ఐఐటీ ఇక్కడే!
సాక్షి, విశాఖపట్నం: ఐఐఐటీ, ఐఐటీ, ఐఎస్‌బీ, నిఫ్ట్, ఐఐఎస్‌టీ, ఐఐసీటీ, నైపర్.. ఇవన్నీ ప్రఖ్యాత ఇంజినీరింగ్, సైన్స్ క్యాంపస్‌లు. ఇందులో సీటు వస్తే విద్యార్థుల భవిష్యత్తు బంగారుమయమైపోతుంది. అందుకే వీటిలో సీటు కోసం లక్షలాది మంది విద్యార్థులు ఏటా పోటీపడుతుంటారు. ఇకపై ఇక్కడి విద్యార్థులు నగరంలోనే కోరుకున్న క్యాంపస్‌లో చదువుకునే రోజులు ఎంతో దూరంలో లేవు. ప్రస్తుతం హైదరాబాద్‌కే పరిమితమైన కీలక వర్సిటీలను విభజన కారణంగా సీమాంధ్రలోనూ స్థాపించేందుకు కేంద్రంకసరత్తు చేస్తోంది. సీమాంధ్రలో సకల వసతులున్న ప్రాంతంలో వీటిలో కొన్ని నెలకొల్పడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రఖ్యాత జాతీయస్థాయి క్యాంపస్‌ల స్థాపనకు పూర్తి అర్హత ఉన్న ఏకైక నగరంగా విశాఖ అందరి దృష్టి ఆకర్షిస్తోంది.
అన్నీ అనుకూలాంశాలే...
సువిశాల క్యాంపస్‌లకు కావలసిన వందలాది ఎకరాల భూములు, ఎయిర్‌పోర్టు, రైలు కనెక్టవిటీ, క్యాంపస్ విద్యార్థుల ప్రయోగాలకు వేదికగా చెంతనే రకరకాల పరిశ్రమలు..ఇవన్నీ ఏ యూనివర్సిటీ స్థాపనకైనా అవసరం. ఇవన్నీ కలబోతగా ఉన్న విశాఖను క్యాంపస్‌ల స్థాపనకు అర్హతల పరంగా ముందువరుసలో ఉండేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా విశాఖకు ప్రముఖ క్యాంపస్‌లు వచ్చే అవకాశం ఉంది. ఐఐటీ, ఐఐఐటీ, ఐఎస్‌బీ తదితర క్యాంపస్‌ల కోసం కేంద్రం ఇప్పుడు అనువైన ప్రాంతాలను అన్వేషిస్తోంది. తొలి ప్రాధాన్యం విశాఖకే ఇచ్చే వీలుంది.
ఒక్కో వర్సిటీకి కనీసం 500 ఎకరాలు అవసరం. అంతర్జాతీయ నిపుణులు, ప్రాజెక్టుల ప్రతినిధులు, గెస్ట్, రీసెర్చ్ ఫ్యాకల్టీ తదితరులు రావడానికి అనువుగా అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం ఉండాలి. విద్యార్థులు రీసెర్చ్, ప్రాజెక్టు వర్క్, క్యాంపస్‌లు, పరిశ్రమలు కలిసి పరిశోధనలు చేయడానికి అనువుగా నగరం చుట్టుపక్కల కంపెనీలుండాలి. రీసెర్చ్‌కు ల్యాబ్‌లుండాలి. ఈ సదుపాయాలన్నీ విశాఖలోనే ఉన్నాయి. తక్షణమే భూ లభ్యత కూడా ఉండడంతో కేంద్రం విశాఖనే ప్రాథమ్యంగా ఎంచుకునే అవకాశం ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. త్వరలో విశాఖకు ప్రతిష్టాత్మక క్యాంపస్‌లు వచ్చే వీలుందని అంటున్నారు.
ఇప్పటికైనా రావలసిందే...
వాస్తవానికి విశాఖకు ప్రఖ్యాత క్యాంపస్‌లు ఎప్పుడో మంజూరు కావలసి ఉంది. కానీ ఆచరణలో అనేక ఏళ్లుగా అన్యాయం జరుగుతూనే ఉంది. గతంలో నగరానికి ఐఐఎఫ్‌టీ, ఐఐటీ, ఐఐఐటీ, ఇన్నోవేషన్ వర్సిటీ, ఐఐఎం వచ్చే అవకాశం ఏర్పడింది. ఆ సమయంలో ఎంపీగా ఉన్న పురందేశ్వరితో పాటు ఇతర నేతలు వీటిని విశాఖకు తీసుకువచ్చేందుకు పూర్తిస్థాయిలో మనసు పెట్టలేదు. కనీసం విశాఖలో ఉన్న సౌకర్యాలను వివరిస్తూ ప్రతిపాదనలు పంపడంలో విఫలమయ్యారు. దీంతో హైదరాబాద్ తర్వాత విశాఖలో కొత్త, అదనపు వర్సిటీల ఏర్పాటుకు ఎన్నో అవకాశాలున్నా నేతల గట్టి ప్రయత్నాలు లేక ఏ ఒక్కటీ ఇక్కడికి రాలేదు. వాస్తవానికి ఇన్నోవేషన్ యూనివర్సిటీ విశాఖకు మంజూరైందని ప్రకటించారు.
భూ సేకరణ చేయాలని కలెక్టర్ ప్రయత్నించారు. కానీ దానికి అతీగతి లేదు. యూజీసీ కొత్త పాలసీ ప్రకారం ఇన్నోవేషన్ యూనివర్సిటీలను దేశవ్యాప్తంగా 10 చోట్లకుపైగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో భూముల లభ్యత సమస్య కారణంగా విశాఖకు ఇది వచ్చే వీలు ఏర్పడింది. విశాఖకు కావాలి అని అడిగేవారు లేక ఇదికాస్తా పోయింది. ఐఐఐటీ విశాఖకు వచ్చేస్తోందని ఎప్పటినుంచో నేతలు ప్రచారం చేశారు. అది కూడా కాకినాడకు పోయింది. ఇప్పుడు గట్టిప్రయత్నం జరిగితే నగరానికి క్యాంపస్‌లు క్యూకట్టడం ఎంతో దూరంలో లేదని చెప్పవచ్చు.