ఇదేంట్రా ‘బాబూ’!
*గంటా బృందానికి చంద్రబాబు షాక్
*భవిష్యత్తుపై హామీ ఇస్తారనుకుంటే జెడ్పీ ఎన్నికల బాధ్యత
*అధినేతతో భేటీ తర్వాత మరింత అయోమయం
గంటా బృందం తెలుగుదేశంలో చేరిన ముహూర్తం ఏ మాత్రం బాగున్నట్టు లేదు. వీరికి అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. సొంత క్యాడర్ కలసి రాక, తెలుగుదేశం క్యాడర్ అంగీకరించక అష్టకష్టాలు పడుతున్న ఈ బృందానికి పార్టీ అధినేత చంద్రబాబు నుంచి కూడా ఊరట లభించడం లేదు. వేల మందిని కూడగట్టి ప్రజాగర్జన పెట్టి అయ్యన్నపాత్రుడితో తిట్లుతిని అభాసుపాలైన గంటా బృందానికి మరో షాక్ తగిలింది.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : పార్టీలో తమ భవిష్యత్, సీట్ల గురించి చంద్రబాబుతో మాట్లాడదామని హైదరాబాద్ వెళ్లిన గంటా బృందానికి ఎటువంటి హామీ లభించకపోగా, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత వచ్చి పడింది. ఎంతో ఆశతో తెలుగుదేశం పార్టీలో చేరి, అక్కడి పరిణామాలతో తీవ్ర నిరాశకు గురైన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, శాసన సభ్యులు ముత్తం శెట్టి శ్రీనివాస్, చింతలపూడి వెంకట్రామయ్య, పంచకర్ల రమేష్‌బాబు, యూవీ రమణమూర్తి(కన్నబాబు)లు మూడు రోజుల పాటు చంద్రబాబుపైనా అలిగారు.
ఆయన సమక్షంలోనే అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పిస్తే ఎందు కు మందలించలేదని మధనపడ్డారు. ఆ కోపం తో చంద్రబాబు నిర్వహించిన సమీక్షకు హాజరుకాలేదు. విమానాశ్రయానికి వెళ్లి ఆయనకు వీ డ్కోలు పలకలేదు. గంటా ఇంట్లో నిరసన సమావేశాన్ని ఏర్పాటుచేసి పార్టీ పర్యవేక్షకుడైన నారాయణను పిలిచి తమ గోడును వెళ్లబోసుకున్నారు.
ఆ తర్వాత కూడా చంద్రబాబు నుంచి సానుకూల స్పందన రాకపోవడం, మరో పక్క నియోజక వర్గాల్లో వ్యతిరేకత రోజురోజుకూ పెరిగిపోతుండడంతో గత్యంతరం లేక ఆదివారం వీరంతా హైదరాబాద్ బాటపట్టా రు. నారాయణ సమక్షంలో చంద్రబాబును కల సిన వీరికి ఊరట లభించకపోగా, జడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బాధ్యత మీద పడింది. వీరి భవిష్యత్‌పై ఎటువంటి హామీ ఇవ్వని చంద్రబాబు ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపిం చి తీసుకురావాలని స్పష్టం చేశారు. నియోజక వర్గాల్లో తెలుగుదేశం క్యాడర్ తమతో కలసిరావడం లేదని చెప్పుకొనే అవకాశాన్ని కూడా ఆయన వీరికి ఇవ్వలేదు.
భీమిలిలో ముత్తంశెట్టి శ్రీనివాస్‌ను కాదని మాజీ శాసన సభ్యుడు అప్పల నరసింహరాజు ఎన్నికల ఏర్పాట్లు చేసుకుపోతున్నారు. పెందుర్తిని వదిలేసి ఉత్తర నియోజక వర్గంలో పనిచేస్తున్న పంచకర్లకు ఇ క్కడా, అక్కడా వ్యతిరేకతే వ్యక్తమవుతోంది. ఇక టికెట్టే రాదని చెబుతున్న వెంకట్రామయ్యను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. యలమంచిలి లో ఇంతకాలం తమకు నరకం చూపించిన కన్నబాబుతో కలిసేదే లేదని దేశం నేతలు తెగేసి చెబుతున్నారు.
ప్రతి ఎన్నికలకు నియోజక వర్గం మారే గంటా పరిస్థితి దయనీయంగా ఉంది. ఎక్కడ నుంచి పోటీ చేయాలో తేల్చుకోలేకపోతున్న ఆయనకు ఎక్కడ పనిచేయాలో అర్థం కావడం లేదు. ఈ అంశాలపై కాస్త స్పష్టత కోసం హైదరబాద్ వెళ్లిన గంటా బృందం చంద్రబాబుతో భేటీ తర్వాత మరింత అయోమయంలో పడిపోయింది.