ప్రాణహాని తలపెట్టి అసత్య ప్రచారమా! | A P Vittal Writes Guest Columns On Murder Attempt On YS Jagan | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 1 2018 12:56 AM | Last Updated on Thu, Nov 1 2018 12:56 AM

A P Vittal Writes Guest Columns On Murder Attempt On YS Jagan - Sakshi

వైఎస్‌ జగన్‌పై ఆయన అభిమానే దాడి చేశాడు, ఇది చాలా చిన్న అంశం అంటూ హత్యాప్రయత్నం జరిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ రాష్ట్ర ప్రభుత్వానికి వంతపాడటం నుంచి, ఈ ఘటనపై అసత్య ప్రచార మోత మోగుతూనే ఉంది. అది హత్యాప్రయత్నమేననీ, వైఎస్‌ జగన్‌ ఆ దుర్మార్గుడిని తెలివిగా గుర్తించి తోసివేయగలిగారుగానీ లేకుంటే ఆయన ప్రాణాలకే ప్రమాదం జరిగేదని ప్రభుత్వం వారి విచారణ బృందమే వెల్లడించింది. అయితే హత్యాప్రయత్నం చేసిన ఆ శ్రీనివాస్‌ పాత్రధారే కానీ.. దానికి సూత్రధారులు, వ్యూహకర్తలు ఎవరనే పరిశీలనకు విచారణ బృందం ఇంకా పూనుకోలేదు. ప్రతిపక్ష నేతపై అసత్యప్రచారానికి ఇకనైనా అడ్డుకట్టలు పడాల్సి ఉంది.

దేశంలో అత్యవసర పరి స్థితిని ఇందిరాగాంధీ 1975లో ప్రవేశపెట్టిందని తెలియగానే లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అని స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో వేల కిలోమీటర్లు నడిచి, ప్రత్యక్షంగా యావదాంధ్ర ప్రజానీకాన్ని స్వయంగా కలుసుకుని వారి బాధలు తెలుసుకుంటూ వారికి తగిన భరోసా కల్పిస్తూ, వారి భవిష్యత్తు కోసం నవరత్నాలను అమలు చేయనున్నానని సవివరంగా వేలాదిమంది హాజరవుతున్న వందలాది బహిరంగ సభల్లో ఇత రత్రా సమావేశాల్లో వివరిస్తున్నారు. ఆయన ప్రకటన లతో ప్రజల మనసులు పులకిస్తున్నాయి.

మరోవై పున కుట్రలు, కుతంత్రాలు, నయవంచన, దోపిడీ అణచివేతలే ఆయుధాలుగా గల పాలకులకు, ప్రత్యే కించి ఒక ఆధిపత్య కులం పెత్తందార్లకు గుండెల్లో గుబులు పుడుతోంది. తమ పాలనకు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని స్పష్టంగా వారికి అర్థం అవుతు న్నది. ఈ పరిస్థితిలో దిక్కుతోచక తప్పుమీద తప్పు చేస్తూ తమ నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంటు న్నారు. అందులో భాగమే ఈ నెల 25న జగన్‌ మోహన్‌ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో భద్రతా వలయంలోనే జరిగిన హత్యాప్రయత్నం. ఈ సంద ర్భంగా జయప్రకాష్‌ నారాయణ్‌ చేసిన వ్యాఖ్య మళ్లీ గుర్తుకు వస్తే ఆశ్చర్యం కలుగదు.

జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాప్రయత్నం జరిగిన నిమిషాల్లోనే ఇంకా ఆ హంతకుడి వివరాలు విజువల్‌ మీడియాలో పూర్తిగా రాకుండానే ప్రచారార్భాటం కోసం ఈ దాడి జరిగిందని రాష్ట్ర పోలీసు ఉన్నతా ధికారి ప్రకటించారు. పైగా ఆ దాడి చేసిన వ్యక్తి జగ న్‌కు వీరాభిమానేననడం మరో అసత్యం. తమ హోదాను దిగజార్చి, పదవీ గౌరవాన్ని మర్చి, తన ప్రియతమ నేతకు పాదాభిషేకమో, పాలాభిషేకమో చేస్తున్న అధికార దాహం కల సభాపతులను చూస్తు న్నాం కానీ, ఇలా అభిమానిని అని చెప్పుకుంటూ హత్యాప్రయత్నం చేసేవాళ్లను చూడ్డం ఇదే మొద టిసారి!

నిమిషాల్లోనే పోలీసువారు ఈ దాడి గుట్టు మట్లను ఛేదిస్తే ఇక దర్యాప్తు, విచారణ వగైరా దేనికి? ఏదేమైనా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఆ పోలీసు ఉన్నతాధికారి ప్రభువును మించిన ప్రభు భక్తిని ప్రశంసించకుండా ఉండలేను. వీరాభిమాని చేసినా లేదా వీరాభిమాని ముసుగును ఆ వ్యక్తి మీద కప్పి, ఓటమి భయంతో వణుకుతున్న నేతలెవరైనా అతనితో చేయించినా.. అంతిమంగా అతడి ప్రాణా నికి తనను పురమాయించిన నేతల నుంచే ముప్పు ఉండవచ్చు. కనుక ప్రభువును మించిన సదరు పోలీసు ఉన్నతాధికారులు అతనికి ప్రాణహాని కలి గించకుండా తగు రక్షణ కల్పించాల్సి ఉంది. 

పైగా, ఇలాంటి సానుభూతి థియరీలకు గతంలో చంద్రబాబు హయాంలోనే కాలం చెల్లింది. చంద్రబాబుపై నక్సలైట్లు అలిపిరి వద్ద బాంబులతో దాడిచేశారు. అదృష్టవశాత్తూ అంతకు మించి ఏడు కొండల వెంకన్న చౌదరి (ఎంపీ మురళీ మోహన్‌కు కృతజ్ఞతలతో, క్షమాపణలతో) దయవలన బాబు గారికి ఏ ప్రమాదమూ జరగలేదు. దానితో తన పట్ల ప్రజల్లో సానుభూతి వెల్లువ పొంగి పొరలుతుందని, ఈ సమయంలో ముందస్తు ఎన్నికలకు వెళితే ప్రజలు నీరాజనం పట్టి తనకు తిరిగి భారీ మెజారిటీతో అందలం ఎక్కిస్తారని చంద్రబాబు ఎన్నికల్లో భ్రమ పడ్డారు.

ఢిల్లీలో అప్పుడు అధికారంలో ఉన్న వాజ్‌ పేయిని కూడా ఒప్పించి ముందస్తు ఎన్నికలకు తెర తీశారు. కానీ చంద్రబాబు అంచనాలు తల్లకిందులై 2004 ఎన్నికల్లో తెలుగుదేశం బొక్కబోర్లాపడింది. పాపం.. ఈయనతో ముడివేసుకున్న ప్రధాని వాజ్‌ పేయి ప్రభుత్వానికి కూడా కాలం చెల్లిపోయింది. కాబట్టి ఇలాంటి కాకమ్మ కథలను తెలివిమీరిన నేటి ఓటర్లు నమ్మరు కాక నమ్మరు. 

ఇక బాబుగారి అనుచర బృందం ఇంకో అడుగు ముందుకు వేసి జగన్‌మోహన్‌ రెడ్డి తనపై తానే దాడి చేయించుకున్నాడని గొంతులు చించుకుని దుష్ప్ర చారం చేస్తున్నారు. బాబుగారు రాష్ట్రంలో తన ప్రభు త్వాన్ని అస్థిరపరిచి రాష్ట్రపతి పాలన ప్రవేశ పెట్టా లన్న కుట్ర జరుగుతున్నదనీ జనాన్ని భయభ్రాంతు లను చేస్తున్నారు. చంద్రబాబుని చూస్తుంటే జాలే స్తోంది. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రాగ లమని ఆయన, టీడీపీ కలిసి దింపుడు కళ్లెం ఆశ పెట్టుకుని ఉండవచ్చు.

కానీ ఆ పార్టీకి రానున్న ఎన్ని కలే చివరి ఎన్నికలు కావాలని జనం ఎప్పుడో నిర్ణ యించుకున్నారు. అయినా ప్రజానీకం అప్రమ త్తంగా ఉండాలి. సాక్షాత్తు ముఖ్యమంత్రే ప్రార్థనా స్థలాలపై దాడులు, అల్లకల్లోలం, రాష్ట్రంలో అశాంతి పరిస్థితులు వస్తాయని బహిరంగంగా చెబుతున్నా రంటే తమ ప్రభుత్వ రక్షణకు చంద్రన్న పథకాలేవో సిద్ధం చేస్తున్నారన్నమాట! అయితే బాబుగారి సంక్షేమ పథకాల మాదిరే ఈ కుట్ర పథకాలూ నీరుగారిపోయేవే! 

సందట్లో సడేమియా అన్నట్లుగా కొన్ని బినామీ మీడియా సంస్థలు కూడా బాబుగారి ఈ ప్రయ త్నాలకు, వారి కుతంత్రాలకు తగురీతిలో మసాలా దట్టించి మరీ వడ్డిస్తున్నాయి. ఇంకా హత్యాప్ర యత్నం చేసిన వ్యక్తి వివరాలేమీ రాకముందే హోటల్‌ సర్వర్‌ శ్రీనివాస్‌ ఫోర్కుతో జగన్‌పై దాడి చేశాడని ఒక చానల్‌ ప్రచారం చేసింది. హత్యా ప్రయత్నం లేదూ.. పాడూ లేదూ.. 0.5 సెంటీమీటర్ల గాయమే నని నోటికొచ్చినట్లు కట్టుకథలు అల్లిన నేతలకు చెంపపెట్టన్నట్లుగా ప్రభుత్వం వారి విచారణ బృందమే.. అది హత్యా ప్రయత్నమేననీ, వైఎస్‌ జగన్‌ ఆ దుర్మార్గుడిని గుర్తించి తోసివేయగలిగారు గానీ లేకుంటే అత్యంత పదునైన కత్తివేటు అయన మెడపై పడి ఉంటే ప్రాణాలకే ప్రమాదం జరిగేదని వెల్లడించింది.

అయితే హత్యా ప్రయత్నం చేసిన ఆ శ్రీనివాస్‌ పాత్రధారే కానీ దానికి సూత్రధారులు, వ్యూహకర్తలు ఎవరు అనే పరిశీలనకు విచారణ బృందం ఇంకా పూనుకోలేదు. టీడీపీవారు తల్చు కుని ఉంటే వైఎస్‌ జగన్‌ని ఎప్పుడో కైమా చేసి ఉండే వారని టీడీపీ నేతలు బాహాటంగా ప్రకటించి తమ వాక్శూరత్వాన్ని నిరూపించుకున్నారు. కానీ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దురాశను, దురాగతా లను ఓట్ల ఆయుధంతో ప్రజలు కైమా చేసే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నది.

తాజాగా మరో పల్లవి ఆలాపన జరుగుతోంది. ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ అస్థిరత సృష్టించేందుకు ఒక పథకం ప్రకారం ఇలాంటి కుట్రలు పన్నుతున్నారట. నిజానికి అసలు కుట్రదారు మోదీ అయితే జగన్‌ ఆయన జోలికి వెళ్లడం లేదట. అయినా నాలుగేళ్లకు పైగా మోదీతో అంటకాగి సహజీవనం చేసింది చంద్రబాబే. ఆ మోదీని సంతృప్తి పర్చడానికి 2017లో వైఎస్‌ జగన్‌ని ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొనకుండా విశాఖ విమానాశ్రయంలో నిర్బంధించింది కూడా చంద్ర బాబే. మోదీ దోస్తానాతో దోచుకోవలసినంత దోచు కుని దాచుకోవలసినంత దాచుకున్నాం. ఇక ఈ కంచి గరుడ సేవ దేనికి అని మోదీతో విడాకుల ప్రహసనం మొదలెట్టింది కూడా చంద్రబాబే.

ఇకపోతే, శివాజీ అని ఒక సినిమా నటుడు న్నాడు. ఆయన 2017లో ఆపరేషన్‌ గరుడ పేరుతో ఒక అత్యంత తీవ్రమైన రహస్యాన్ని బయటపెట్టాడు. ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డికి కూడా తెలీకుండా ఆయనను వాడుకుని ఆంధ్రప్రదేశ్‌ను ధ్వంసం చేసేం దుకు ఆపరేషన్‌ గరుడ పేరుతో కేంద్రం కుట్ర పన్నిం దట. సాక్షాత్తూ చంద్రబాబే ఢిల్లీలో పత్రికాగోష్టి పెట్టి ‘శివాజీ గతంలో చెబితే తేలిగ్గా కొట్టిపడేశాను. ఇప్పుడు శివాజీ పరిశోధన నిజమని తేలుతోంది’ అని చెప్పారు. నిజానికి ఆ శివాజీనే పోలీసు రక్షణతో ఢిల్లీకి తనతోపాటు తీసుకెళ్లి ఆ పత్రికా గోష్టిలో అతడితోనే చెప్పించి ఉంటే మరింత సాధికారత వచ్చేది కదా.

చివరగా.. చంద్రబాబుని వ్యక్తిగత ద్వేషంతో విమర్శించడం నా ఉద్దేశం కాదు. ఇప్పటికైనా ఆయన కాస్త ఆత్మవిమర్శ చేసుకుని మన జాషువా మహాకవి అన్నట్లు ఒక మంచి మనిషిగా మారే కృషి చేస్తే, ఆయనకు ఆంధ్రప్రదేశ్‌కూ ఉపయోగం. జాషువా  ‘పిరదౌశి’ అనే ఒక ఖండకావ్యం రచించారు. అరబ్బు దేశంలో పిరదౌసి అనే గొప్ప కవి ఉండేవారట. ఆ దేశ ప్రభువు పిరదౌసి కవిని పిలి పించి నాపై గొప్పగా ఒక కావ్యం రాస్తే నీకు పద్యానికి ఒక బంగారు నాణెం ఇస్తానని వాగ్దానం చేశాడట. పిరదౌసి ఆశపడి ఆయన్ని కీర్తిస్తూ గొప్ప కావ్యం రాశాడట. అక్కర తీరిన ఆ ప్రభువు పద్యానికి ఒక బంగారు నాణెం ఇస్తానన్న వాగ్దానం తుంగలో తొక్కి వెండినాణేలను తన భటులతో ఆ కవి ఇంటికి పంపా డట.

పిరదౌసి వాటిని తిరస్కరించగా ప్రభువు ఆగ్రహోదగ్రుడై పిర దౌసిని తీసుకొచ్చి కారాగారంలో నిర్బంధించమని భటులను ఆదేశించాడట. రాజధాని ప్రాంతానికి భూములిచ్చిన అమాయక రైతు, కూలీలు, నిరుద్యోగ భృతికి భ్రమపడ్డ నిరుద్యోగులు, మోసపోయిన డ్వాక్రా మహిళలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, గత ఎన్నికల్లో చంద్రబాబు మాటలు నమ్మి అవన్నీ నేతిబీరలో నెయ్యి చందంగా ఆలస్యంగా గ్రహిం చారు. కానీ పిరదౌసి ప్రభువు కాపట్యాన్ని ముందు గానే గ్రహించి తన ఒక్కగానొక్క కూతురిని తీసుకుని ఆ ప్రాంతం వదలి వెళ్లిపోతూ తనగోడుపై ఒక పద్యం రాశాడట.
‘‘అల్లా తోడని పల్కి నా పసిడి కావ్య ద్రవ్యంబు వెండితొ చెల్లింపగ దొర కన్న టక్కరివి
నీచే పూజితుండైనచో అల్లాకున్‌ సుఖమే...? మహమ్మదు నృపాలా! సత్య వాక్యం బెవం 
డుల్లంఘింపబోడొ వాడెపో నరుడు, ధన్యుండిద్ధ రామండలిన్‌.’

ఎవరైతే తానిచ్చిన మాటకు కట్టుబడతాడో వాడే మనిషి, ధన్యుడు అని గ్రహించి చంద్రబాబు కనీసం జాషువా గారి ‘నరుడి’ వలె వ్యవహరించే ప్రయత్నం చేయాలని నా సలహా.


వ్యాసకర్త: డాక్టర్‌ ఏపీ విఠల్‌, మార్క్సిస్టు విశ్లేషకులు
మొబైల్‌ : 98480 69720

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement