్
ఇలాంటి సున్నితమైన కేసుల్లో స్వాధీనం చేసుకున్న ఆయుధాల వివరాలను రాసేప్పుడు అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తలు పాటించాలి. ఈ రిమాండ్ రిపోర్టులో మాత్రం పోలీసులు ఎందుకనో... హత్యాయత్నానికి వాడిన ఆయుధం చాలా చిన్నదని చెప్పడానికి అనేకసార్లు ప్రయత్నం చేశారు. రిమాండ్ రిపోర్ట్‌లో దాడి చేసిన వ్యక్తి వాడిన ఆయుధం – వెరీ స్మాల్ నైఫ్ (సాధారణంగా ఒక నైఫ్ అని రాసి దాని సైజ్ రాస్తారు) కానీ ఇక్కడ పోలీసులు ఒకటికి రెండుసార్లు వెరీ స్మాల్ నైఫ్ అని రాయడం గమనిస్తే ముఖ్యమంత్రి, డీజీపీ నోట్లోనుంచి వచ్చిన మాటలకు అనుగుణంగానే స్క్రిప్ట్ ఉన్నట్టు స్పష్టమవుతోంది.
ఇకపోతే, రెండో ఆయుధం... వెరీ బ్లేడ్ టైప్ ఇన్‌స్ట్రుమెంట్ అని రాశారు. హత్యాయత్నం కేసుల్లో సాధారణ బ్లేడ్ సైతం ఆయధమే అవుతుంది తప్ప అదో ఇన్‌స్ట్రుమెంట్ అని రాయడం మరీ విడ్డూరం. ఎవరైనా బ్లేడ్‌తో దాడి చేశారనుకుంటే... బ్లేడ్‌తో దాడి చేశారనే రాస్తారు తప్ప బ్లేడ్ వంటి ఒక వస్తువును ఉపయోగించారని రాయరు. ఆ రాసిన తీరు కూడా ఎలా ఉందంటే... ఆ వ్యక్తి హోటల్‌లో పనిచేస్తున్నందున ఆ ఆయుధాన్ని చంపడానికి కాకుండా హోటల్‌లో పనిచేస్తున్నాడు కాబట్టి రేపటి రోజున కూరగాయలు తరగడానికి పెట్టుకున్నాడన్నా ఆశ్చర్యపోనక్కరలేదు. అందుకు ఆస్కారం కలిగించే రీతిలో పదప్రయోగం ఉండటం విడ్డూరం.
ఇంతకు లేఖ ఎన్ని పేజీలు
హత్యాయత్నం చేసిన వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్న లేఖ అంశం మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉంది. 9 పేజీలు, 10, 11, 12 పేజీలు ఇలా రోజుకో రకంగా వార్తలొచ్చాయి. దీనిపై రిమాండ్ రిపోర్ట్ ఏం రాశారంటే... హత్యాయత్నం చేసిన వ్యక్తిని ఆసాంతం తనిఖీ చేశామని, అతడి వద్ద 11 పేజీల లేఖ ఒకటి స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత క్రమంలో (సరిగ్గా చెప్పాలంటే మరో అయిదు లైన్ల తర్వాత) సదరు వ్యక్తి నుంచి ఏమేమి స్వాధీనం చేసుకున్నామో తెలిపే జాబితా ఒకటి ఇచ్చారు. అందులో 10 పేజీల లేఖ అని పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్ట్‌లోని అయిదు లైన్లలోనే ఈ రకమైన వ్యత్యాసం ఉండటం దర్యాప్తు ఎంత తేలికభావంతో కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు.
నెల రోజుల ఐడీ కార్డు
హత్యాయత్నం చేసిన వ్యక్తి అసలు ఎంతకాలం నుంచి విమానాశ్రయంకు వస్తున్నారు. ఎందుకంటే పోలీసులు పేర్కొన్న రిమాండ్ రిపోర్ట్‌లో అతడి (శ్రీనివాస్) ఐడీ నంబర్ కేవలం నెల రోజులకు మాత్రమే అనుమతి ఉంది. అతని ఐడీ కార్డు ప్రకారం గత సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 29 తో ముగుస్తుంది. (VEP No.VTZ-27645 Valid from 30-9-2018 to 29-10-2018) కార్డు వాలిడిటీ అమలులోకి వచ్చిన రోజు ఆదివారం (సెప్టెంబర్ 30) కావడం గమనార్హం. మరో నాలుగు రోజుల్లో కాలపరిమితి (29 వ తేదీ సోమవారంతో) ముగుస్తుండగా, 25 వ తేదీ హత్యాయత్నం జరిగింది.
విమానాశ్రయాల్లో పని చేసే సిబ్బంది వేర్వేరు పేర్లతో ఎయిర్‌పోర్ట్ ఎంట్రీ పాస్ (ఏఈపీ) లు తయారు చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) 2016 లో కొన్ని మార్గదర్శకాలను రూపొందించి, వాటిని అమలు చేయాలని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) ను నిర్ధేశించింది. విమానాశ్రయాల్లో పనిచేసే ఎలాంటి సిబ్బంది అయినా ఆధార్‌తో లింక్ అయి ఉన్న ఎయిర్‌పోర్ట్ ఎంట్రీ పాస్ (ఏఈపీ) ఐడీ కార్డు (బయోమెట్రిక్స్ పవర్డ్ ఆధార్ నంబర్) ను మాత్రమే జారీ చేయాలి. 2017 జనవరి 1 వ తేదీ నుంచి దీన్ని కచ్చితంగా అమలు చేయాలి. కానీ ఇక్కడ జగన్‌పై హత్యయత్నానికి పాల్పడిన వ్యక్తి ఐడీ కార్డు కేవలం నెల రోజులకు మాత్రమే జారీ చేసినట్టు రిమాండ్ రిపోర్టులో ఉండటం గమనార్హం.
