ఆ రంగస్థల నటుడికి ఏవీ సుబ్బారావు అవార్డు | AV Subba Rao Death Anniversary At Tenali | Sakshi
Sakshi News home page

ఆ రంగస్థల నటుడికి ఏవీ సుబ్బారావు అవార్డు

Published Thu, Dec 26 2019 8:39 AM | Last Updated on Thu, Dec 26 2019 8:39 AM

AV Subba Rao Death Anniversary At Tenali - Sakshi

శ్రీకృష్ణుడి పాత్రలో ఏవీ సుబ్బారావు

సాక్షి, తెనాలి: ఆయన పద్య గానం పౌరాణిక నాటక రంగాన్ని ప్రకాశింపజేసింది. తెనాలి కళారంగ ఆణిముత్యాల్లో ఒకడిగా నిలిపింది. రంగస్థలంపై శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పాత్రల్లో పరకాయ ప్రవేశం అనిర్వచనీయం. అందుకే అర్ధశతాబ్దం పాటు నాటక ప్రియులను ఆయన రంజింపజేశారు. ప్రేక్షక మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయనే తెనాలికి చెందిన ‘గానకోకిల’ ఏవీ సుబ్బారావు. ఇంతటి కళా ప్రముఖుడి స్మారకార్థం ఏటా ఒక ప్రముఖ రంగస్థల నటుడికి ఏవీ సుబ్బారావు వర్ధంతి రోజైన డిసెంబరు 26న అవార్డును ప్రదానం చేస్తూ.. కళాకారుల పత్రిష్టను ఎలుగెత్తి చాటుతున్నారు. ఏవీ సబ్బారావు రంగస్థల సమాఖ్య వారి శ్రీపూర్ణశ్రీ నాట్యకళాసమితి ఆధ్వర్యంలో గురువారం తెనాలిలోని శివాజీచౌక్‌లో 9వ వార్షిక అవార్డును అనంతపురానికి చెందిన ప్రముఖ నటుడు ‘కళాతపస్వి’ ఆకులేటి నరసింహమూర్తికి ప్రదానం చేయనున్నారు. ఇదే వేదికపై రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 40 మంది కళామూర్తులను సత్కరించనున్నారు. సినీ సంభాషణల రచయిత సాయిమాధవ్‌ బుర్రా, పౌరాణిక నటుడు గుమ్మడి గోపాలకృష్ణ, తెనాలి సబ్‌కలెక్టర్‌ కె.దినేష్‌కుమార్‌ తదితర ప్రముఖులు కార్యక్రమానికి హాజరుకానున్నారు.   

నాటకాలపై ఆసక్తితో రంగస్థలం వైపు.. 
ఏబీ సుబ్బారావుగా రంగస్థల ఖ్యాతి పొందిన ఆరాధ్యుల వెంకట సుబ్బారావు స్వస్థలం తెనాలి సమీపంలోని అనంతవరం. పేద రైతు కుటుంబం. పెద్దగా చదువు లేదు. పొలం పనులతోనే జీవనం.  నాటకాలపై ఆసక్తి ఆయన్ని కళాకారుడిని చేస్తే, నిరంతర శ్రమ, కఠోరదీక్ష ఎంతో ఎత్తుకు ఎదిగేలా చేశాయి. గ్రామంలో పక్క బజారులో ఉండే రంగస్థల నటుడు కుప్పా సూర్యనారాయణ శిష్యరికంతో సుబ్బా రావు కళామతల్లి సేవకు అంకితమయ్యారు.   

పాత్రలో పరకాయ ప్రవేశం.. 
శ్రీరాముడు పాత్రకు పద్యాలు, పాటలు, సంభాషణలను సుబ్బారావు వంటపట్టించుకున్నారు. ‘బాలనాగమ్మ’ ఫేం వల్లూరి వెంకట్రామయ్య ఆహ్వానంపై రెండేళ్లు ఆ బృందంలో ‘కార్యవర్ధి రాజు’గా నటించారు. ఆక్రమంలో 1958లో గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి పద్యనాటక పోటీల్లో ‘పాండవోద్యోగ విజయం’లో ఏవీ సుబ్బారావు శ్రీకృష్ణుడిగా నటించారు. ఆ యన అద్భుత ప్రదర్శనతో మరోసారి అక్కడే నా టకం ఏర్పాటు చేసి, పూర్తయ్యాక  ఆయన్ని 75 తులాల వెండి కిరీటంతో సత్కరించారు. ఇక అప్పటి నుంచి సుబ్బారావు వెనుదిరిగి చూడలేదు.

