గుండాయపాలెం (ఒంగోలురూరల్): మండలంలోని ఏకైక బాలుర వసతి గృహం సమస్యల వలయంలో చిక్కుకుని విలవిల్లాడుతుంది. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన విద్యార్థుల వసతి గృహం అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిపోయింది. గత ఏడాది నీరు–చెట్టు కార్యక్రమంలో భాగంగా చెరువులో మట్టి హాస్టల్ ముందు ఉన్న ఆట స్థలంలో మూడు వంతుల భాగం వరకు మెరక చేశారు. పనులు చివరి దశలో ఉండగా అప్పటి బీసీ కార్పొరేషన్ డీడీ మయూరి సర్పంచ్ వెంకటేశ్వరమ్మకు హాస్టల్ అభివృద్ధి పనులు చేపట్టవద్దనీ, హాస్టల్‌లో ప్రవేశించవద్దనీ లేఖ రాశారు. దీంతో పనులు హాస్టల్ పనులు ఆగిపోయాయి. అనంతరం హాస్టల్‌ను సందర్శించిన బీసీ కార్పొరేషన్ డీడీ లక్ష్మిసుధ హాస్టల్ పరిస్థితులపై ఆరా తీశారు. దీనిపై స్పందించిన సర్పంచ్ హాస్టల్ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న పరిస్థితులు డీడీకి వివరించారు. దీనిపై స్పందించిన డీడీ లక్ష్మిసుధ స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడి హాస్టల్‌కు నిధులు మంజూరుచేయిస్తామని అప్పట్లో వారికి హామీ ఇచ్చారు. కానీ నేటికి హాస్టల్‌లో నిర్మాణ పనులు కార్యరూపం దాల్చలేదు.
పాములకు ఆవాసాలు
హాస్టల్‌లో చిల్లచెట్లు పెరిగి పోవడంతో పాములకు, పురుగులకు ఆవాసంగా మారింది. సాయంత్రం 5 గంటలు దాటితే విద్యార్థులు బయటకు రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. పాఠశాల ఆవరణలో మేక పోతును వధించడం, మద్యం సేవించి కోళ్లను విచ్చలవిడిగా కోయడంపై విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. దీనిపై గ్రామస్తులు లిఖిత పూర్వకంగా అధికారులకు అర్జీలు ఇచ్చినా పట్టించుకోలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక ప్రజలు కోరుతున్నారు.