చంద్రబాబునాయుడు తాను ఇంకా ప్రతిపక్షనేత అనే భ్రమలోనే ఉన్నట్టున్నారని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి విమర్శించారు.
పలమనేరు: చంద్రబాబునాయుడు తాను ఇంకా ప్రతిపక్షనేత అనే భ్రమలోనే ఉన్నట్టున్నారని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి విమర్శించారు. పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకొచ్చినా ఆ పార్టీ నాయకులు మాత్రం వారి ఉనికిని కాపాడుకునే పనిలో ఉన్నారని తెలిపారు. పింఛన్ల కమిటీ విచారణ పూర్తిగా ఆ పార్టీ సమావేశాల్లా మారాయని ఎద్దేవా చేశారు. కొత్తగా ఒక్కరికి కూడా పింఛన్ ఇవ్వని ఈ ప్రభుత్వం ఉన్న వాటిని ఊడగొట్టడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు.
ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయ్యిందని, త్వరలో ప్రజాగ్రహం తప్పదని జోస్యం చెప్పారు. రుణమాఫీ జరగక రైతులు పడుతున్న ఆవేదన ఈ ప్రభుత్వానికి శాపంలా మారకతప్పదన్నారు. చంద్రబాబు హామీతో 8 శాతం వడ్డీ 14 శాతంగా పెరిగి బంగారు నగలు వేలం వేసే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. మంచినీటి సమస్య పరిష్కారంలో భాగంగా జిల్లాలోని పడమటి మండలాల్లో ఒక్క బోరైనా డ్రిల్ చేశారా అని ప్రశ్నించారు.
వైఎస్సార్ సీపీ గెలుపొందిన స్థానాలపై చిన్నచూపు చూస్తున్నారని, ‘మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రా లేక తెలుగుదేశం కార్యకర్తలకా’ అని ప్రశ్నించారు. చాలా మంది మంత్రులకు వారి శాఖల గురించి అవగాహన లేదని, వీరు ప్రజా సమస్యలను గాలికొదిలి లోకేష్‌బాబు జపం చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించామా అని ఇప్పటికే జనం భాధపడుతున్నారని, త్వరలోనే వీరికి తగిన శాస్తి జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ శారదా, వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు సీవీ.కుమార్ పాల్గొన్నారు.