పద్య గానం మధురం.. 
ఆంధ్ర రాష్ట్రమంతా సుబ్బారావు పద్య గానంలోని మాధుర్యాన్ని తనివితీరా ఆస్వాధించింది. 1960లో శ్రీ పూర్ణశ్రీ నాట్య కళాసమితిని స్థాపించారు. ఈ సమాజంలోనే 30 ఏళ్లపాటు నాటక ప్రదర్శనలిచ్చారు. రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఢిల్లీ, ఒడిశా, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాల్లో ఆయన ప్రదర్శనలు పేక్షక మన్ననలు పొందాయి.  

మూడు తరాల కళాకారులతో.. 
మూడు తరాల కళాకారులతో నటించిన మరో ఘనత కూడా సుబ్బారావుకు ఉంది. ఈల పాట రఘురామయ్య, పీసపాటి నరసింహమూర్తి, షణ్ముఖి ఆంజనేయరాజు వంటి హేమాహేమీలతో కలిసి  శ్రీకృష్ణుడి పాత్రను ఒకే వేదికపై పంచుకున్నారు. 

ఆంజనేయుడు పాత్రలో నరసింహమూర్తి ఆకులేటి నరసింహమూర్తి  

ఆరు వేల ప్రదర్శనలు.. 
మొత్తం మీద సుబ్బారావు ఆరు వేల ప్రదర్శనలిచ్చారు. ఆయన పద్యాలను హెచ్‌ఎంవీ, ఏవీఎం సంస్థలు గ్రామఫోన్, ఆడియో క్యాసెట్ల రూపంలో విడుదల చేశాయి. రెండు చిత్రాల్లో కాంతారావు, రావి కొండలరావుకు ప్లేబ్యాక్‌ పద్యాలు గానం చేశారు. 2010 డిసెంబర్‌ 26న సుబ్బారావు కన్నుమూశారు. ఆయన స్మారకార్థం కళారంగంలోనే స్థిరపడిన ఆయన ముగ్గురు కుమారులు ప్రతిఏటా పౌరాణిక పద్యనాటక ప్రదర్శనలు ఏర్పాటు చేసి ఆ రంగంలో నిష్ణాతులైన వారికి ‘ఆంధ్ర గానకోకిల ఏవీ సుబ్బారావు అవారు’ ను ప్రదానం చేస్తున్నారు.

ఆంజనేయుడి పాత్రలో ఆకులేటి..
ఏవీ సుబ్బారావు అవార్డును స్వీకరించనున్న ఆకులేటి నరసింహమూర్తి అనంతపురం జిల్లా శింగనమల దగ్గర్లోని ఆకులేడు గ్రామ వాసి. 1950లో జన్మించారు. చిన్నతనం నుంచే రాగాలాపన చేసేవారు. గ్రామంలోని హార్మోనిస్టు సుబ్బరాజు దగ్గర ఆంజనేయుడి వేషం, పద్యాలు నేర్చారు. పది నాటకాల్లో నటించారు. తదుపరి అనంతపురంలో శ్రీవెంకటేశ్వర నాట్యమండలి సమాజంలో గురువు దగ్గర మూడేళ్ల పాటు పద్యనాటక సాధన తర్వాత వసంతోత్సవాల్లో ఏవీ సుబ్బారావు శ్రీరాముడిగా, నరసింహమూర్తి ఆంజనేయుడిగా పలు గ్రామాల్లో ఇచ్చిన ప్రదర్శనలు సూపర్‌ హిట్‌ అయ్యాయి.

నరసింహమూర్తి కాస్తా.. ఆకులేటి ఆంజనేయుడయ్యారు. ప్రఖ్యాత నటులు షణ్ముఖి ఆంజనేయరాజు, ఈలపాట రఘురామయ్య, పీసపాటి నరసింహమూర్తి, ధూళిపాళ్ల, ఆచంటి వెంకటరత్నం నాయుడు, అమరపు సత్యనారాయణ, ఏవీ సుబ్బారావు కుమారులు వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు, గుమ్మడి విమలకుమారితో వేదికను పంచుకున్నారు. కర్నూలు జిల్లాలో ఇచ్చిన ఓ ప్రదర్శనలో 50 కిలోల వెండిగదను బహుమతిగా అందుకున్నారు. ఇప్పుడు కూడా ఏమాత్రం గాత్రం తగ్గకుండా ప్రదర్శనలిస్తుండటం విశేషం.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement