మూడో రోజూ నిరసనల హోరు
అధికారులను నిలదీస్తున్న జనం
పార్టీ కార్యక్రమాల్లా ‘తమ్ముళ్ల’ హడావుడి
విశాఖపట్నం : వరసగా మూడో రోజు కూడా జిల్లాలో జన్మభూమి-మాఊరు కార్యక్రమం నిరసనలు, ఆందోళనల మధ్య కొనసాగింది. సమస్యలు పరిష్కరించకుండా కొత్తగా ఎందుకొచ్చారంటూ ఆయా గ్రామాల ప్రజలు ఎక్కడికక్కడే నిలదీసే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్లు, ఇళ్ల స్థలాల సంగతి ఏంచేశారంటూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. వారిని సముదాయించలేక అధికారులకు తలప్రాణం తోకకు వస్తోంది. మరోవైపు అక్కడక్కడ అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వీరితో స్వరం కలుపుతుండగా మరికొన్ని చోట్ల అన్నీ తామై పార్టీ కార్యక్రమంలా నిర్వహిస్తున్న వారూ ఉన్నారు. సోమవారం పాయకరావుపేట నియోజకవర్గం గుంటపల్లిలో టీడీపీ నాయకుడు గెడ్డం బుజ్జి నేతృత్వంలో సమస్యలు పరిష్కరించకుండా జన్మభూమి ఎందుకంటూ అధికారులను నిలదీశారు. జన్మభూమిని బహిష్కరించాలనుకున్నా జనం ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో విరమించుకున్నామని, సీఎం చంద్రబాబు దృష్టికి వాస్తవాలు తెలియాలని నిలదీశామని స్పష్టంచేశారు.
కోటవురట్లలో జన్మభూమి కమిటీ సిఫార్సులు చేసిన వారికే పెన్షన్లు, రేషన్‌కార్డులు ఇస్తున్నారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే మండలం గొటివాడలో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నందున ఇసుక ర్యాంపుల వేలం వద్దని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మునగపాక మండలం నారాయడుపాలెంలో మరుగుదొడ్లు, ఇళ్లస్థలాలు మంజూరు చేయలేదంటూ మహిళలు ఆందోళనకు దిగారు. బుచ్చయ్యపేట మండలం కొండెంపూడిలో కార్డులు, పెన్షన్లు ఇచ్చాకే జన్మభూమి జరగనిస్తామని సర్పంచ్ సహా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇదే మండలం గంటికొర్లాంలో సర్పంచ్‌ను కాదని, జన్మభూమి కమిటీల పెత్తనమేమిటని మండిపడ్డారు.
రోలుగుంట మండలం కొమరవోలులో జాయింట్ కలెక్టర్ నివాస్‌ను గ్రామస్తులు, జెడ్పీ మాజీ చైర్మన్ రామ్మూర్తినాయుడు సమస్యల పరిష్కరించకపోవడంపై నిలదీశారు. మాడుగుల నియోజకవర్గం తెనుగుబూడిలో జెడ్పీ చైర్‌పర్సన్ భవానీ భర్త లాలం భాస్కరరావు, మాజీ ఎమ్మెల్యేలను ఎందుకొచ్చారంటూ గ్రామస్తులు నిలదీశారు. జన్మభూమి వేదికపై టీడీపీ నాయకులు పార్టీ కార్యక్రమంలా జెడ్పీ సీఈవో జయప్రకాష్‌నారాయణను సన్మానించారు.
ఏజెన్సీలోని డుంబ్రిగుడ మండలం సొవ్వ పంచాయతీలో జన్మభూమి అధికారులను గిరిజనులు, వైఎస్సార్‌సీపీ నాయకులు నాలుగ్గంటల పాటు రోడ్డుపైనే నిలిపివేశారు. సమస్యల పరిష్కారానికి లిఖితపూర్వక హామీ ఇచ్చేదాకా కదలనీయలేదు. దీంతో సభ జరగకుండానే అధికారులు వెనక్కి వెళ్లిపోయారు. అరకు మండలం చొంపిలో ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్న జన్మభూమి సభ రసాభాసగా మారింది. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని, గతంలో గవర్నర్ చొంపిని ఆదర్శ గ్రామంగా తీసుకుని అభివృద్ధి చేస్తామన్న హామీ నెరవేర్చలేదని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సంధ్యారాణి చంద్రబాబుకు ఇదొక్కటే పనా? ఇంకేమీ లేవా? అంటూ వ్యంగ్యంగా మాట్లాడడంతో గ్రామస్తులు విరుచుకుపడ్డారు. అక్కడ గ్రామ సర్పంచ్ లక్ష్మిని పక్కనబెట్టి ఎంపీడీవో సభకు అధ్యక్షత వహించారు. అదే మండలం బొండాం సభలోనూ బాక్సైట్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేసేదాకా సభ జరగనివ్వబోమని గిరిజనులు పట్టుబట్టడంతో చివరకు తీర్మానం చేశారు.
భీమిలి నియోజకవర్గంలో మంత్రి గంటా శ్రీనివాసరావు బంధువు పరచూరి భాస్కరరావు అన్నీతానై వ్యవహరించారు. ప్రజల ప్రశ్నలకు అధికారులతో సమాధానం చెప్పించారు. హామీలిచ్చారు. ఇదే నియోజకవర్గంలోని మధురవాడ స్వతంత్రనగర్‌లో ప్రజల నుంచి అర్జీలు తీసుకోవడానికి మంత్రి గంటా ఆసక్తి చూపలేదంటూ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా నినాదాలు చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆనందపురం మండలం వేములవలసలో 2011లో మంజూరైన ఇళ్లకు ఎందుకు మోక్షం కలిగించలేదని గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు.