సంబేపల్లె: ఇంజనీరింగ్ కళాశాలలో చేరినప్పటి నుంచి వారు ప్రాణ స్నేహితులుగా మెలిగారు.. మూడేళ్లుగా ఎక్కిడికైనా ఇద్దరూ కలిసే వెళ్తుండే వారు.. చివరకు మరణంలోనూ వారు స్నేహాన్ని వీడలేదు.. ఈ హృదయ విదారక సంఘటన సంబేపల్లె మండలంలోని టీటీడీ కల్యాణ మండపం సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. కడప-చిత్తూరు జాతీయ రహదారిలో తెల్లవారుజామున వీరు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వారు మృతి చెందారు. వారు ఇద్దరూ తిరుపతిలోని సిద్దార్థ కళాశాలలో బీటెక్ (సీఎస్‌ఈ) మూడవ సంవత్సరం చదువుతుండే వారు.
సంబేపల్లి మండలంలోని దుద్యాల గ్రామం పొట్టిరెడ్డిగారిపల్లెకు చెందిన నాగిరెడ్డి కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డి, చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తేనెపల్లెకు చెందిన పద్మభూషణ్‌రెడ్డి కుమారుడు శివకుమార్‌రెడ్డి ద్విచక్ర వాహనంపై తిరుపతి నుంచి కడపకు ఓ పనిపై వచ్చారు. వారు తిరిగి తిరుపతికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ సంఘటన చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో శివకుమార్‌రెడ్డి(24) అక్కడికక్కడే మృతి చెందాడు. పవన్‌కుమార్‌రెడ్డి(24)ని తిరుపతికి ఆసుపత్రికి 108లో తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో మరణించాడు.
శివకుమార్ అన్న గతేడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఉన్న ఇద్దరు కుమారులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పవన్‌కుమార్‌రెడ్డికి ముగ్గురు అక్కలు ఉన్నారు. ఆయన తల్లి కువైట్‌లో ఉంది. ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో సిద్దార్థ కళాశాల యాజమాన్యం సెలవు ప్రకటించింది. యాజమాన్యంతోపాటు రాయలసీమ విద్యా సంస్థల డెరైక్టర్ ఆనందరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు కళాశాల బస్సుల్లో మృతుల ఊర్లకు వెళ్లి సంతాపం ప్రకటించారు. కేసు దర్యాప్తులో ఉంది.
మృత్యువులోనూ వీడని బంధం
Published Sat, Aug 22 2015 2:29 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
Advertisement