ఇకపోతే, ఎయిర్‌పోర్టు లోని వీఐపీ లాంజ్‌లోకి ఫ్యూజన్ ఫుడ్స్ నుంచి ఇద్దరు వ్యక్తులు జగన్ దగ్గరకు వచ్చారని అందులో ఒకరు రమాదేవి కాగా మరొకరు హత్యాయత్నం చేసిన శ్రీనివాస్‌గా పేర్కొన్నారు. రమాదేవి ఐడీ నంబర్ (ఏఈ నం. వీటీజెడ్–276577 ) గా ఆరు అంకెలతో కూడి ఉండగా, జగన్‌పై హత్యాయత్నం చేసిన శ్రీనివాసరావు ఐడీ నంబర్ అయిదు డిజిట్లతో ఉంది. నిబంధనల ప్రకారం శ్రీనివాస్ అనే వ్యక్తిది ఆధార్ లింక్ చేసిన ఐడీ అయినట్టయితే ఆధార్ వివరాలు ఏవి? ఎందుకు వెల్లడించలేదు? అసలు ఇలాంటి గుర్తింపు కార్డు ఎంతకాలం కిందట జారీ అయింది. ఈ కోణంలో వివరాలను ఎందుకు సేకరించలేదు? విచారణలో వీటినెందుకు విస్మరించారు?
ఈ వ్యక్తి ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్‌లో వంటవాడిగా – సర్వీస్ అసిస్టెంట్‌గా ఏడాది కిందటే చేరినట్టు రిమాండ్ రిపోర్టులో చెప్పారు. ఏడాది కింద చేరిన వాడికి నెల రోజులు మాత్రమే అనుమతించే ఐడీ కార్డు ఎందుకు జారీ చేశారు? ప్రతి నెల వేర్వేరు కార్డులు జారీ చేస్తున్నారా? అలా చేయడం ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ నిబంధనలకు అనుగుణంగా జరుగుతుందా?
విచిత్రమేమంటే... హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి జగన్ మోహన్‌రెడ్డికి ఒక వినతి పత్రం ఇవ్వాలని అనుకున్నారని, అందుకోసం చిన్న కత్తులు సమకూర్చుకున్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. జగన్‌కు వినతిపత్రం ఇవ్వాలంటే కత్తులు సమకూర్చుకోవాలా? ఏమిటీ విడ్డూరం.
దుబాయ్‌లో ఎంతకాలం?
దాడికి పాల్పడిన వ్యక్తి ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా ఇంటర్ మొదటి సంవత్సరంలోనే ఆపేసినట్టు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అలాగే కొంతకాలం దుబాయ్ వెళ్లి అక్కడ వెల్డర్ అసిస్టెంట్‌గా పనిచేసినట్టు పేర్కొన్నారు. కొంతకాలం అన్నారే తప్ప ఎంతకాలం? ఎప్పటి నుంచి ఎప్పటివరకు పనిచేశాడు? ఎప్పుడు తిరిగొచ్చాడు? తిరిగొచ్చాక ఏం చేశాడు? అతడి పాస్‌పోర్ట్ ఎక్కడుంది? అందులో వివరాలేంటి? ఎక్కడి నుంచి పాస్‌పోర్టు పొందాడు? వంటి వివరాలేవీ అందులో లేవు.
నిష్పాక్షిక విచారణ ఒక్కటే మార్గం
విశాఖ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటనను లోతుగా విశ్లేషించినప్పుడు అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. మంత్రులు, డీజీపీ, ముఖ్యమంత్రి లాంటి వాళ్లు ఈ ఘటనకు సంబంధించి చాలా తేలికగా మాట్లాడిన మాటల ప్రభావం దర్యాప్తుపై తీవ్రంగా ఉన్నట్టు అది సాగుతున్న దిశను బట్టి విధితమవుతోంది. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు రెండో వారంలో విశాఖ జిల్లాలో ప్రవేశించడానికి ముందునుంచి కూడా అనేకసార్లు విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఎప్పుడెప్పుడు విమానాశ్రయం వస్తారన్న సమాచారం అందరికి తెలిసిందే. గడిచిన మూడు నెలల్లో జగన్ అనేకసార్లు విశాఖ విమానాశ్రయం వచ్చారు. దాన్ని బట్టి హత్యకు చాలా పకడ్బందీ కుట్ర జరిగిందనే ప్రస్తుత పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. జగన్‌ను హతమార్చడానికి రెక్కీ కూడా జరిగి ఉంటుందన్న అనుమానాలు పార్టీ నేతల్లో ఉంది. దర్యాప్తు సాగుతున్న తీరు ఈ అనుమానాలను నివృతి చేయలేవని కూడా అంటున్నారు. ఈ మొత్తం ఘటన వెనుక దాగివున్న కుట్ర బయటపడాలంటే సమగ్ర నిష్పాక్షిక విచారణ ఒక్కటే మార్గం.
కుట్రదారులెవరు.. సూత్రధారులెక్కడ?
అది హత్యాయత్నమే: రిమాండ్ రిపోర్టు
Comments
Please login to add a commentAdd a comment