వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వేదికగా ప్రకటించిన డిక్లరేషన్ బీసీలకు నూతనోత్తేజాన్ని ఇచ్చింది. ‘గర్జన’ సభలో జగన్ ఇచ్చిన హామీలు వారికి రెట్టింపు ఆనందాన్ని ఇచ్చాయి. దీంతో జిల్లాలో 32 లక్షలకు పైగా ఉన్న బీసీల్లో కొత్త ఆశలు చిగురించాయి. వైఎస్ కుటుంబం మాట ఇస్తే నిలబడుతుందని, తమ బతుకులకు జగన్ భరోసా ఇచ్చారని బీసీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి, కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ఏలూరులో ఆదివారం జరిగిన బీసీ గర్జనకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచీ వేలాదిగా ప్రజలు తరలివెళ్లారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీసీలతో పాటు తటస్తులు కూడా అధిక సంఖ్యలో ప్రత్యేకంగా బస్సులు, ఇతర వాహనాలు ఏర్పాటు చేసుకుని వెళ్లారు. ఆ వాహనాలకు ముఖ్య నేతలు జెండా ఊపారు. దీంతో ఆదివారం ఎక్కడా చూసినా ఒకటే సందడి. తండోపతండాలుగా వెళ్లిన జనంతో దారి పొడవునా రద్దీ ఏర్పడింది. వెల్లువలా తరలి వెళ్లిన బీసీల్లో సమరోత్సాహం కనిపించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏం చెబుతారో, ఏం ప్రకటిస్తారోనని ఆసక్తితో పయనమయ్యారు. వారి ఆశలు అడియాసలు కానివిధంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన బీసీ డిక్లరేషన్ ఆ వర్గాలను సంతృప్తిపరచింది. బీసీ గర్జన సభలో పార్టీ అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తదితరులు జిల్లా తరఫున ప్రసంగించారు.
తేలిపోయిన టీడీపీ జయహో బీసీ సదస్సు
గతంలో ఏన్నడూ లేనివిధంగా రాజమహేంద్రవరంలో జయహో బీసీ సదస్సు నిర్వహించామని, ఇప్పటివరకూ అంత జనాలు రాలేదని టీడీపీ నేతలు చంకలు గుద్దుకున్న విషయం తెలిసిందే. వాస్తవంగా ఆ సభలో చంద్రబాబు ప్రసంగం ప్రారంభించేసరికే జనాలు గుంపులుగా వెళ్లిపోయారు. ఆ ప్రాంగణంలో కుర్చీలు దాదాపు ఖాళీ అయిపోయాయి. అయినప్పటికీ బీసీలు తమ వెంటే ఉన్నారని, కనీవినీ ఎరుగని రీతిలో సభ జరిగిందని టీడీపీ నేతలు సంబరపడ్డారు. తటస్తులైన బీసీ నేతలను పిలవకుండా ఎంతసేపూ టీడీపీ నేతల భజనతో కానిచ్చేసి అదే తమ గొప్పతనంగా చెప్పుకున్నారు. కానీ ఏలూరు వేదికగా జరిగిన బీసీ గర్జన ఆద్యంతం కిక్కిరిసిపోయి కనిపించింది. తటస్తులైన ఆర్.కృష్ణయ్య లాంటి బీసీ నేతలు వచ్చి వైఎస్సార్ సీపీకి ఉన్న చిత్తశుద్ధిని వివరించడం ఆ వర్గాల్లో పార్టీ పట్ల నమ్మకం కలిగించింది. టీడీపీ జయహో బీసీ సభకు, వైఎస్సార్ సీపీ బీసీ గర్జనకు పోలికే లేదని, ఏలూరు వచ్చిన జనాల్లో సగం కూడా రాజమహేంద్రవరం రాలేదని పలువురు చర్చించుకోవడం కనిపించింది.
సంతోషంలో బీసీ ఉప కులాలు
బీసీ గర్జనలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన డిక్లరేషన్‌లో ఉప కులాలన్ని ంటికీ చోటు దక్కింది. అందరికీ ప్రాధాన్యం కల్పిస్తూ హామీలివ్వడమే కాకుండా, వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వారికేం చేస్తారో జగన్ ప్రత్యేకించి చెప్పారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ తమను పూర్తిగా విస్మరించిందని, కానీ వైఎస్సార్ సీపీ బీసీ డిక్లరేషన్‌లో తమను ప్రత్యేకంగా చూడటం ఆనందాన్నిచ్చిందని పలువురు బీసీ నేతలు బాహాటంగానే చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment